close

తాజా వార్తలు

విలీనం మినహా 21 డిమాండ్ల పరిశీలన

ఈడీలు, ఆర్థిక సలహాదారుతో కమిటీ
  రెండు రోజుల్లో సిద్ధంకానున్న నివేదిక
  తదుపరి విచారణలో హైకోర్టుకు సమర్పణ
  వెయ్యి అద్దె బస్సులకు నోటిఫికేషన్‌
  భాజపా వైఖరిపై ప్రధానికి, కేంద్రమంత్రికి లేఖ
  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలో నిర్ణయాలు
  నాలుగు గంటల పాటు సమావేశం
  ఆర్టీసీ కార్మికులు విలీనం డిమాండును
  వదులుకున్నారని సీఎం వ్యాఖ్య
ఈనాడు - హైదరాబాద్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పట్టుపట్టబోమని కోర్టులో కార్మిక సంఘాల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్‌ వదులుకున్నట్లయింది. వారు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ డిమాండ్లను అధ్యయనం చేయండి.

కాంగ్రెస్‌, భాజపాలు ఆర్టీసీ విషయంలో చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌(ఆర్టీసీ)ను, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి భాజపా నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌ సీఎంగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది.’

- సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు మినహా కార్మిక సంఘాల ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన అయిదుగురు అధికారులతో కమిటీని నియమించింది. ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్‌కుమార్‌, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లుతో పాటు ఆర్థిక సలహాదారు ఎన్‌.రమేశ్‌లు ఇందులో ఉన్నారు. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకట్రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. దీన్ని తదుపరి విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పిస్తారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్బలంతో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్‌, భాజపా పార్టీలు మద్దతు పలకడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్‌, భాజపా పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక భాజపా నాయకులు రాద్ధాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే విషయాన్ని చర్చించారని సీఎం కార్యాలయం పేర్కొంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ముఖ్య కార్యదర్శులు సునీల్‌ శర్మ, నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, రవాణా కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సారాంశాన్ని అధికారులు సీఎంకు నివేదించారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ...

‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే మా ప్రథమ అవసరం అని కూడా చెప్పారు. కార్మిక సంఘాల తరఫున హైకోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ నెరవేరితే తప్ప చర్చలకు రాబోమని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్‌ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు వెల్లడించిన కార్మికుల డిమాండ్లను అధ్యయనం చేయండి’’ అని అధికారులను ఆదేశించారు.

వారిద్దరిదీ విచిత్ర వైఖరి
‘‘భాజపా, కాంగ్రెస్‌లు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నారు. 1950లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్‌ వాహనాల చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా చట్టంలో పేర్కొన్నారు. అందులోని 3వ సెక్షన్‌కు సవరణలు చేస్తూ మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం 2019 బడ్జెట్‌ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. ‘మోటార్‌ వెహికిల్‌ (అమెండ్‌మెంట్‌) యాక్టు 2019’ పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కేంద్రం పేర్కొంది. మొబైల్‌ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది భాజపా నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.