close

తాజా వార్తలు

చర్చల సమయం ముగిసింది

ఇక చట్టపరిధిలోనే విచారించి తేలుస్తాం: హైకోర్టు
  ఎవరూ తగ్గలేదు
  చర్చలు జరపాలంటూ కోర్టు ఎవరినీ ఆదేశించలేదు
ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి రాదు
  సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించడానికి ఇది వేదిక కాదు
  కార్మిక న్యాయస్థానమే అందుకనువైనది
  ఆర్టీసీ సమ్మెపై న్యాయస్థానం వ్యాఖ్యలు
  విచారణ నేటికి వాయిదా
  పర్మిట్ల జారీపై స్టే పొడిగింపు
ఈనాడు - హైదరాబాద్‌

దాంపత్య వివాదంలో భార్యా భర్తల సయోధ్య కోసం కోర్టు అవకాశం ఇస్తుంది. అది విఫలమైతే చర్చించి తీరాలని కోర్టు చెప్పలేదు. చట్ట ప్రకారం తేలుస్తుంది. ఇక్కడా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి, ఆర్టీసీకి, యూనియన్లకు కావాల్సినంత సమయమిచ్చాం. ఎవరూ తగ్గలేదు. చర్చలు జరపాలని కోర్టు ఎవరినీ ఆదేశించజాలదు. ఇక వ్యవహారాన్ని చట్టపరిధిలోని అంశాల ఆధారంగానే తేలుస్తాం.

సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడానికి ఇది సరైన వేదిక కాదు. అది తేల్చాల్సింది కార్మిక న్యాయస్థానం. చర్చల మధ్యవర్తిత్వం విఫలమైనట్లు అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కార్మిక న్యాయస్థానానికి పంపాలా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలా కాని పక్షంలో నివేదికను కార్మిక న్యాయస్థానానికి పంపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆర్టీసీ ఈ కోర్టును ఆశ్రయించవచ్చు. ఇక్కడ ఆర్టీసీ మా ముందు లేనపుడు మేం అలా ఆదేశాలివ్వలేం. యంత్రాలు వెళ్లలేని చోటుకు అవివేకులు వెళతారని, అలా తాము వెళ్లలేమని వ్యాఖ్యానించింది. కోర్టులు ఏ ఆదేశాలైనా ఇవ్వగలవని, అవి చట్టానికి అతీతమనే భావన చాలామందిలో ఉంది. మేం బాధ్యతలు స్వీకరించే ముందు రాజ్యాంగానికి, చట్టానికి కట్టుబడి ఉంటామనే ప్రమాణం చేశాం.

-హైకోర్టు
 

అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలో ఆర్టీసీ లేదని, దాని కింద ఎలాంటి ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోనే ఉందని చెప్పింది. ప్రజోపయోగ సర్వీసులకు సంబంధించిన వ్యవస్థలు పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలో ఉంటాయని, ఇవి అత్యవసర సేవలకు చెందినవి కాదంది. చర్చల సమయం ముగిసిందని, ఎవరూ మెట్టు దిగకపోవడంతో ఇక దానిపై చర్చ అనవసరమని వ్యాఖ్యానించింది. చర్చలకు వెళ్లాలంటూ తామెవరినీ ఆదేశించజాలమని, ఆ అధికారం ఈ కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనియన్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ దాఖలు చేశారని, చర్చలు జరిపేలా ఆదేశాలివ్వాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ తామెవరినీ ఆదేశించలేదని, దాన్ని తాము పరిశీలించలేదని తెలిపింది. చర్చలు జరపాలని చెప్పినా ఎవరూ పట్టించుకోనందున ఇకపై అంశాల ఆధారంగా వింటామంది. పిటిషనర్‌ కోరినట్లుగా సమ్మె చట్టవిరుద్ధమంటూ ప్రకటించే అధికారం ఈ కోర్టుకుందా? కార్మిక న్యాయస్థానానికి ఉందా చెప్పాలంది. చర్చలు జరపాలన్న ప్రజా బాధ్యత ప్రభుత్వంపై ఉంటే చెప్పాలంది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య కోరగా ఆ అధికారం ఎక్కడుందో చెప్పాలంది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద సమ్మెలోకి వెళ్లే హక్కు యూనియన్లకు ఉందని తెలిపింది. చట్టం అనుమతించినపుడు విరమించమని చెప్పడం ఎంతవరకు న్యాయమంది. ఏ పారిశ్రామిక వివాదమైనా అది యాజమాన్యం, కార్మికుల మధ్యనే ఉంటుందని, చర్చలకు అడుగు యాజమాన్యం నుంచి పడాలని.. మూడో వ్యక్తి మధ్యలోకి రాలేరంది.

ఆర్టీసీ కూడా ఏం చేయలేదు
చర్చల మధ్యవర్తిత్వం విఫలమైనట్లు అధికారి రిపోర్టు ఇచ్చారని, ఆ నివేదికను ప్రభుత్వం కార్మిక న్యాయస్థానానికి పంపాలని, అది పంపలేదని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం నుంచి అలాంటి రెఫరెన్స్‌ వచ్చాకే కార్మిక న్యాయస్థానం తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని తెలిపింది. ఈ దశలో ఆర్టీసీ కూడా ఏం చేయలేదని పేర్కొంది. చర్చలు స్వచ్ఛందంగా ఉండాలి తప్ప హైకోర్టు ఆదేశించిందని జరపడం సరికాదంది. ఆర్టీసీపై కూడా ప్రజాబాధ్యత ఏమీ లేదని, చర్చలు జరపకపోవచ్చంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అత్యవసర సేవల విభాగంలో ఉన్నవారు సమ్మెకు వెళ్లరాదని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పలుమార్లు చెప్పిందన్న వాదనతో ధర్మాసనం విభేదిస్తూ ఎస్మా కింద ఆర్టీసీ నిర్వచించి ఉండాలని, ఏపీ ఎస్మా 1971లో అత్యవసర సేవలను నిర్వచించారని, అందులో ఆర్టీసీ లేదంది. దీనికి సంబంధించి న్యాయవాది జీవో అందజేయగా దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఆర్టీసీ ఎస్మా కింద లేదంది. అందులో ప్రజోపయోగ సర్వీసుల పరిధిలో ఉన్నట్లు పేర్కొందని తెలిపింది. ఎస్మా సెక్షన్‌ 2 (6) ఆర్టీసీ సేవలను ప్రకటిస్తేనే దాని పరిధిలోకి వస్తుందని, ఆర్టీసీ అత్యవసరమైతే వారు ఇప్పటికే ప్రకటించేవారంది. ప్రజోపయోగ సర్వీసులను అత్యవసర సేవల కింద ప్రకటించే అధికారం చట్టసభలకు ఉందని పేర్కొందని, అలా ప్రభుత్వం ప్రకటించి ఉంటే చెప్పాలంది. న్యాయవాది స్పందిస్తూ ఐడీ యాక్ట్‌ సెక్షన్‌ 22 కింద సమ్మె చట్టవిరుద్ధమని, యూనియన్లకు హక్కులున్నాయని, అయితే ముందుగా నోటీసు ఇవ్వాలన్నారు. నోటీసు జారీ చేశాక కొంత కాలం ఆగాలని చెప్పారు. అక్టోబరు 4న మధ్యవర్తిత్వ చర్చలు (కన్సిలేషన్‌ ప్రొసీడింగ్స్‌) పూర్తికాకపోయినా యూనియన్లు బయటికి వెళ్లి అక్టోబరు 5 నుంచి సమ్మెకు దిగాయన్నారు. కన్సిలేషన్‌ ప్రొసీడింగ్స్‌ అయ్యాక 7 రోజులు వేచి చూడాల్సి ఉందన్నారు.

ఎవరు అడగాలి... ఎవరు ప్రకటించాలి
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది...ఎవరు అడిగితే ప్రకటించాలని ధర్మాసనం ప్రశ్నించింది. కన్సిలేషన్‌ నివేదికను ప్రభుత్వం లేబర్‌ కోర్టుకు పంపకపోతే ఏం చేయాలన్నదానిపై చట్టం మౌనంగా ఉందని, ఈ దశలో ఆర్టీసీ కూడా ఏం చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 24 కింద సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించవచ్చన్నారు. ఆర్టీసీ అడిగితే కన్సిలేషన్‌ అధికారి చట్టాన్ని అమలు చేయవచ్చన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కార్మికులు సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం నివేదికను కోర్టుకు రిఫర్‌ చేయలేదని, ఆర్టీసీ మధ్యలో ఇరుక్కుందని, పరిస్థితులు అసందిగ్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి నివేదికను కోర్టుకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడగవచ్చా అని ప్రశ్నించింది. ఆర్టీసీ హైకోర్టు ముందుకు రావచ్చని విద్యాసాగర్‌ చెప్పగా ఆర్టీసీ తమ ముందుకు రాలేదని, అలాంటప్పుడు మాకు అధికారం లేకుండా ఎలా ఆదేశించగలమంది.

పరిధికి మించి ఆదేశాలివ్వలేం

సమ్మెను ప్రారంభించడాన్నే సవాలు చేశామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పగా కార్మికులకూ హక్కులున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే తాము ఆదేశాలివ్వగలమంది. ఎవరివైపు న్యాయం ఉందో తాము తేల్చలేమని, ఏదైనా నిర్ణయించడానికి ఓ విధానం ఉందని పేర్కొంది. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పరిధికి మించి అడగరాదని, లేని అధికారాలున్నాయనుకుంటూ ఆదేశాలివ్వాలని కోరరాదంది. నివేదికను కోర్టుకు పంపాలని  ప్రభుత్వాన్ని కోరండి, లేదంటే ఆర్టీసీని తమ వద్దకు రావాలని చెప్పాలంది. కేసు ఏదైనా చట్టం ఆధారంగా తేలుతుందని, ఉద్వేగాలు, లేని సానుభూతుల ఆధారంగా తేల్చలేమంది.

ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు
ప్రైవేటీకరణలో భాగంగా 5100

పర్మిట్ల జారీని నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. స్టే ఉత్తర్వులు సోమవారం వరకే ఉన్నాయని, వాటిని పొడిగించని పక్షంలో పర్మిట్ల జారీ ప్రక్రియను పూర్తి చేస్తారని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్టే పొడిగిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.