close

తాజా వార్తలు

ఈడెన్‌లో గులాబీ కేళి

భారత్‌ × బంగ్లాదేశ్‌
చరిత్రాత్మక డేనైట్‌ టెస్టు నేటి నుంచే

మధ్యాహ్నం 1 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో
కోల్‌కతా

గులాబి బంతి ఎలా స్పందించబోతోంది. ఆటలో ఏమైనా తేడా ఉంటుందా? ఎవరికి లాభం! ఎవరికి ఇబ్బంది! లైట్ల కింద టెస్టు మ్యాచ్‌ చూడడం ఎలాంటి అనుభూతినిస్తుంది ? బీసీసీఐ కొత్త అధ్యక్షుడు గంగూలీ డేనైట్‌ టెస్టును ప్రకటించినప్పటి నుంచి అంతా ఇదే చర్చ! అభిమానుల్లో ఉత్సాహం... ఆటగాళ్లలో ఉత్కంఠ.. పండితుల్లో ఆసక్తి! ఇంతకూ గులాబి అనుభవం ఎలా ఉండబోతోంది?
అందరి నిరీక్షణకు తెరదించుతూ ఆ రోజు రానే వచ్చింది. చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌లో భారతదేశపు మొట్టమొదటి డేనైట్‌ టెస్టు నేటి నుంచే. కోట్ల అభిమానులు కొత్త అనుభవం కోసం చూస్తుండగా బంగ్లాదేశ్‌ను భారత్‌ ఢీకొంటుంది. పింక్‌ మహిమ.. ఒక్క టికెట్టూ మిగల్లేదు.

భారత్‌ క్రికెట్లో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌.. ఈ మైదానంలో అలా చిరకాలం గుర్తుండిపోయే సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
1987: ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ఇంగ్లాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ నెగ్గింది.
1991: నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన తర్వాత దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఆడింది ఈ మైదానంలోనే. 
1999: ప్రయోగాత్మకంగా తొలిసారి నిర్వహించిన ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఈడెన్‌ వేదికైంది. 2001: టెస్టు చరిత్రలోనే అపూర్వమైన మ్యాచ్‌ల్లో ఒకటైన భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా టెస్టుకు ఈడెనే సాక్షీభూతంగా నిలిచింది. వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌ అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు, ద్రవిడ్‌ సంయమనం, హర్భజన్‌ హ్యాట్రిక్‌.. వెరసి ఆసీస్‌ అప్రతిహత విజయాలకు అడ్డుకట్ట పడింది.
2014: శ్రీలంకపై వన్డేలో రోహిత్‌ 264 పరుగులు చేశాడు.

ఒక ఈడెన్‌.. ఎన్నో జ్ఞాపకాలు

302
2016లో వెస్టిండీస్‌పై పింక్‌ బాల్‌ టెస్టులో అజహర్‌ అలీ స్కోరు. డేనైట్‌ టెస్టుల్లో అత్యధిక స్కోరు అతడిదే. 

ఇప్పటికే ఎనిమిది జట్లకు గులాబి బంతితో టెస్టు ఆడిన అనుభవముంది. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌తో ఆ సంఖ్య 10కి చేరనుంది. 

ఆస్ట్రేలియా ఆడిన పింక్‌ బాల్‌ టెస్టుల సంఖ్య. అన్నింట్లో కంగారూల జట్టు గెలిచింది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, శ్రీలంక జట్లను ఓడించింది. 

టీమ్‌ఇండియా గులాబి బంతితో టెస్టు ఆడనుండటం ఇదే తొలిసారి. అయితే భారత్‌లో మూడేళ్ల కిందటే ఈ బంతిని ఉపయోగించి దులీప్‌ ట్రోఫీ (2016) క్రికెట్‌ ఆడారు. 
గులాబి బంతిని తొలిసారి మహిళల క్రికెట్లో ప్రవేశపెట్టారు. 2009 జులై 5న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మహిళల జట్లు గులాబి బంతితో  వన్డే ఆడాయి. 

డేనైట్‌ టెస్టు మధ్యాహ్నం 1కి ఆరంభమవుతుంది. 3 నుంచి 3.40 వరకు లంచ్‌ విరామం. సాయంత్రం 5.40 నుంచి 6 వరకు టీ బ్రేక్‌ ఉంటుంది.
 

భారత్‌లో చరిత్రాత్మక డేనైట్‌ టెస్టుకు వేళైంది. శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆరంభమయ్యే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత జట్టు ఢీకొంటుంది. బంగ్లాకు కూడా గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడడం ఇదే తొలిసారి. టెస్టు క్రికెట్‌ పునరుజ్జీవం కోసం డేనైట్‌ ఫార్మాట్‌ను ఐసీసీ ఏడేళ్ల కిందే ఆమోదించగా.. తొలి మ్యాచ్‌ ఆడడానికి భారత్‌కు ఇంతకాలం పట్టింది. నిజానికి ఇది షెడ్యూలులో లేదు. బంగ్లా జట్టు పర్యటనకు రావడానికి కొన్ని రోజుల ముందు గంగూలీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును డేనైట్‌ టెస్టు మ్యాచ్‌కు ఒప్పించాడు. నిరుడు అడిలైడ్‌లో ఆడాలని ఆస్ట్రేలియా కోరినా.. బీసీసీఐ అంగీకరించలేదు. సొంతగడ్డపైనా ఆడేందుకూ ఎప్పుడూ విముఖతనే వ్యక్తం చేసింది. ఎస్జీ గులాబి బంతి రాత్రి పూట సరిగా కనపడదన్నది భారత ఆటగాళ్ల భావన. రాత్రి వేళ మంచు కురిస్తే బౌలర్ల సమస్యలు పెరుగుతాయన్నది వాళ్ల ఆందోళన. అయితే బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న గంగూలీ.. తేలిగ్గానే కోహ్లీని ఒప్పించగలిగాడు. మైదానానికి ప్రేక్షకులను భారీగా రప్పించడమే డేనైట్‌ టెస్టు లక్ష్యం. ప్రస్తుతానికైతే అది నెరవేరినట్లే. తొలి నాలుగు రోజులకు టికెట్లన్నీ అమ్ముడుపోవడమే అందుకు నిదర్శనం. బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌ కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

మంచు కురిసే వేళలో..

లితం కన్నా కూడా గులాబి బంతితో మ్యాచ్‌ సాఫీగా సాగుతుందా అన్నది ప్రధానంగా మారింది. ప్రేక్షకులు సంతోషంగానే ఉన్నా.. కొత్త పరిస్థితుల్లో ఆడడం ఆటగాళ్లకు మాత్రం సవాలే. గులాబి బంతి ఎలా స్పందిస్తుందనేదానిపై చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ మంచు కీలకం కానుంది. మంచు ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నది సచిన్‌ తెందుల్కర్‌ అభిప్రాయం. స్పిన్నర్లకు పెద్దగా టర్న్‌ లభించకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఆర్మ్‌ బాల్‌పై ఎక్కువగా దృష్టిపెడతానని అశ్విన్‌ చెప్పాడు. ఇక ఇండోర్‌లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌కు మరింతగా స్వింగయ్యే గులాబి బంతితో మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. భారత పేస్‌ త్రయం షమి, ఉమేశ్‌, ఇషాంత్‌లను తట్టుకుని నిలవడం ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు కష్టమైన పనే. తొలి టెస్టులో వీళ్లు 14 వికెట్లు పడగొట్టారు. నిజానికి బంగ్లాను దెబ్బతీయడానికి గులాబి బంతి నుంచి వీరికి అదనపు సహకారమేమీ అవసరం లేదనిపిస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా విశ్వాసాన్ని ఈ త్రయం మరింత పెంచుతోంది. కొందరు ఆటగాళ్లకు దులీప్‌ ట్రోఫీలో లైట్ల కింద గులాబి బంతితో ఆడిన అనుభవం ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశమే. తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన జట్టులో భారత్‌ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. డబుల్‌ సెంచరీతో జోరు మీదున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇండోర్‌లో విఫలమైన మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఈసారి సత్తా చాటాలనుకుంటున్నాడు. వీళ్లతో పాటు పుజారా, కోహ్లి, రహనెలతో దుర్భేద్యంగా ఉన్న భారత లైనప్‌ను నిలువరించడం బంగ్లా బౌలర్లకు సవాలే. ఈ మ్యాచ్‌కు బంగ్లా తైజుల్‌ ఇస్లామ్‌ స్థానంలో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. భారత్‌ను అడ్డుకోవాలంటే బ్యాటింగ్‌లోనూ బంగ్లా అసాధారణంగా పుంజుకోవాల్సివుంది. తొలి టెస్టులో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫికర్‌ ఒక్కడే  అర్ధసెంచరీ సాధించగలిగాడు.

ఎలా స్పందిస్తుందో

* భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు రెండింటికీ ఇదే తొలి డేనైట్‌ టెస్టు. ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే రెండు జట్లు బరిలో దిగుతున్నాయి. ఏ జట్టు కొత్త పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతుందో చూడాలి. పదునైన భారత పేస్‌ దళాన్ని ఎదుర్కోవడం బంగ్లాకు సవాలే.
* సాధారణంగా గులాబి బంతి (కూకాబురా, డ్యూక్‌)తో పేసర్లకు ఎక్కువ స్వింగ్‌ లభిస్తుంది. సీమ్‌ మూమెంట్‌ కూడా ఎక్కువే. కానీ స్పిన్‌, రివర్స్‌ స్వింగ్‌కు పెద్దగా సహకారం లభించదు. మరి ఎస్జీ ఎలా స్పందిస్తుందో!
* ఎర్ర బంతి సీమ్‌ కంటే గులాబి బంతి సీమ్‌ ఎక్కువ ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. బరువులో తేడా ఉండదు. ఏ బంతి బరువైనా నిబంధన (156 నుంచి 162 గ్రాముల మధ్య) మేరకు ఉండాలి. ఒక్క గ్రాము తక్కువకానీ ఎక్కువకానీ ఉండరాదు. మిగతా బంతులతో పోలిస్తే గులాబి బంతి బౌలర్లకు 15 శాతం ఎక్కువ సహకరిస్తుందన్నది అంచనా.

ఫీల్డింగ్‌ సవాలే..

గులాబి బంతితో ఫీల్డింగూ సవాలే. ప్రాక్టీస్‌ సందర్భంగా స్లిప్స్‌లో బంతిని అందుకుంటే బరువైన హాకీ బాల్‌లా గట్టిగా తగిలింది. బంతిపై ఉన్న అదనపు మెరుపే అందుకు కారణం. కారణమేంటో తెలియదు కానీ బరువుగా కూడా అనిపిస్తోంది. వికెట్‌కీపర్‌కు అందించడానికి ఎర్ర బంతి కంటే ఎక్కువ బలం ఉపయోగించి త్రో చేయాల్సి వస్తోంది. పగటి పూట బాగా పైకి వెళ్లిన బంతులను క్యాచ్‌ పట్టడం చాలా కష్టమవుతుందని అనుకుంటున్నా.  అదనపు మెరుపు వల్ల బంతి వేగం పెరిగింది.
- కోహ్లి

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, కోహ్లి, రహానె, జడేజా, వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమి.
బంగ్లాదేశ్‌: షాద్మాన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేయస్‌, మొమినుల్‌ హక్‌, ముష్ఫికర్‌, మహ్మదుల్లా, మహ్మద్‌ మిథున్‌, లిటన్‌ దాస్‌, మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, అబు జయేద్‌, అల్‌ అమిన్‌ హుస్సేన్‌.
 

గులాబి బంతితో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం మాకు దక్కలేదు. మానసికంగా సిద్ధం కావడమే మేము చేయగలిగింది. ఎప్పుడు గులాబి బంతితో టెస్టు మ్యాచ్‌ ఆడినా.. అంతకన్నా ముందు దాంతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలి. డేనైట్‌ టెస్టు అందరికీ కొత్తే. మేము బాగానే సన్నద్ధమయ్యాం. దాన్ని ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాం. తొలి గులాబీ టెస్టు ఆడాలనే ఉత్సుకతతో ఉన్నాం.

- మొమినుల్‌ హక్‌, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌


  
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.