
తాజా వార్తలు
తొలి టెస్టులో భారత్ భారీ విజయం
కనీస పోటీ ఇవ్వని బంగ్లాదేశ్
ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో చిత్తు
పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 213కే ఆలౌట్
సొంతగడ్డపై కోహ్లీసేన ధాటికి మహా మహా జట్లే బెంబేలెత్తిపోయాయి. మరి బంగ్లాదేశ్ మాత్రం నిలుస్తుందని ఎలా అనుకుంటాం? అస్సలు నిలవలేదు.
అంచనాలు ఎంత తక్కువ పెట్టుకున్నప్పటికీ.. ఇంకా తక్కువ స్థాయి ఆటతో తొలి టెస్టులో చిత్తు చిత్తుగా ఓడిపోయారు బంగ్లా పులులు.
తొలి టెస్టులో భారత్ ఒక ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోరు 493. అది కూడా 6 వికెట్లకే డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సాధించిన పరుగులు 363. ఇంకా 130 పరుగులు లోటే.
భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్ మయాంక్ చేసిన పరుగులు 243. బంగ్లా జట్టు మొత్తం కలిసి ఏ ఇన్నింగ్స్‌లోనూ ఇంత స్కోరు చేయలేదు.
ఈ గణాంకాలు చాలు.. ప్రత్యర్థి జట్టు ఏమాత్రం పోటీ ఇచ్చిందో.. భారత్ ధాటికి ఎలా కుదేలైందో చెప్పడానికి.
గులాబీ టెస్టు ముంగిట ఈ విజయం టీమ్ఇండియా ఉత్సాహాన్ని మరింత పెంచేదైనా.. ఈ ఓటమి బంగ్లాలో మరింత గుబులు రేపేదే.
ఇండోర్
సొంతగడ్డపై అప్రతిహత విజయాలతో సాగిపోతున్న కోహ్లీసేన.. మరో భారీ గెలుపును ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల తొలి మ్యాచ్‌ను కేవలం మూడే రోజుల్లో ముగించింది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలవలేకపోయింది. శనివారం 343 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆ జట్టు 213 పరుగుకే ఆలౌటైంది. మరోసారి విజృంభించిన షమి (4/31) ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. రవిచంద్రన్ అశ్విన్ (3/42) ఉమేశ్ యాదవ్ (2/51) కూడా తమ వంతు పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరే రెండో ఇన్నింగ్స్‌లోనూ ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7×4) బంగ్లా టాప్‌స్కోరర్. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 493/6 వద్దే భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీ వీరుడు మయాంక్ అగర్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు ఈ నెల 22న ఈడెన్‌గార్డెన్స్‌లో ఆరంభమవుతుంది. అది గులాబీ బంతితో జరిగే డే/నైట్ టెస్టు కావడం విశేషం.
పేస్ భళా.. ఆధిక్యం 343 పరుగులకు చేరడంతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించడానికి కెప్టెన్ కోహ్లి ఇష్టపడలేదు. మూడో రోజే మ్యాచ్‌ను ముగించేసే ఉద్దేశంతో ఓవర్‌నైట్ స్కోరు 493/6 వద్దే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఉదయం పేసర్లకు సహకరించే పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటారన్న కెప్టెన్ నమ్మకాన్ని భారత పేస్ త్రయం నిలబెట్టింది. ఒకరితో ఒకరు పోటీ పడి పదునైన బౌలింగ్‌తో బంగ్లా పని పట్టారు. ఒక దశ దాటాక పరిస్థితులు పేసర్లకు అంత అనుకూలంగా ఏమీ లేవు. కానీ ఈ మధ్య పిచ్‌లు, వాతావరణంతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న భారత పేసర్లు తెలివైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. పెద్దగా వ్యూహాలేమీ లేకుండా ఒకే రకంగా బంతులేస్తాడని పేరున్న ఇషాంత్ శర్మ.. ఓపెనర్ షాద్మన్ను ఔట్ చేసిన వైనం భారత పేస్‌లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఇషాంత్ వరుసగా ఔట్ స్వింగర్లు సంధిస్తుంటే.. ఎడ్జ్‌తో స్లిప్‌లోకి క్యాచ్ వెళ్లకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు షాద్మన్. అయితే అతణ్ని బోల్తా కొట్టిస్తూ అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చేలా ఒక ఇన్‌స్వింగర్ విసిరితే వికెట్లు లేచిపోయాయి. ఉమేశ్ సైతం కెయెస్ను చక్కటి ఇన్స్వింగర్తోనే పెవిలియన్ చేర్చాడు. ఇక షమి బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహ్మదుల్లా లాంటి అనుభవజ్ఞుడు మీదికి దూసుకొచ్చిన బంతిని ఎలా ఆడాలో తెలియక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. బంగ్లా కెప్టెన్ మొమినుల్ను వికెట్ల ముందు బలిగొన్న బంతి సైతం షమి ప్రత్యేకతను చాటేదే. ఈ వికెట్‌ను భారత్ సమీక్షలో సాధించింది. 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరునైనా అందుకుంటుందా అనుకుంటే.. ముష్ఫికర్ ఆ జట్టును ఆదుకున్నాడు. అతడికి తోడైన లిటన్ దాస్ (35) సైతం ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే అశ్విన్ అందుకున్న రిటర్న్ క్యాచ్‌తో లిటన్ జోరుకు అడ్డుకట్ట పడింది. ఆపై రహీమ్, మెహిదీ హసన్ (38)ల ఎదురుదాడితో స్కోరు 200కు చేరువైంది. వీరి జోరు చూస్తే మ్యాచ్ నాలుగో రోజుకు వెళ్తుందా అనిపించింది. అయితే ఉమేశ్.. ఒంటి మీదికి విసిరిన బౌన్సర్‌ను మెహిదీ వికెట్ల మీదికి ఆడుకోవడంతో కథ మారింది. ఇక్కడి నుంచి 19 పరుగుల తేడాలో 4 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు మ్యాచ్‌ను ముగించారు. ముష్ఫికర్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. |
టీమ్ఇండియా ట్రిపుల్ సెంచరీ |
ఆ ఇద్దరు.. ఈ ఇద్దరు.. అవే ఆర్లు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇమ్రుల్ కెయెస్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అతను చేసింది 6 పరుగులు. ఔటైంది ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో. మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ కూడా 6 పరుగులే చేశాడు. అతణ్ని ఇషాంత్ శర్మ ఔట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అచ్చంగా ఇలాగే జరగడం విశేషం. ఓపెనర్లిద్దరూ ఆరేసి పరుగులే చేశారు. ముందు కెయెస్ను ఉమేశే ఔట్ చేశాడు. ఆ తర్వాత షాద్మన్ను ఇషాంత్ పెవిలియన్ చేర్చాడు. |
నేనున్నానని... |
విజయ వీర ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సూపర్ హీరో మయాంక్ అగర్వాల్. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ ఆరు పరుగులకే వెనుదిరిగినా.. కెప్టెన్ కోహ్లి డకౌటైనా టీమ్ఇండియా ఏమాత్రం వెనుకంజ వేయకుండా దాదాపు ఐదొందల స్కోరు చేసి డిక్లేర్ చేసిందంటే అందుకు ముఖ్య కారణం మయాంకే. పెద్ద ఆటగాళ్లు విఫలమైనపుడు నిలిస్తే ఓ యువ ఆటగాడి సత్తా ఏంటో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షా సమయంలో మయాంక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాధించాడు. కష్టకాలంలో తాను నమ్మదగ్గ ఆటగాడినని చాటాడు. అతడి షాట్లు, దూకుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. సిక్సర్‌తో డబుల్ సెంచరీ చేయడం మయాంక్ ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. వరుసగా రెండు సిరీస్‌ల్లో రెండు డబుల్ సెంచరీలతో జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా మారిన మయాంక్‌పై ఇక అంచనాలు ఎక్కువే ఉంటాయనడంలో సందేహం లేదు. |
రెండు జట్లు ఇండోర్‌లోనే బంగ్లాదేశ్‌తో తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన టీమ్ఇండియా మరో రెండు రోజులు అదే మైదానంలో సాధన చేయనుంది. ప్రతిష్ఠాత్మక డేనైట్ టెస్టు సన్నద్ధత కోసం ఆదివారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయనున్నారు. బంగ్లా క్రికెటర్లు సైతం అక్కడే ఉండి సాధన చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రెండు జట్లు మంగళవారం కోల్‌కతా చేరుకోనున్నాయి. తొలిసారి డేనైట్ టెస్టు ఆడబోతున్న భారత్, బంగ్లాదేశ్ జట్టు ఆ పరిస్థితులకు అలవాటు పడేందుకు శ్రమించనున్నాయి. |
కలల పేస్ ఇది.. భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్ జరుగుతున్నపుడు 20 వికెట్లలో 14 స్పిన్నర్లు తీస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ 14 వికెట్లు పేసర్ల ఖాతాలో చేరితే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఇదే జరిగింది. పైగా ఇది స్పిన్నర్లకు అనుకూలించే వేదికగా పేరున్న హూల్కర్ స్టేడియంలో కావడం గమనార్హం. మ్యాచ్‌లో షమి, ఉమేశ్, ఇషాంత్‌ల బౌలింగ్ చూస్తే మ్యాచ్ జరుగుతోంది ఏ దక్షిణాఫ్రికాలోనో.. ఇంగ్లాండ్‌లోనో అనిపిస్తే ఆశ్చర్యం లేదు. బుమ్రా లేకున్నా ఆ లోటేమీ కనిపించకుండా పేస్ త్రయం ఇలా చెలరేగిపోతుండటం అనూహ్యం. ఈ నేపథ్యంలో భారత పేస్ దళంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బంగ్లాపై భారీ విజయానంతరం కెప్టెన్ కోహ్లి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించారు. పేసర్లలో ఒకడైన ఇషాంత్ సైతం పరస్పర సహకారంతో తామెలా విజయవంతమవుతోంది చెప్పాడు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. |
‘‘ఫాస్ట్‌బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. వాళ్లు బౌలింగ్ చేస్తుంటే ఎలాంటి పిచ్ అయినా మంచి పిచ్ లాగే కనిపిస్తోంది. ఎప్పుడైనా బంతి తమ వద్దకు వస్తుందని స్లిప్ ఫీల్డర్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇప్పుడు బుమ్రా లేడు. అతనొచ్చాడంటే ప్రత్యర్థి జట్లు ఎదురు నిలవలేని బౌలింగ్ దళం మనదవుతుంది. ప్రస్తుత ఫాస్ట్‌బౌలింగ్ కూర్పు ఏ కెప్టెన్‌కైనా కల లాంటిదే’’
- కోహ్లి
|
‘‘బౌలింగ్‌లో కొత్త విషయాలు ప్రయత్నించే ప్రతిసారీ మెరుగుపడుతున్నట్లే. ఇషాంత్ అదే చేస్తున్నాడు. షాద్మన్ను బౌల్డ్ చేసిన బంతిని అతను ముందు రోజు నుంచి సాధన చేస్తున్నాడు. ఉమేశ్ పునరాగమనంలో చాలా దృఢంగా కనిపిస్తున్నాడు. షమి సీమ్ పొజిషన్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుంది. బుమ్రా తిరిగొస్తే తుది జట్టులో ఎవరిని ఉంచాలనే విషయంలో మాకు తలనొప్పి మొదలవుతుంది’’ - భరత్ అరుణ్, భారత బౌలింగ్ కోచ్
|
‘‘జట్టులో సీనియర్, జూనియర్ అనే భావనలే లేవు. ఒకరి విజయాన్ని ఒకరు ఆస్వాదిస్తాం. ప్రణాళికల్ని పంచుకుంటాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది’’
- ఇషాంత్
|
‘‘ఇషాంత్, ఉమేశ్‌లతో కలిసి బౌలింగ్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంటుంది. వాళ్లు నా పని తేలిక చేస్తారు’’
- షమి
|
10 కోహ్లి సారథ్యం వహించిన 52 టెస్టుల్లో టీమ్ఇండియా సాధించిన ఇన్నింగ్స్ విజయాలు. భారత కెప్టెన్లలో ధోని పేరిట (60 టెస్టుల్లో 9 ఇన్నింగ్స్ విజయాలు) ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు. ప్రపంచ రికార్డు (22) గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) పేరిట ఉంది. |
6 భారత జట్టుకు ఇది వరుసగా ఆరో టెస్టు విజయం. వెస్టిండీస్‌పై రెండు మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీసేన ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తాజా విజయంతో ధోని సారథ్యం(2013)లో నెలకొల్పిన అత్యధిక వరుస విజయాల రికార్డు సమమైంది. |
243 మయాంక్ అగర్వాల్ స్కోరు. ప్రత్యర్థి జట్టు.. రెండు ఇన్నింగ్స్‌లో ఒక్కసారైనా ఈ స్కోరు చేరలేదు. ఇలా భారత బ్యాట్స్‌మన్ స్కోరు ప్రత్యర్థి జట్ల ఇన్నింగ్స్ కంటే ఎక్కువగా ఉండటం ఇది ఆరోసారి మాత్రమే. చివరగా దక్షిణాఫ్రికాపై రోహిత్ (212) ఈ ఘనత అందుకున్నాడు. |
3 టీమ్ఇండియాకు ఇది వరుసగా మూడో ఇన్నింగ్స్ విజయం. ఇలా భారత జట్టు హ్యాట్రిక్ సాధించడం ఇది మూడోసారి. 1992-93లో, 1993-94లో అజహరుద్దీన్ సారథ్యంలో రెండుసార్లు ఈ ఘనత సాధించింది. |
స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్డ్ బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ ఇస్లామ్ (బి) ఇషాంత్ 6; ఇమ్రుల్ కెయెస్ (బి) ఉమేశ్ 6; మొమినుల్ హక్ ఎల్బీ (బి) షమి 7; మహ్మద్ మిథున్ (సి) మయాంక్ (బి) షమి 18; ముష్ఫికర్ రహీమ్ (సి) పుజారా (బి) అశ్విన్ 64; మహ్మదుల్లా (సి) రోహిత్ (బి) షమి 15; లిటన్ దాస్ (సి) అండ్ (బి) అశ్విన్ 35; మెహిదీ హసన్ (బి) ఉమేశ్ 38; తైజుల్ ఇస్లామ్ (సి) సాహా (బి) షమి 6; అబు జాయెద్ నాటౌట్ 4; ఇబాదత్ హుస్సేన్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 1; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్) 213; వికెట్ల పతనం: 1-10, 2-16, 3-37 , 4-44, 5-72, 6-135, 7-194, 8-208, 9-208; బౌలింగ్: ఇషాంత్ శర్మ 11-3-31-1; ఉమేశ్ యాదవ్ 14-1-51-2; మహ్మద్ షమి 16-7-31-4; జడేజా 14-2-47-0; అశ్విన్ 14.2-6-42-3 |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
