close

తాజా వార్తలు

విలీనానికి విరామం

ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామరెడ్డి ప్రకటన
ప్రభుత్వం మిగిలిన సమస్యలు పరిష్కరించాలి
లేకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తాం
కార్మికులు ధైర్యంగా ఉండాలి

ఈనాడు- హైదరాబాద్‌, రాంనగర్‌- న్యూస్‌టుడే: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం చర్చలు జరిపి మిగిలిన సమస్యలను పరిష్కరించాలని.. లేకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాన్ని వాయిదా వేస్తున్నామన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతమందిని అరెస్టు చేయలేదన్నారు. అరెస్టు చేసిన నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానంతో పాటు ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన రాకపోవడం దారుణమన్నారు. ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా ఆర్టీసీ అంశంపై వెంటనే స్పందించాలన్నారు. రాష్ట్రంలో 5,100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తే, వెనుకబడిన వర్గాల వారికి ఇబ్బందులు తప్పవన్నారు.

నేడు ద్విచక్రవాహన ర్యాలీ
ఆర్టీసీని రక్షించాలంటూ శుక్రవారం ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. 16న తాను ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, లింగమూర్తి హైదరాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. 17, 18 తేదీల్లో డిపోల వద్ద కార్మికుల సామూహిక దీక్ష, 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఆర్బీఐ విశ్రాంత ఉద్యోగులు కార్మికులకు సంఘీభావంగా రూ.25 వేల నగదును అశ్వత్థామరెడ్డికి అందజేశారు. వివిధ పార్టీల నేతలు వీహెచ్‌, జితేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కోదండరాం, రమ, సూర్యం, నరసింహారావు, చెరకు సుధాకర్‌, ఆర్టీసీ ఐకాస నాయకులు థామస్‌రెడ్డి, వీఎస్‌రావు పాల్గొన్నారు.

కొనసాగుతున్న సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిపోల ఎదుట గురువారం కార్మికులు బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బస్సులను అనుమతించారు. నిరవధిక సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరుకుంది. తన ఉద్యోగం ఉంటుందో పోతుందోనని మనోవేదనకు గురైన ఓ కండక్టర్‌ బుధవారం అర్ధరాత్రి మరణించారు. మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆర్టీసీ మెకానిక్‌ పోతంశెట్టి ప్రభాకర్‌ కుప్పకూలిపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. మహిళా కండక్టర్‌ పుష్పలత అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌ రమేష్‌కు బుధవారం అర్ధరాత్రి గుండెపోటు రాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. గురువారం 6,198 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. 4,322 బస్సులు ఆర్టీసీవి కాగా మిగిలిన 1,876 అద్దె బస్సులని పేర్కొంది.

రూట్‌ పర్మిట్లపై చర్చ
అధికారులతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తాము గతంలో ప్రకటించిన 5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీ అంశంపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు బస్సులను నడిపేందుకు రూట్‌ పర్మిట్ల కోసం మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నందున దానిపై కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై, హైకోర్టు విచారణ గురించి చర్చించారని తెలిసింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అదనపు ఏజీ రామచందర్‌రావులు సమావేశానికి హాజరయ్యారు. రూట్‌ పర్మిట్ల అంశంపై గురువారం హైకోర్టు ప్రస్తావించిన అంశాలను ఏజీ, అదనపు ఏజీలు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ సోమవారం జరిగే విచారణలో బలమైన వాదన వినిపించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు సీఎం సమీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. సమ్మె దృష్ట్యా ప్రయాణికుల కోసం బస్సులను యథాతథంగా నడిపించాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.