close

తాజా వార్తలు

ఆర్టీసీని మోయలేం

మాంద్యంతో ప్రభుత్వానికి భరించే శక్తి లేదు
ఇప్పుడున్నట్లు కొనసాగాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలి
ఎంతో కొంత సాయం చేసినా ఎంత వరకు నిలబడగలుగుతుంది?
ఛార్జీలు పెంచితే ప్రజలు బస్సులెక్కరు
సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి
ఆర్టీసీపై సీఎం సమీక్షలో విస్తృత చర్చ
రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టు తీర్పు
ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. సంస్థ ఆర్థిక పరిస్థితి, న్యాయస్థానంలో నిర్ణయాలు, నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని, అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునిల్‌శర్మ, రామకృష్ణారావు,  సందీప్‌ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌, అదనపు ఏజీ రాంచందర్‌రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యాన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది. ‘‘ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. కాలం చెల్లిన 2,600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వానికి కూడా భరించే పరిస్థితి లేదు. ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు నిలబడగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం. ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదు’’ అనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.