
తాజా వార్తలు
కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ
తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్య
మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని
రమేష్‌బాబు పౌరసత్వానికి దరఖాస్తు చేసిన సమయంలో భారతదేశంలో లేకపోయినా 12 నెలల పాటు ఇక్కడే ఉన్నట్లు తప్పుడు సమాచారమిచ్చారు. ఒకవేళ భారతదేశంలో లేరనే సమాచారాన్ని అప్పుడే ఇచ్చి ఉన్నట్లయితే ఆయనకు పౌరసత్వమే వచ్చేది కాదు.
పౌరసత్వం కోసం తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులు దేశానికి ఏ మంచి చేయగలరు? లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే సభలో రమేష్‌బాబు సభ్యుడు. ఉగ్రవాద కార్యక్రమాలు, గూఢచర్యం వంటి చర్యలకు పాల్పడలేదని చెప్పి ఆయనకు పౌరసత్వం ఇవ్వలేం. అన్నీ పరిశీలించిన తర్వాత రమేష్‌బాబు భారతీయ పౌరుడిగా కొనసాగడం ప్రజా శ్రేయస్సుకు మంచిదికాదని నిర్ణయించాం.
- కేంద్ర హోంశాఖ
ఈనాడు, దిల్లీ, న్యూస్‌టుడే, వేములవాడ:
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా ఆయన భారతీయ పౌరసత్వం పొందినట్లు పేర్కొంది. ఈ మేరకు భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ పది ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రమేష్‌బాబు తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ అఫిడవిట్లో పేర్కొనడంపైనా హోంశాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదుచేశారు. అదేసమయంలో ఆది శ్రీనివాస్ హైకోర్టును కూడా ఆశ్రయించగా... కేంద్ర హోంశాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేష్‌బాబు కోర్టుకు విన్నవించారు. విచారించిన కోర్టు కేంద్ర హోంశాఖ ఓ కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని చెప్పింది. 2010లో ఎస్.కె.టాండన్ నేతృత్వంలో హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని...తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వం పొందానని రమేష్ కమిటీ ముందు తన వాదనలు వినిపించారు. వాదనలు విని, అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఆయన పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2017లో హోంశాఖ రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దుచేసింది. దాన్ని సవాల్ చేస్తూ రమేష్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ కోర్టు ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో 2019 అక్టోబర్31న ఇరు పక్షాలు తమ వాదనలను హోంశాఖ మందు వినిపించాయి. వాదనలు పరిగణనలోకి తీసుకొని హోంశాఖ రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేస్తూ బుధవారం 13 పేజీల ఉత్తర్వులిచ్చింది. రమేష్‌బాబు పౌరసత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా
పౌరసత్వంపై కేంద్రహోంశాఖ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు చెప్పారు. జులై 15న హైకోర్టు తీర్పులోని ఆదేశాలను హోం శాఖ పరిగణనలోకి తీసుకోలేదని 2017లో హోంశాఖ పౌరసత్వాన్ని రద్దు చేసిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. సెక్షన్ 10.3 ప్రకారం పౌరసత్వచట్టం నిబంధనలను చూడాలి.. కానీ సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదు. హోంశాఖ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ సెక్షన్ 10.3ను పరిగణనలోకి తీసుకోలేదు. పౌరసత్వ పరిరక్షణకు హైకోర్టుకు వెళ్తా.
నిజమే గెలిచింది: ఆది శ్రీనివాస్
సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత నిజమే గెలిచిందని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు పసలేని వాదనతో దేశాన్ని, చట్టాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
