close

తాజా వార్తలు

ప్రజాస్వామ్యానికి ముప్పు

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు తగవు
ప్రభుత్వ జోక్యం సెన్సార్‌షిప్పే
ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఎన్‌బీఏ తీవ్ర ఆక్షేపణ
ముఖ్యమంత్రి జగన్‌కు ఘాటు లేఖ

దిల్లీ: మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును న్యూస్‌ బ్రాడ్‌క్యాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఎన్‌బీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలివీ..

‘‘మీడియా/ ప్రెస్‌కు.. ముఖ్యంగా వార్తలు, వర్తమాన అంశాలను రాసే మీడియాకు రాజ్యాంగంలోని 19 (1)(ఎ) కింద వాక్‌ స్వాతంత్య్ర, భావ వ్యక్తీకరణ హక్కు ఉందన్న సంగతి మీకు తెలుసు. అలాగే సమాచారాన్ని పొందే హక్కు ప్రజలకు ఉంది. ఈ హక్కుతో పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో వార్తా మాధ్యమాలను ప్రజాస్వామ్యానికి ‘నాలుగో స్తంభం’గా భావిస్తారు. ప్రజాస్వామ్యంలో అంతర్భాగంగానూ పరిగణిస్తారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా దీని ఉనికి అత్యంత ఆవశ్యకమని కూడా చెబుతారు. పౌరులు బహిరంగ చర్చలు జరపడానికి, అర్థవంతమైన నిర్ణయాలకు రావడానికి; తప్పులు, అవకతవకలు, చట్టాల ఉల్లంఘనలను, నేరాలను వెలుగులోకి తీసుకురావడంలోను ఇది ముఖ్య భూమిక వహిస్తోంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం ద్వారా మీడియా.. ప్రజాస్వామ్య మనుగడకు అవసరమైన సేవలను అందిస్తోంది. స్వతంత్ర, భయానికి తావులేని, గతిశీల మీడియా నిజమైన ప్రజాస్వామ్యానికి చాలా కీలకం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీడియా స్వతంత్రత, స్వేచ్ఛపై ఆంక్షలు పెడితే అది ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. ఇది ఆమోదయోగ్యం కాదు.

స్వేచ్ఛతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని ఎన్‌బీఏకి తెలుసు. ఆ బాధ్యతల నిర్వహణలో ప్రభుత్వ పాత్రను గౌరవిస్తోంది. దురుద్దేశాలతో తప్పుడు వార్తలు రాయడం, పాత్రికేయ నిబద్ధతను ఫణంగా పెట్టి ఆదరణ పొందడానికి జరిగే ప్రయత్నాలను ఎన్‌బీఏ ఖండిస్తుంది. అలాంటి ప్రయత్నాలు ఎలక్ట్రానిక్‌ మాధ్యమం సహా అన్ని రకాల మాధ్యమాల విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. మీరు ఇచ్చిన ఉత్తర్వులు అమలైతే ప్రతి సందర్భంలోనూ వాస్తవాలను వెలుగులోకి తీసుకురానివ్వకుండా వార్తామాధ్యమాలను అడ్డుకున్నట్లవుతుంది. ఇది వార్తా మాధ్యమాల ఉనికిపైనే ప్రభావం చూపుతుంది. కేసులు పెడతామని విలేకరులను భయపెట్టడం, వారి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే అవుతుంది.

పారదర్శక విధానం లేకుండా వార్తల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సెన్సార్‌షిప్‌ కిందకే వస్తుంది. అది మీడియా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమిస్తుంది. స్వేచ్ఛ, స్వతంత్రతతో కూడిన మీడియా శక్తిమంతమైన భారత ప్రజాస్వామ్యానికి మూలరాయి. మీడియా స్వతంత్రతను బలోపేతం చేయడం, దానికి మద్దతుగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత. అంతేతప్ప మీడియా గొంతు నొక్కుతూ ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపకూడదు.
2008లోనే ‘వార్తా ప్రసారాల ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎన్‌బీఎస్‌ఏ)’ను ఎన్‌బీఏ నెలకొల్పిందని మీకు తెలియజేసేందుకు గర్వపడుతున్నా. సభ్య సంస్థల ఫిర్యాదులను ఎన్‌బీఎస్‌ఏ పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి దానికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. మరో ఎనిమిది మంది సభ్యులు కూడా అందులో ఉన్నారు. ఎన్‌బీఏ సభ్యత్వమున్న ఛానెళ్ల ప్రసారాలపై వచ్చే ఫిర్యాదులను సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్‌ మీడియా పర్యవేక్షణ కేంద్రం(ఈఎంఎంసీ) వెంటనే ఎన్‌బీఎస్‌ఏకు చేరవేస్తున్నాయి. ఫిర్యాదుదారులు, వీక్షకులు సంతృప్తి చెందేలా వాటిని సముచితంగా పరిష్కరించేందుకు ఎన్‌బీఎస్‌ఏ కృషిచేస్తోంది. కేంద్ర ఎన్నికలసంఘం, ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఎన్‌బీయే సభ్య ఛానెళ్లలో ప్రసారమైన వార్తలపై వచ్చిన ఫిర్యాదులతో ఎప్పటికప్పుడు ఎన్‌బీఎస్‌ఏను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా 12-01-2017న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని మీ దృష్టికి తేవాలని కూడా అనుకుంటున్నాను. 2000 సంవత్సరం నాటి రిట్‌ పిటిషన్‌(సి)-387 విషయంలో ‘కామన్‌కాజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ అదర్స్‌ ది యుఓఐ’ శీర్షికతో ఆదేశం జారీ అయింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తరఫు వాదనలను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. ఆ వాదనల ప్రకారం  సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖకు ఈఎంఎంసీ ఉంది. అడ్వర్టయిజింగ్‌ నియమావళికి కట్టుబడి ఉండేలా పర్యవేక్షించేందుకు స్వయం నియంత్రిత ఎన్‌బీఎస్‌ఏ, బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లయింట్స్‌ కౌన్సిల్‌(బీసీసీసీ), ‘అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’(ఏఎస్‌సీఐ)లు సహకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. సదరు ఉత్తర్వును ఉపసంహరించుకోవలసిందిగా మిమ్మల్ని (ఏపీ ముఖ్యమంత్రిని) అభ్యర్థిస్తున్నాను. మీడియా విశ్వసనీయత పునరుద్ధరణకు, స్వేచ్ఛగా, నిర్భీతిగా పనిచేసుకునేందుకు వీలుగా ఉపసంహరించుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’ అని రజత్‌ పేర్కొన్నారు.

మీడియాపై ఆంక్షలు సరికాదు
‘ది హిందూ’ మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ నగేశ్‌ 
బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ నగేశ్‌ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో టీడబ్ల్యూజేఎఫ్‌, హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌, టీబీజీఏ, ఐఎఫ్‌డబ్ల్యూజే, ఎన్‌ఏజే సంఘాల ఆధ్వర్యంలో సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మీడియాపై ఆంక్షలు విధించడం మంచి ధోరణికాదన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.