
తాజా వార్తలు
స్పిన్ పిచ్‌లను సిద్ధం చేసి.. ప్రత్యర్థులను ఆ ఉచ్చులోకి లాగి.. విజయాలు సాధించడం.. తరతరాలుగా సొంతగడ్డపై టీమ్ఇండియా అనుసరిస్తున్న వ్యూహం. గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టిస్తూ, వికెట్లు నేలకూల్చడం ఆనవాయితీగా మారడంతో.. భారత్ అంటే స్పిన్ పిచ్లే అనే భావన బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేస్తూ.. బుల్లెల్ లాంటి బంతులతో బెంబెలేత్తిస్తూ.. అంచనాల్ని మార్చేస్తూ దూసుకెళ్తోంది భారత పేస్ దళం. తాజాగా బంగ్లాతో తొలి టెస్టులో 20కి 14 వికెట్లు పేసర్ల ఖాతాలోనే చేరాయంటే స్వదేశంలో మన ఫాస్ట్ బౌలింగ్ జోరెలా సాగుతోందో తెలుస్తోంది. భారత్‌లో ఇక స్పిన్నర్లకు కాదు.. పేసర్లను చూసి ప్రత్యర్థి జట్లు భయపడే రోజులు వచ్చేశాయి.
ఈనాడు క్రీడావిభాగం
మ్యాచ్ ఆరంభంలో పేసర్లు కొన్ని ఓవర్లు వేసేవాళ్లు.. ఆ తర్వాత స్పిన్నర్లు వచ్చి వికెట్లు తీసేవాళ్లు. మధ్యలో ఎప్పుడో ఒకసారి మళ్లీ పేసర్లు.. స్పిన్నర్లకు సహకారం అందించేవాళ్లు. దశాబ్దాలుగా సొంతగడ్డపై భారత క్రికెట్ సాగిన తీరిది. కానీ ఆ పరిస్థితుల్లో గత కొన్నేళ్లలో గొప్ప మార్పు వచ్చింది. అది అలాంటిలాంటి మార్పు కాదు. భారత క్రికెట్ ముఖ చిత్రాన్నే మార్చేసేది. పిచ్ ఏదైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. వికెట్లు ఎగరగొట్టడమే లక్ష్యంగా టీమ్ఇండియా పేసర్లు సత్తాచాటుతున్నారు. స్పిన్ పిచ్‌లపైనా వికెట్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేవలం స్పిన్నర్లు మాత్రమే కాదు.. అంతకుమించి పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కోగలమనే నమ్మకం ఉంటేనే భారత గడ్డపై అడుగుపెట్టాలని ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అసలేం మారింది? గతంతో పోలిస్తే స్వదేశంలో భారత పేసర్లు ఇంత గొప్పగా ఎలా రాణించగలుగుతున్నారు? స్పిన్ పిచ్‌లపైనా వికెట్లు ఎలా తీయగలుగుతున్నారు? అంటే దానికి సమాధానం.. కొన్నేళ్ల నుంచి అనుసరిస్తున్న స్పష్టమైన ప్రణాళికలు.. పేసర్లను సానబెట్టడంలో జట్టు యాజమాన్యం చూపిస్తున్న శ్రద్ధ.. ఎప్పటికప్పుడూ బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ సరికొత్త అస్త్రాలతో దూసుకుపోతున్న పేసర్లు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్.. తమపై జట్టు పెట్టుకున్న నమ్మకానికి రెండింతలు న్యాయం చేస్తూ.. పేస్ విభాగంలో భారత్‌ను పేస్‌లో బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదివరకు స్పిన్నర్ల ఆధిపత్యం ఎలా ఉండేదంటే.. మొహాలి, ధర్మశాల లాంటి పేస్ పిచ్‌లపైనా వారి ప్రభావం బలంగా కనిపించేది. పేసర్లు అక్కడి పరిస్థితుల్ని కూడా అంతగా సద్వినియోగం చేసుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు పిచ్‌తో సంబంధం లేకుండా పేసర్లు చెలరేగుతున్నారు. స్పిన్ పిచ్‌లపైనా సత్తా చూపిస్తున్నారు. అసలు వాళ్లు పిచ్ ఎలా ఉందన్నదే పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. బౌన్స్, స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెడుతున్నారు. కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో ఫలితాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు స్పిన్నర్ల కోసం పగుళ్లతో కూడి, నిర్జీవంగా ఉండే పిచ్‌లను తయారుచేసే భారత్‌లో.. ఇప్పుడు పచ్చికతో కళకళలాడుతూ ఉండే పిచ్‌లను సిద్ధం చేస్తున్నారంటే దానికి కారణం మన పేసర్లే. |
ఒకరిని మించి ఒకరు బుమ్రా రాకతో జట్టు ఫాస్ట్ బౌలింగ్‌లో బలం పెరిగిందనడంలో సందేహం లేదు. అతను టెస్టుల్లోనూ అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి బుమ్రా.. గాయం కారణంగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం కావడంతో భారత్ బౌలింగ్ ప్రదర్శనపై అనుమానాలు రేకెత్తాయి. కానీ షమి పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తే.. బుమ్రా స్థానంలో తనకు లభించిన అవకాశాన్ని ఉమేశ్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా మునుపటిలా మూస పద్ధతిలో బౌలింగ్ చేయడం మాని వైవిధ్యం చూపిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. సఫారీ సేనతో టెస్టుల్లో మన పేసర్లు 20 వికెట్లకు గాను.. తొలి మ్యాచ్‌లో 6, రెండు, మూడు మ్యాచ్‌ల్లో పదేసి వికెట్లు తీశారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా పేసర్లు విఫలమయ్యారు. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్బౌలర్లలో ఒకడైన రబాడ సైతం వికెట్ల వేటలో వెనకబడ్డాడు. కానీ మన పేసర్లు పూర్తి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో ఫలితాలు రాబట్టారు. గతంలో సొంతగడ్డపై స్పిన్నే నమ్ముకోవడం వల్ల మన పేసర్లకు సరైన ప్రాక్టీస్ లభించేది కాదు. దీంతో విదేశాల్లోనూ పేస్ పిచ్‌లపై తేలిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు పిచ్‌ల మీద ఆధారపడకుండా తెలివైన బౌలింగ్‌తో వికెట్లు పడగొడుతున్నారు మన పేసర్లు. గత ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత్ సిరీస్‌లు గెలవలేకపోయినప్పటికీ.. మన పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను వణికించడం చూసే ఉంటారు. చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగి భారత్‌కు తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు. మన పేసర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. కెప్టెన్ కోహ్లి అన్నట్లు.. ప్రపంచంలో ఎక్కడైనా విజయం సాధించే జట్టుగా భారత్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. |
షమి @ 7 |
ప్రపంచంలో ఎక్కడైనా విజయం సాధించగలిగే జట్టుగా భారత్ నిలవాలి.. దానికి పిచ్‌తో, పరిస్థితులతో సంబంధం లేకుండా వికెట్లు తీసే పేసర్లు ఉండడం ఒక్కటే మార్గం. బుమ్రా జట్టులో చేరితే ఈ బౌలింగ్ విభాగంతో ఎక్కడైనా ప్రత్యర్థి బ్యాట్స్మన్లను హడలెత్తించగలం. ప్రతి స్పెల్‌లోనూ వికెట్లు తీయగలగే బౌలర్లు జట్టులో ఉండడం నిజంగా అదృష్టం. - కోహ్లి
|
భారత జట్టులో ఇలాంటి పేస్ బలాన్ని ఇప్పటి వరకూ చూడలేదు. గత అయిదారేళ్లలో పేసర్లు భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చారు. అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న భారత పేసర్ల పట్ల గర్వంగా ఉంది.
- కపిల్ దేవ్
|
భారత పేస్ దళం అద్భుతంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లను సానబెట్టే దిశగా భారత్‌లో ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు నలుగురు పేసర్లతో ఆ జట్టు వచ్చింది. వాళ్లందరూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
- క్లూసెనర్
|
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
