close

తాజా వార్తలు

మా మాట వినట్లేదు..ఉన్నత స్థాయి కమిటీ వేద్దాం

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు
తీవ్రంగా పరిశీలించండి: ప్రభుత్వానికి హైకోర్టు విజ్ఞప్తి
కమిటీ వేస్తే సమ్మె కొనసాగింపుపై పునరాలోచన: యూనియన్లు
విచారణ నేటికి వాయిదా
ఈనాడు - హైదరాబాద్‌

ఇప్పటివరకు చేసిన ప్రయత్నాల ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశ ఒక్క శాతం కూడా లేదు. ప్రభుత్వం మా మాటే వినలేదు. సరైన గౌరవమూ ఇచ్చినట్లు లేదు. కార్మిక న్యాయస్థానం మాట వింటారన్న నమ్మకమూ లేదు. ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడమే ఆఖరి అవకాశం. సమాజంలో గౌరవనీయులు, చిరపరిచితులతో కూడిన ఈ కమిటీ హైకోర్టు కంటే ఉన్నతమైనది. కనీసం వారి మాటైనా వింటారని భావిస్తున్నాం. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కమిటీ ముందు హాజరు కావాలంటూ ప్రభుత్వం, ఆర్టీసీ, యూనియన్లకు విజ్ఞప్తి చేయబోం. ఆదేశాలిస్తాం. 
- హైకోర్టు
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడానికి హైకోర్టుకు అధికారం ఉంది. వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మె కొనసాగించే విషయాన్ని పునస్సమీక్షించుకుంటాం. సమ్మె కొనసాగింపుపై 24 గంటల్లోనే నిర్ణయాన్ని చెబుతాం.
- కార్మిక సంఘాలు
పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వెళ్లాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్టోబరు 4న రాజీ చర్చలు విఫలమయ్యాయి. 5న యూనియన్లు సమ్మెకు వెళ్లాయి. 6న ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వివాదం హైకోర్టులో ఉన్నందున పారిశ్రామిక వివాదాల చట్టం కింద వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ ద్వారా మొత్తం పరిస్థితిని వివరించాం. సమస్యల పరిష్కారానికి మేం ఏర్పాటు  చేసిన కమిటీ సూచనలను యూనియన్లు పట్టించుకోలేదు. హైకోర్టు మాటలను విస్మరించాలన్న ఉద్దేశం మాకు లేదు.
-ప్రభుత్వం

ర్టీసీ సమ్మె వ్యవహారం మంగళవారం హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇంతకాలం చెప్పిన హైకోర్టు అది సాధ్యం కాకపోవడంతో సమ్మె చట్టబద్ధతను తేలుస్తామని పేర్కొంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నతస్థాయి కమిటీ సమస్య పరిష్కారానికి ఆఖరి అవకాశంగా పేర్కొంది. దీనిపై వైఖరి చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెపై 24 గంటల్లో నిర్ణయం చెబుతామని యూనియన్లు బదులిచ్చాయి. ఆర్టీసీ సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకుడు (అమికస్‌ క్యూరీ) సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమంటూ హైకోర్టులు తేల్చజాలవని, కార్మిక న్యాయస్థానమే సరైన వేదిక అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని, ఆ జీవో టీఎస్‌ఆర్టీసీకి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. సెక్షన్‌ 3 కింద కొత్తగా ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నందున ఏపీఎస్‌ఆర్టీసీకి ఇచ్చిన ఉత్తర్వులు ఇక్కడ వర్తించవని పేర్కొంది. టీఎస్‌ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ పారిశ్రామిక వివాదాల చట్టం కింద ప్రభుత్వం దీన్ని కన్సిలియేషన్‌కు తీసుకువెళ్లిందని, అక్కడ విఫలం కావడంతో కన్సిలియేషన్‌ అధికారి ప్రభుత్వానికి అక్టోబరు 5న నివేదిక అందజేశారన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కన్సిలియేషన్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సెక్షన్‌ 12 కింద వివాదాన్ని కార్మిక న్యాయస్థానానికి నివేదించాలంది. బంతి ఇంకా ప్రభుత్వం కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించింది.

వినియోగదారుల ఫోరాలకు వెళ్లాలి
ప్రస్తుతం ఆర్టీసీ అందిస్తున్న సేవల్లో లోపాలుంటే వినియోగదారుల ఫోరాలకు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఆర్టీసీలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సమ్మె చట్టబద్ధమా? విరుద్ధమా? అన్న అంశాన్నే తాము పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది.

ఎందుకు నివేదించలేదు?
చర్చలు ప్రారంభించేలా ఇరువర్గాలకు ఆదేశాలివ్వాలని మరో న్యాయవాది కోరగా చర్చలు ప్రారంభించాలన్న ప్రజాబాధ్యత ప్రభుత్వానికి ఎక్కడ ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. పారిశ్రామిక వివాదాలచట్టంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదంది. ఇది ఆర్టీసీకి కూడా వర్తించదని, నిబంధనలే లేనపుడు చర్చలు ప్రారంభించాలని తాము ఎలా ఆదేశించగలమంది. కన్సిలియేషన్‌ నివేదికను ప్రభుత్వం కార్మిక న్యాయస్థానానికి నివేదించాల్సి ఉందని, లేకుంటే కారణాలను వెల్లడించాలంది.

తదుపరి చర్యలను ఎవరూ అడ్డుకోలేదు
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 38 రోజులుగా సమ్మె జరుగుతోందని, కార్మికులతో చర్చించాల్సిన ప్రభుత్వాధినేత ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ ప్రకటన చేశారని, ఉద్యోగాల్లో చేరాలని గడువు విధించారని, ఇది కార్మికులను మరింత రెచ్చగొట్టిందన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, ఓ కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు పిలిచిందని, కానీ వారు పట్టించుకోకుండా సమ్మెకు దిగారన్నారు. అనంతరం పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్టోబరు 5న కన్సిలియేషన్‌ విఫలమైనట్లు అధికారి నివేదిక ఇచ్చారని, 6న హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైందన్నారు. దీంతో తదుపరి చర్యలను నిలిపివేశామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవద్దని ఎవరూ అడ్డుకోలేదు కదా అని ప్రశ్నించింది. ఏజీ స్పందిస్తూ యూనియన్‌ ప్రతినిధుల వైఖరి (ఆటిట్యూడ్‌) బాగాలేదన్నారు. యూనియన్ల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సెక్షన్‌ 10ఎ ప్రకారం ఓ స్వతంత్ర కమిటీ వేసే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లమని చెప్పానన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవర్తనను గమనిస్తే చర్చించే ఉద్దేశం కనిపించలేదన్నారు. ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం కూడా కార్మిక న్యాయస్థానానికి రిఫర్‌ చేయాలని భావిస్తోందన్నారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయాన్ని బుధవారం చెబుతానని ఏజీ చెప్పగా అనుమతించింది. యూనియన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ వివాదం లేబర్‌ కమిషనర్‌కు వెళ్లినా ఆయన కూడా కార్మిక న్యాయస్థానానికే నివేదించాలని, ఇది కాలయాపన తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రైవేటీకరణ వ్యవహారాన్ని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.