close

తాజా వార్తలు

దయ చూపండి!

48 వేల కుటుంబాలను రోడ్డున పడేయకండి
సమ్మెపై తేల్చండి
కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తారా? లేదా?
రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి
కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేం
సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి
ప్రభుత్వం, ఆర్టీసీకి రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం సూచన
పిటిషన్‌లపై ముగిసిన విచారణ
సమ్మె విరమిస్తామన్నా ప్రభుత్వ స్పందన లేదు: యూనియన్‌ న్యాయవాది
ఈనాడు - హైదరాబాద్‌

‘ఒక ఆదర్శ యజమానిలా విశాల హృదయాన్ని చూపండి. ఉద్యోగిపట్ల ఔదార్యంగా ఉండాలి. ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితికి తగ్గట్టుగా యాజమాన్యం వ్యవహరించి దయ చూపాలి. ఇంతకాలం అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యను త్వరలో పరిష్కరించేలా ప్రభుత్వం, కార్పొరేషన్‌  నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాం. సమస్య పరిష్కారం కానంత వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవు’ 
 
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం రాజీ అధికారి (కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌)కి లేదు. ఆ విషయాన్ని నిర్ణయించాల్సింది కార్మిక న్యాయస్థానం మాత్రమే.  సమ్మె చట్టవిరుద్ధమంటూ రాజీ అధికారి అక్టోబరు 5న ప్రకటించిన అంశాన్ని కార్మిక కమిషనర్‌తో పాటు కార్మిక న్యాయస్థానం విస్మరించాలి. పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్‌ 12 ప్రకారం రాజీ అధికారి పాత్ర రాజీ విఫలమైనట్లు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం వరకే పరిమితం

పని చేసే సంస్థలో పరిస్థితుల మెరుగు కోసమే కార్మికుడు సమ్మెకు వెళుతున్నట్లుగా చూడాలి గానీ...ఉద్యోగం వదిలిపెట్టిపోవడానికి ఇష్టపడినట్లుగా చూడటం తప్పని సుప్రీం కోర్టు చెప్పింది. ఇక్కడ కూడా ఆర్టీసీ లేదా ప్రభుత్వం అలాంటి ముగింపునకు రావడం న్యాయసమ్మతం కాదు. ఇది కేవలం యాజమాన్యం, కార్మికులకు సంబంధించిన వ్యవహారం కాదు. కార్మికులను రోడ్డున పడేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. 48 వేల కుటుంబాలంటే బాధితులు లక్షల్లో ఉంటారు. అంతమందిని అనాథలను చేయడం న్యాయమా అన్నది ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ విచక్షణకే ఒక ఆశతో వదిలేస్తున్నాం’ 


- ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

కార్మికులకు, ఆర్టీసీకి మధ్య జరిగిన రాజీ ప్రయత్నాలు విఫలమైనట్లు రాజీ అధికారి ఇచ్చిన నివేదికపై ఏదో ఒకటి తేల్చాలంటూ కార్మికశాఖ కమిషనర్‌కు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 12(4) ప్రకారం ఈ నివేదికను కార్మిక న్యాయస్థానానికి నివేదిస్తారా? లేదా? అన్నదానిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంది. కార్మిక న్యాయస్థానానికి నివేదించని పక్షంలో కారణాలను రెండు పక్షాలకు తెలియజేయాలని ఆదేశించింది. సమ్మె చట్టవిరుద్ధమంటూ ప్రకటించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను అంగీకరించలేమంది. కోర్టు ఆదేశాలతోనో, అధికారంతోనే చర్చలు జరిగితే అవి స్వేచ్ఛగా జరిగినట్లు కాదని, అందువల్ల ప్రభుత్వానికి అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లుగా లేదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మె విరమిస్తామని యూనియన్‌ నాయకులు స్పందిస్తున్నా ప్రభుత్వం ముందుకురావడంలేదని యూనియన్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు కొనసాగిస్తూ సమ్మె చట్టవిరుద్ధమంటూ రాజీ అధికారి ప్రకటించారని, ఇకపై యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకోవచ్చన్నారు. చర్చలు జరపాలో లేదో ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కు చెప్పే పరిధి ఈ కోర్టుకు లేదన్నారు. ఐడీ యాక్ట్‌ సెక్షన్‌ 26 ప్రకారం చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొన్నవారికి నెల రోజుల జైలు శిక్ష ఉంటుందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సిండికేట్‌ బ్యాంక్‌ కేసులో సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు చెప్పడం తప్పని మాత్రమే సుప్రీం కోర్టు పేర్కొందని, వ్యవహారాన్ని కార్మిక న్యాయస్థానంలో ఉంచాలని, అది సమ్మె చట్టబద్ధత, సమర్థనీయతపై జవాబు చెబుతుందని పేర్కొందని తెలిపింది. కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ రాజీ అధికారి పాత్ర, ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోకి వచ్చేవాటిలో సెక్షన్‌ 22 కింద సమ్మె చట్టవిరుద్ధమని పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

అధికారం ఉందని వాడితే ఉపయోగమేంటి?
యూనియన్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ముగ్గురు మాజీ జడ్జీల కమిటీ గురించి ప్రస్తావించగా ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపింది. కమిటీకి ఒక పక్షం అంగీకరిస్తే చాలని, హైకోర్టు నేరుగా ఉత్తర్వులు ఇవ్వవచ్చన్న న్యాయవాది వాదనపై స్పందిస్తూ అధికారం ఉందని తాము వాడితే ఉపయోగంలేదంది. సమస్య పరిష్కారమవుతుందని రేణువంతైనా ఆశ ఉంటే అధికారాన్ని వినియోగించేవాళ్లమంది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి 2015 డిసెంబరులో తెచ్చామనే వీళ్లు 2016లో ఆర్టీసీని ఏర్పాటు చేస్తున్నామంటూ భిన్న వాదనలు చెబుతున్నారన్న న్యాయవాది వాదనపై ధర్మాసనం స్పందిస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా అఫిడవిట్‌ దాఖలు చేస్తున్నారని, వీటిలో నిజం ఎక్కడుందో తెలియడంలేదంది.

ప్రభుత్వానికి రహస్య ఎజెండా: యూనియన్‌
సమ్మె విరమిస్తామని యూనియన్‌ నాయకులు స్పందిస్తున్నా ప్రభుత్వం ముందుకురావడంలేదని, వెనక్కి వచ్చినా ఉద్యోగమివ్వలేమని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సొమ్ము రూ.1400 కోట్లు తిన్న ప్రభుత్వం, మా శ్రమను వాడుకున్న సంస్థ అలా మాట్లాడటం తగదన్నారు. ప్రభుత్వ ధోరణి చూస్తే టీఎస్‌ఆర్టీసీని చంపేయాలన్న రహస్య ఎజెండా ఏదో ఉన్నట్లుందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారని ఎలా అంటారని, ఎండీ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు చౌకగా రవాణా సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ సొమ్ము చెల్లించాలని ప్రభుత్వం జీవో ఇస్తే ఆర్టీసీ ఎండీగా చెల్లించాల్సిన అవసరం లేదంటారని, దీనికితోడు పొలిటికల్‌ అఫిడవిట్‌ వేశారన్నారు. ఈ విషయాన్ని కోర్టు గుర్తించాలని, ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టరాదన్నారు. ఓ ఐఏఎస్‌ అధికారి ఈ స్థాయికి వెళ్లి అఫిడవిట్‌లు వేయడం సరికాదన్న దానిపై ధర్మాసనం స్పందిస్తూ ముస్సోరి అకాడమీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలేదని భావించాలని వ్యాఖ్యానించింది. సమ్మె చట్టబద్ధమా, విరుద్ధమా అన్నది పక్కనబెడితే మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించరాదని సుప్రీంకోర్టు 1963లో చెప్పిందన్నారు. ఒకవేళ వెనక్కి వెళ్లాల్సి వస్తే వారికి అవరోధాలు లేకుండా చూడాలన్న న్యాయవాది అభ్యర్థనపై ధర్మాసనం స్పందిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆదేశించజాలమని, అయితే విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది.

పర్మిట్ల జారీపై విచారణ నేడు
5100 పర్మిట్ల జారీకి సంబంధించిన పిటిషన్‌తో పాటు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇందులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, పర్మిట్ల జారీపై మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. 1035 అద్దెబస్సుల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ వారానికి వాయిదా వేసింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.