close

తాజా వార్తలు

కిర్రాక్‌ కోహ్లి

విరాట్‌ వీర విధ్వంసం
రాణించిన కేఎల్‌ రాహుల్‌
తొలి టీ20లో విండీస్‌పై భారత్‌ విజయం
ఈనాడు - హైదరాబాద్‌

బుల్లెట్‌ వేగంతో స్ట్రెయిట్‌ డ్రైవ్‌లు.. కళ్లుచెదిరే కవర్‌డ్రైవ్‌లు.. మతిపోగొట్టే ఫ్లిక్‌లు.. ప్రతి షాట్‌  ప్రత్యేకమే. ప్రతి బౌండరీ ఆణిముత్యమే!

ఒకే బంతికి ఎన్నిరకాల షాట్లు ఆడగలడో చూపిస్తూ సాగిన అతడి విన్యాసాలకు మైమరిచిపోని వాళ్లెవ్వరు?

తడబడుతూ మొదలుపెట్టి.. కుదురుకున్నాక.. అతను సాగించిన కళాత్మక విధ్వంసం గురించి ఏమని వర్ణించాలి?

హైదరాబాద్‌ అభిమానుల టికెట్‌ డబ్బులకు ఎన్నో రెట్ల  వినోదాన్నందిస్తూ విరాట్‌ సాగించిన వీర విధ్వంసంతో  ఉప్పల్‌ స్టేడియం హోరెత్తిపోయింది.

ఛేదన అనగానే చెలరేగిపోయే ఈ యోధుడి ధాటికి  టీ20ల్లో తన అత్యధిక లక్ష్య ఛేదనతో వెస్టిండీస్‌తో సిరీస్‌లో శుభారంభం చేసింది టీమ్‌ఇండియా.

ఊహించినట్లే ఉప్పల్‌లో ఉప్పెన వచ్చింది. 400 పైచిలుకు పరుగుల వర్షంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు. నువ్వానేనా అన్నట్లు సాగిన పరుగుల పోటీలో చివరికి టీమ్‌ఇండియాదే పైచేయి అయింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో అభిమానుల్ని ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. మొదట విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. లూయిస్‌ (40; 17 బంతుల్లో 3×4, 4×6), హెట్‌మయర్‌ (56; 41 బంతుల్లో 2×4, 4×6), కెప్టెన్‌ పొలార్డ్‌ (37; 19 బంతుల్లో 1×4, 4×6) మెరుపులు మెరిపించారు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌; 50 బంతుల్లో 6×4, 6×6) విధ్వంసక ఇన్నింగ్స్‌కు కేఎల్‌ రాహుల్‌ (62; 40 బంతుల్లో 5×4, 4×6) సమయోచిత అర్ధశతకం తోడవడంతో భారత్‌ 4 వికెట్లే కోల్పోయి, 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 జరుగుతుంది.

రాహుల్‌ నిలబెడితే..: 208 పరుగులు. పెద్ద లక్ష్యమే. తొలి ఓవర్లో 4 పరుగులే వచ్చినా.. హోల్డర్‌ వేసిన రెండో ఓవర్లో రాహుల్‌ 3 బౌండరీలు బాదడంతో ఒక్కసారిగా జోష్‌ వచ్చింది. పియర్‌ బౌలింగ్‌లో రోహిత్‌శర్మ (8) ఔటైనా ఆ ప్రభావం టీమ్‌ఇండియాపై పడలేదు. కోహ్లి నెమ్మదిగా ఆడుతున్నా.. రాహుల్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. కాట్రెల్‌, పియర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో అలరించాడు. 6 ఓవర్లకు స్కోరు 50కి చేరింది. క్రీజులో కుదురుకున్నాక కోహ్లి అడపాదడపా బౌండరీలు బాదాడు. 12వ ఓవర్లో అతను జూలు విదిల్చాడు.. హోల్డర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌, ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు. అప్పటికి 12 ఓవర్లలో స్కోరు 110/1. విజయానికి 48 బంతుల్లో 98 పరుగులు చేయాలి. 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న రాహుల్‌.. 2 సిక్సర్లతో అలరించాడు. పియర్‌ బౌలింగ్‌లో మరో భారీషాట్‌కు ప్రయత్నించిన రాహుల్‌ లాంగాఫ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కాడు. రాహుల్‌, కోహ్లి రెండో వికెట్‌కు 100 పరుగులు (67 బంతుల్లో) జోడించారు.

కోహ్లి ముగించాడు..: తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి జోరు చూపించాడు రిషబ్‌ పంత్‌ (18; 9 బంతుల్లో 2×6). అప్పటి వరకు ఓపికగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లి ఒక్కసారిగా టాప్‌ గేర్‌లోకి వెళ్లాడు. హోల్డర్‌ వేసిన 15వ ఓవర్లో కళ్లు చెదిరే సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు అక్కడ్నుంచి కోహ్లీని ఆపడం ఎవరి వల్లా కాలేదు. మైదానం నలుమూలలా షాట్లతో అలరించాడు. 15వ ఓవర్లో 15 పరుగులు.. 16వ ఓవర్లో 23 పరుగులు రాబట్టాడు. విలియమ్స్‌ వేసిన 16వ ఓవర్లో అతనికి చుక్కలు చూపించాడు. పంత్‌ ఔటైనా కోహ్లి జోరు తగ్గలేదు. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో పొలార్డ్‌ బౌలింగ్‌లో కోహ్లి మణికట్టు మాయాజాలంతో ఫ్లిక్‌ చేసి బంతిని సిక్సర్‌గా మలిచాడు. 19వ ఓవర్లో విలియమ్స్‌ను మరోసారి కోహ్లి లక్ష్యంగా చేసుకున్నాడు. రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.

విండీస్‌ విధ్వంసం: మొదట చలి వాతావరణం, మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై పట్టుచిక్కడం కష్టమని భావించి కెప్టెన్‌ కోహ్లి మరో ఆలోచనే లేకుండా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అయితే పేసర్లు భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌లను కాదని తొలి ఓవర్‌ను ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో వేయించి ఆశ్చర్యపరిచాడు విరాట్‌. ఈ ఓవర్లో ఓపెనర్‌ లూయిస్‌ ఒక బౌండరీ, సిక్సర్‌తో 13 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో సిమన్స్‌ (2) ఔటైనా లూయిస్‌ వెనక్కి తగ్గలేదు. కింగ్‌ (31; 23 బంతుల్లో 3×4, 1×6) అండతో మరింతగా రెచ్చిపోయాడు. బంతి బ్యాటుపైకి వస్తుండటంతో వీళ్లిద్దరూ విధ్వంసం సృష్టించారు. చాహర్‌ వేసిన నాలుగో ఓవర్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీతో 19 పరుగులు రాబట్టారు. భువి బౌలింగ్‌ (5వ ఓవర్‌)లో లూయిస్‌ సిక్సర్‌తో విండీస్‌ స్కోరును 50 పరుగులు దాటించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 26 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. సుందర్‌ బౌలింగ్‌లో లూయిస్‌ వికెట్ల ముందు దొరికిపోయినా విండీస్‌కు ఇబ్బంది ఎదురవలేదు. అనంతరం కింగ్‌కు హెట్‌మయర్‌ జతకలిశారు. అతను ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. వీళ్లిద్దరూ పోటీ పడి షాట్లు ఆడటంతో 9.5 ఓవర్లలోనే విండీస్‌ స్కోరు 100 దాటింది. ఈ సమయంలో జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందుకొచ్చి ఆడిన కింగ్‌ స్టంపౌటయ్యాడు. అగ్నికి వాయువు తోడైనట్లు హెట్‌మయర్‌కు కెప్టెన్‌ పొలార్డ్‌ జతకలిశాడు. ఇద్దరూ ఒక్క బౌలర్‌నూ వదల్లేదు. బంతి కనిపిస్తే బాదాలన్నట్లుగా ఆడటం, చివర్లో హోల్డర్‌ (24 నాటౌట్‌; 9 బంతుల్లో 1×4, 2×6) కూడా బ్యాటు ఝుళిపించడంతో విండీస్‌ స్కోరు 200 దాటిపోయింది.


వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి) రోహిత్‌ (బి) చాహర్‌ 2; లూయిస్‌ (ఎల్బీ) (బి) సుందర్‌ 40; కింగ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) జడేజా 31; హెట్‌మయర్‌ (సి) రోహిత్‌ (బి) చాహల్‌ 56; పొలార్డ్‌ (బి) చాహల్‌ 37; హోల్డర్‌ నాటౌట్‌ 24; రామ్‌దిన్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207; వికెట్ల పతనం: 1-13, 2-64, 3-101, 4-172, 5-173
బౌలింగ్‌: వాషింగ్టన్‌ సుందర్‌ 3-0-34-1; చాహర్‌ 4-0-56-1; భువనేశ్వర్‌ 4-0-36-0; జడేజా 4-0-30-1; చాహల్‌ 4-0-36-2; దూబే 1-0-13-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) హెట్‌మయర్‌ (బి) పియెర్‌ 8; రాహుల్‌ (సి) పొలార్డ్‌ (బి) పియర్‌ 62; కోహ్లి నాటౌట్‌ 94; పంత్‌ (సి) హోల్డర్‌ (బి) కాట్రెల్‌ 18; అయ్యర్‌ (సి) అండ్‌ (బి) పొలార్డ్‌ 4; దూబె నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 23 మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 209; వికెట్ల పతనం: 1-30, 2-130, 3-178, 4-193
బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-24-1; హోల్డర్‌ 4-0-46-0; పియర్‌ 4-0-44-2; హేడెన్‌ వాల్ష్‌ 2-0-19-0; విలియమ్స్‌ 3.4-0-60-0; పొలార్డ్‌ 1-0-10-1


తడబడుతూ మొదలుపెట్టి..

ఈ మ్యాచ్‌లో కచ్చితంగా కోహ్లి ఇన్నింగ్సే హైలైట్‌. అయితే ఎప్పట్లా క్రీజులోకి అడుగు పెట్టీ పెట్టగానే బౌలర్లపై ఆధిపత్యం చలాయించలేదతను. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం, రోహిత్‌ ఆరంభంలోనే ఔటవడంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలో పడ్డ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్‌.. తన సహజ శైలికి భిన్నంగా క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. బంతిని మిడిల్‌ చేయలేకపోయాడు. ఓవైపు కేఎల్‌ రాహుల్‌ రెచ్చిపోయి ఆడుతుంటే.. కోహ్లి తడబడటం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. దాదాపు 10.5 రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సి ఉంటే.. తొలి 20 బంతుల్లో అతను 20 పరుగులే చేయగలిగాడు. కానీ క్రీజులో కుదురుకున్నాక అసలు విరాట్‌ బయటికి వచ్చాడు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూనే అడపా దడపా బౌండరీలు బాదుతూ లయ అందుకున్న కోహ్లి.. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో చెలరేగిపోయాడు. కళ్లు చెదిరే షాట్లతో ఉప్పల్‌ స్టేడియాన్ని హోరెత్తించేశాడు. చివరి 20 బంతుల్లో భారత కెప్టెన్‌ 57 పరుగులు సాధించడం విశేషం. చివర్లో అయితే కోహ్లి షాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాళ్ల దగ్గర తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఫ్లిక్‌తో మిడ్‌వికెట్‌లో సిక్సర్‌గా మలిచి అబ్బురపరిచిన అతను.. మ్యాచ్‌ ముగిసిన చివరి ఓవర్లో ఆఫ్‌సైడ్‌ రెండు కళ్లు చెదిరే సిక్సర్లు అందుకున్నాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడ్డ బంతిని కవర్స్‌లో సిక్సర్‌గా మళ్లించిన తీరుకు నోరెళ్లబెట్టి చూస్తుంటే.. ఇంకో బంతి విరామంలో లాంగాన్‌లో ఫ్లాట్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి మరింతగా మైమరిపించేశాడు. తన విన్యాసాలకు ఉర్రూతలూగిపోతున్న అభిమానులకు పిచ్‌ మధ్యలో నిలబడి కోహ్లి అభివాదం చేసిన తీరు మరో హైలైట్‌!


‘‘టీ20 క్రికెట్లో బంతిని గాల్లోకి పంపి అభిమానులను అలరించే రకం కాదు నేను. నా దృష్టంతా పని పూర్తిచేయడంపైనే ఉంటుంది. నా ఆటను మార్చుకోవడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నేను మూడు ఫార్మాట్లు ఆడతాను. అన్నింట్లో జట్టు విజయాల కోసం తోడ్పడాలన్నదే నా లక్ష్యం. ఏదో ఒక ఫార్మాట్‌కు పరిమితం కాదల్చుకోలేదు’’

- విరాట్‌ కోహ్లి

 

 


94

కోహ్లి స్కోరు. టీ20ల్లో ఇదే అతడికి అత్యుత్తమం. 2016 ఆస్ట్రేలియాపై సాధించిన 90 పరుగులు ఇప్పటిదాకా అత్యధికం.


209

భారత్‌ ఛేదించిన లక్ష్యం. టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక ఛేదన. 2013లో ఆస్ట్రేలియాపై నెలకొల్పిన రికార్డు (202) బద్దలైంది.


3

భారత్‌ టీ20ల్లో 200 పైచిలుకు స్కోర్లు సాధించిన సందర్భాలు.


విలియమ్స్‌కు టిక్‌ టిక్‌ టిక్‌

విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోనే ఉంది. విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతికి మణికట్టును ఉపయోగించి లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌ బాదాడు. ఆ ఊపులో కోహ్లి.. ఆసక్తికర రీతిలో స్పందించాడు. బ్యాట్‌ను నోట్‌బుక్‌లా చేసుకుని మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సంజ్ఞ చేశాడు. వెస్టిండీస్‌ పర్యటనలో విలియమ్స్‌ జేబులోంచి బుక్‌ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్‌ అనంతరం కోహ్లి వెల్లడించాడు.


నాలుగు క్యాచ్‌లు నేలపాలు

ఫీల్డింగ్‌లో నిలకడ లేమిని భారత్‌ మరోసారి బయటపెట్టింది. చాహర్‌ వేసిన 16వ ఓవర్లో సునాయాసమైన క్యాచ్‌ను షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో సుందర్‌ అందుకోలేకపోయాడు. క్యాచ్‌ను అంచనా వేయడంలో పొరబడ్డ సుందర్‌ రెండడుగులు వెనక్కి వెళ్లగా.. బంతి అతడి ముందే పడింది. చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులూ క్యాచ్‌లే. సుందర్‌ ఓ క్యాచ్‌ను వదిలేస్తే.. రోహిత్‌ రెండు విడిచిపెట్టాడు.


నోబాల్‌ అలా..

క్రీజు నోబాల్‌ను మూడో అంపైర్‌ ప్రకటించే నిబంధన శుక్రవారం అమల్లోకి వచ్చింది. విలియమ్స్‌ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని మూడో అంపైర్‌ అనిల్‌ చౌదరి నోబాల్‌గా ప్రకటించాడు. 15, 16 ఓవర్లలో మరో రెండు నోబాల్స్‌ నమోదయ్యాయి. కానీ ఫ్రీహిట్లు వేటికీ భారత బ్యాట్స్‌మెన్‌ బౌండరీలు బాదలేకపోయారు.


అజ్జూ పేరిట స్టాండ్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ను హెచ్‌సీఏ గౌరవించింది. ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ పెవిలియన్‌ స్టాండుకు అజహర్‌ పేరు పెట్టింది. శుక్రవారం టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు అజ్జూ స్టాండును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను అజహర్‌ సన్మానించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.