close

తాజా వార్తలు

పూర్తిగా ఆంగ్ల బోధనే

 నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలలన్నీ మారుస్తాం
 మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలంటే తప్పదు
 తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు, ఉర్దూలలో ఒకటి
 చంద్రబాబు, వెంకయ్య, పవన్‌ పిల్లలు ఏ మీడియం?
 మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌
ఈనాడు - అమరావతి, గుంటూరు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతుందని.. ఇందుకు అనుగుణంగా రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఆంగ్లమాధ్యమంలోకి మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఆంగ్లం రాకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరన్నారు. సరైన ఉద్యోగాలు రావాలంటే ఆంగ్లం వచ్చి తీరాలని చెప్పారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, విద్యాశాఖలు భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు, ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం విద్యా పురస్కార అవార్డుల ప్రదానోత్సవాలను విజయవాడలో సోమవారం నిర్వహించాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. మన పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించాలనే తపనతో తాను ముందుకెళ్తున్నానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తేనే ఇది సాధ్యమవుతుందని తాను ఆరాటపడుతుంటే కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయన్నారు. ఆంగ్ల మాధ్యమం పేదవాడికి ఎందుకు? తెలుగు చాలదా అంటూ కొందరు విమర్శిస్తున్నారన్నారు. అలా అంటున్నది చిన్నవాళ్లు కాదని, ఏకంగా చంద్రబాబు లాంటి పెద్దవాళ్లు.. వెంకయ్యనాయుడి లాంటి ఇంకా పెద్దవాళ్లు.. పవన్‌కళ్యాణ్‌ లాంటి ఇంకా పెద్దవాళ్లు అంటూ విమర్శించారు. వీళ్లు చాలరన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా రాస్తున్నారన్నారు. పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలోకి మారి అందరూ చదువుకుంటే రాష్ట్రం బాగుపడదా? పిల్లలకు మంచి చేసినవారం అవుతాం కదా..? అనే విషయాన్ని వీరంతా గుండెలపై చేయివేసుకుని ఆలోచించాలన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వెంకయ్యనాయుడి కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని తాను అడుగుతున్నానన్నారు.
నవంబరు 14న బాలల దినోత్సవం నుంచి ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించే గొప్ప కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని 45వేల పాఠశాలల్లో తొలివిడతగా 15వేల బడుల్లో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.  పాఠశాలలన్నింటినీ తీర్చిదిద్దిన తర్వాత ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను నెలకొల్పుతామన్నారు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసే కార్యక్రమాన్ని అమలుచేస్తామని జగన్‌ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తామన్నారు. తర్వాత వరుసగా నాలుగేళ్లలో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున.. పదోతరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేస్తామని ప్రకటించారు. విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతుందని, అయితే తెలుగు, ఉర్దూలలో ఏదో ఒకటి తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని అన్నారు. డిసెంబరు లేదా జనవరిలో అమ్మఒడి కార్యక్రమం అమలుతేదీని ప్రకటిస్తామన్నారు.

ఉపరాష్ట్రపతిపై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి: కన్నా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్‌ వెంటనే వెంకయ్యనాయుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని, అలాగని మాతృభాషను చంపాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలుగుకు 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాచీనభాషగా గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. గుంటూరులో సోమవారం రాత్రి కన్నా విలేకరులతో మాట్లాడారు. ‘‘మాతృభాషకు సంబంధించి ఉపరాష్ట్రపతి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని సూచన చేశారు తప్ప.. ప్రత్యేకంగా రాష్ట్రం గురించి మాట్లాడలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు పలు సూచనలు చేస్తారు. వాటిని స్వీకరించొచ్చు.. స్వీకరించకపోవచ్చు. కానీ వారిని నిందించడం తగదు’’ అని ముఖ్యమంత్రికి హితవు పలికారు. రాజ్యాంగపదవిలో ఉన్నవారిని, పెద్దవారిని పేర్లుపెట్టి పిలిస్తే తాము పెద్దోళ్లం అవుతామనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. ‘‘తెలుగు ప్రాచీనహోదా కేంద్రాన్ని నెల్లూరులో పెట్టాలని, దాని సాధన కోసం శ్రమించిన వెంకయ్యనాయుడిపైనే సీఎం విమర్శలు చేయటం బాధాకరం. మాతృభాషలో చదివినవారికే 98.5 శాతం నోబెల్‌ బహుమతులు వస్తున్నాయి’’ అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకున్నది మీరే

జగన్‌ గారూ! మీరూ, మీ పత్రిక గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసిన విషయం గుర్తులేదా? నగరపాలక పాఠశాలల్లో తెదేపా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తే మీరు అడ్డుకున్నారు. ‘ఎందుకంత తెగులు? ‘తెలుగు లెస్సేనా?’ అంటూ ఉద్యమం చేశారు. ‘ఇంగ్లిషు మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?
-ట్విటర్‌లో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

* తెలుగును విస్మరిస్తామంటే కుదరదు..  ఉపరాష్ట్రపతిపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి

- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

* మాతృభాషను కాపాడుకోవాలన్న మీ వైఖరి ఇప్పుడేమైంది?

- 2016 నాటి జగన్‌ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ పవన్‌ కల్యాణ్‌ సూటి ప్రశ్న

* అప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకున్నది మీరే కదా?

- నిగ్గదీసిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

* మాతృభాషను మృతభాషగా మార్చడం దుర్మార్గం

- మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజం

* జగన్‌కు తెలుగులో చదవడం రాదు

 - భారతీయ జనతా యువమోర్చా

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.