close

తాజా వార్తలు

దమ్మున్నోడు

ఈనాడు క్రీడావిభాగం

9 ఏళ్ల కిందటి మాట..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో 21  పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీ చరిత్రలోనే ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇది. తానాడిన తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగే బంతులతో  హైదరాబాద్‌ను కుప్పకూల్చిన ఆ బౌలర్‌ అప్పటికి ఓ అనామకుడు!

2 ఏళ్ల క్రితం సంగతి..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఒక కొత్త కుర్రాడు విజృంభించాడు.. ఎవరితను అనుకునేలోపే టోర్నీలో తన ముద్ర వేస్తూ వికెట్‌  మీద వికెట్‌ సాధించాడు..ఆ తర్వాత చెన్నై జట్టుకు స్ట్రెయిక్‌ బౌలర్‌గా మారాడు. రెండు సీజన్ల ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న ఆ కుర్రాడు  అప్పటికి ఓ నమ్మకమైన బౌలర్‌.

ఇప్పుడు..

మంచుతో తడిసిన బంతి మీద పట్టే చిక్కట్లేదు.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ బాదేస్తున్నారు.. మ్యాచ్‌ చేజారేలా ఉంది! ఇలాంటి స్థితిలో ప్రత్యర్థిని ఠారెత్తించి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి.. హ్యాట్రిక్‌తో అదరగొట్టి టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పి భారత్‌కు సిరీస్‌ అందించాడు.. ఇప్పుడా పేసర్‌ రాత్రికి రాత్రే హీరోగా  అవతరించిన ఓ ప్రతిభావంతుడు!

ఈ వ్యాఖ్యానాలన్నీ బంగ్లాదేశ్‌పై కళ్లు చెదిరే బౌలింగ్‌తో హ్యాట్రిక్‌ చేసి భారత్‌కు టీ20 సిరీస్‌ అందించిన దీపక్‌ చాహర్‌ గురించే.. ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ ఆటగాడు ఇప్పుడు భారత అమ్ములపొదిలో కొత్తగా చేరిన పేసాస్త్రం.

‘‘ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడడం వల్ల మంచు ప్రభావాన్ని అధిగమించి ఎలా బౌలింగ్‌ చేయాలో నేర్చుకున్నా. మంచు వల్ల బంతి చేజారకుండా ఉండడం కోసం చేతులు పొడిగా ఉంచుకునే వాడిని. ఇందుకోసం పొడి మట్టిని చేతులకు రుద్దేవాడిని. ఈ మ్యాచ్‌లో కీలక ఓవర్లు వేయాల్సి ఉంటుందని కెప్టెన్‌ రోహిత్‌ ముందే చెప్పాడు. బుమ్రాలా నిన్ను ఉపయోగించుంటానని అతను అన్నాడు.  హ్యాట్రిక్‌ సాధించానని మ్యాచ్‌ ముగిశాక తెలుసుకున్నా’’
- చాహర్‌
మొన్న బుమ్రా.. నిన్న  షమి.. ఇప్పుడు దీపక్‌ చాహర్‌! ప్రపంచ క్రికెట్లో ముద్ర వేసిన భారత పేసర్ల జాబితాలో మరో పేరు చేరింది. బంగ్లాతో మూడో టీ20లో సంచలన ప్రదర్శనతో ఆరు వికెట్లు తీసిన చాహర్‌ రూపంలో మరో పేస్‌ ఆయుధం టీమ్‌ఇండియాకు చిక్కింది. మంచు ప్రభావం ఉన్న మ్యాచ్‌లో చాహర్‌ బౌలింగ్‌ అభిమానులకు కొత్తగా అనిపించినా.. అతనికి కొత్తేం కాదు. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో, తేమ వాతావరణంలో, బంతి పట్టు చిక్కనప్పుడు, ప్రత్యర్థి ఊపు మీద ఉన్నప్పుడు బౌలింగ్‌ ఎలా చేయాలో అతనికి కొట్టిన పిండి. దేశవాళీ టోర్నీల్లో ఆరంభంలోనే తన స్వింగ్‌తో సంచలనం సృష్టించిన చాహర్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన తర్వాతే ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ధోని సహచర్యంలో బౌలింగ్‌లో స్థిరత్వం, కచ్చితత్వం సాధించిన చాహర్‌.. తెలివిగా బౌలింగ్‌ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో అతను ఇలాంటి బౌలింగ్‌తోనే బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేశాడు.

చాపెల్‌ వద్దంటే..

దీపక్‌ చాహర్‌ ప్రస్థానమే నైరాశ్యంతో మొదలైంది. 2008లో రాజస్థాన్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా గ్రెగ్‌ ఛాపెల్‌ ఉన్నప్పుడు సెలక్షన్‌కు వెళ్లిన చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నువ్వు క్రికెటర్‌గా పనికిరావని చాహర్‌ మొహం మీదే చెప్పేశాడు చాపెల్‌..! కానీ పట్టుదల వీడని దీపక్‌.. మరింత ఫిట్‌గా మారి, బౌలింగ్‌లో మార్పులు చేసుకుని, పేస్‌ పెంచి బరిలో దిగాడు. రంజీలో హైదరాబాద్‌పై 10 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి అందర్ని తనవైపు తిప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ కుర్రాడికి అదృష్టం కలిసిరాలేదు. 2012లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ జట్టుకు ఆడినప్పుడు చాహర్‌ ప్రతిభను గుర్తించిన ధోని.. అతణ్ని చెన్నై జట్టులోకి రప్పించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆడిన తొలి రెండు సీజన్లలోనే చాహర్‌ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారాడు. అతను ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 32 వికెట్లు పడగొడితే అందులో గత సీజన్లోనే 22 వికెట్లు తీశాడు. బంతిపై నియంత్రణ, సంధించే తీరు, వేగంలో మార్పులు, సమయానుకూల స్పందన, వైవిధ్యం.. ఈ లక్షణాలన్నీ చాహర్‌ను ప్రత్యేక బౌలర్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా బంతిని బాదేందుకు బ్యాట్స్‌మెన్‌ సిద్ధమయ్యే పవర్‌ ప్లే, డెత్‌ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేయడాన్ని దీపక్‌ అలవాటు చేసుకున్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శనతోనే 2018 జులైలో ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన దీపక్‌.. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఆ ఏడాదే అఫ్గానిస్థాన్‌పై ఏకైక వన్డే కూడా ఆడాడు. ఒత్తిడిలోనూ ఒక కొత్త పేసర్‌ ఇలా గొప్ప ప్రదర్శన చేయడం భారత జట్టుకు శుభసూచకం. బుమ్రా గాయపడడం, భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌లో లేకపోవడం, షమిని టీ20లకు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల దీపక్‌ చాహర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అలా చిక్కిన అవకాశాన్నే రెండు చేతులతో అంది పుచ్చుకున్న ఈ పేసర్‌.. సీనియర్లకు సవాల్‌ విసిరాడు. అయితే బంగ్లాపై ప్రదర్శనతో దీపక్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వడం పక్కా. ఈ అవకాశాలనూ అతను సద్వినియోగం చేసుకుంటే కేవలం టీ20 జట్టులోనే కాదు వన్డే జట్టులోనూ పాగా వేసేయొచ్చు!

చాహర్‌ 88 స్థానాలు పైకి..

దుబాయ్‌: అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకబిగిన 88 స్థానాలు ఎగబాకడం విశేషం. తాజా ర్యాంకుల్లో అతడు 42వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్‌-10 బౌలర్లలో ఎనిమిది మంది స్పిన్నర్లే కావడం విశేషం. బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో అత్యుత్తమ స్థానం అతడిదే. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది.

493

ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో దీపక్‌ విసిరిన బంతులు. అతడు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 616 బంతుల్లో దీపక్‌ వాటా 80 శాతం ఉంది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.