close

తాజా వార్తలు

తీర్పు చెప్పిన తూటా

ఎదురు కాల్పుల్లో దిశకంఠుల హతం
ఆమెను కాల్చేసిన చోటే కాల్పుల్లో మృతి
పోలీసులకు జనం ప్రశంసలు.. మేధావులు, న్యాయకోవిదుల విమర్శలు
ఈనాడు - హైదరాబాద్‌, షాద్‌నగర్‌ - న్యూస్‌టుడే

అంతా అనుమానించినట్లే.. ఎక్కువమంది ఆశించినట్లే జరిగింది.
‘దిశ’ కేసులో నిందితులకు ‘సత్వర’ శిక్ష పడింది..
ఒంటరి ఆడపిల్ల పట్ల పాశవికంగా వ్యవహరించిన మృగాళ్లకు పోలీసులు మరణశాసనం రాశారు.
రాక్షసకాండ సాగించిన వారం వ్యవధిలోనే.. ‘పోలీస్‌ మార్కు తీర్పు’ వెలువడింది.
ఆమెపై పెట్రోలు పోసి దహనం చేసిన ప్రాంతానికి సమీపంలోనే.. ఆ దుర్మార్గుల కథ ముగిసింది.
ఆమె ఆక్రందనలు గాలిలో కలిసిపోయినచోటే తూటాలు గర్జించాయి..
నిందితుల చావుకేకలతో ఆ ప్రాంతం మారుమోగింది..
శుక్రవారం తెల్లవారుతూనే నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్త ప్రపంచాన్ని చుట్టేసింది..
ఈ ఎన్‌కౌంటర్‌పై జనం ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. పలువురు మేధావులు,
న్యాయకోవిదులు విమర్శలు గుప్పిస్తున్నారు. సమస్యకు ఇది పరిష్కారం కాదంటున్నారు.

దిశపై జరిగిన కిరాతకానికి జాతి మొత్తం స్పందించింది. పిల్లలున్న ప్రతి తల్లీ కన్నీరు కార్చింది.. ఆడబిడ్డలున్న ప్రతి తండ్రీ ఆవేదన చెందాడు.. పార్లమెంటు దిగ్భ్రాంతి చెందింది.. పార్టీలకతీతంగా నేతలు స్పందించారు.. అన్ని ప్రాంతాల్లో కట్టలు తెంచుకున్న ఆవేశంతో సామాన్యులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. జరిగిన కిరాతకాన్ని తీవ్రంగా ఖండించారు.

నిందితులు పోలీసుల చేతిలో హతమైన విషయం తెలియగానే జనమంతా సంబరాలు చేసుకున్నారు. కేసుల సాగతీత.. విచారణలో విపరీతమైన జాప్యం, కోర్టుల్లో కాలహరణంతో విసిగిపోయి ఉన్న సామాన్యులు పోలీసుల చర్యను కీర్తించారు.. విద్యావంతులు కూడా చట్టాలు, కోర్టుల గురించి మరిచిపోయినట్టే స్పందించారు. ఈ రాక్షసుల విషయంలో పోలీసులు చేసిందే సరైన.. ‘సత్వర న్యాయమంటూ’ నినదించారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి తండోపతండాలుగా.. వేలాదిగా చేరుకున్న జనం పోలీసులపై పూల వర్షం కురిపించారు. తగిన శాస్తి జరిగిందంటూ తేల్చిచెప్పారు.

దేశాన్ని పట్టి కుదిపేసిన ‘దిశ’ కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. గతనెల 27న శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద ‘దిశ’ తన ద్విచక్ర వాహనాన్ని పార్క్‌చేసిన విషయాన్ని గమనించిన మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ మహ్మద్‌ అలీ, చింతకుంట చెన్నకేశవులు, జల్లు నవీన్‌, జొల్లు శివ అనే లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఆమె తిరిగి వచ్చాక కిడ్నాప్‌ చేశారు. ప్రధాన రహదారి పక్కనే గోడ చాటుకు లాక్కెళ్లి నలుగురూ మూకుమ్మడిగా లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను 30 కిలోమీటర్ల దూరంలోని చటాన్‌పల్లి గ్రామం వద్ద ఉన్న కల్వర్టు కిందకు చేర్చి దహనం చేశారు. ఈ సంఘటన జరిగిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

ఆ రాత్రి దిశ తండ్రి, సోదరి ఫిర్యాదు చేయడానికి రాగా పరిధుల పేరుతో పోలీసులు తిప్పించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి నవంబరు 30న న్యాయస్థానంలో ప్రవేశపెట్టి చర్లపల్లి జైలుకు తలించారు. దర్యాప్తులో కోసం నిందితులను విచారించేందుకు పదిరోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా షాద్‌నగర్‌ న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 4న నిందితులను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజులపాటు విచారించారు. దిశ సెల్‌ఫోన్‌, చేతిగడియారం, పవర్‌బ్యాంక్‌లను చటాన్‌పల్లి కల్వర్టు సమీపంలోనే దాచిపెట్టినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పదిమంది పోలీసుల బృందం శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నిందితులను తీసుకొని దిశను దహనం చేసిన కల్వర్టు వద్దకు చేరుకుంది. దాచిపెట్టిన వస్తువులు ఇక్కడున్నాయి, అక్కడున్నాయి అంటూ నిందితులు సమీపంలోని పొలాల్లో తిప్పారు. అనంతరం 5.45 గంటల ప్రాంతంలో కల్వర్టుకు ఎడమవైపు 400 మీటర్ల దూరంలో మైదాన ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు కలిసి మూకుమ్మడిగా పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌లు గాయపడ్డారు. లొంగిపొమ్మని హెచ్చరించినా నిందితులు పెడచెవిన పెట్టారని, అదే క్రమంలో ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసుల వద్ద 9ఎంఎం పిస్టళ్లను లాక్కొని తమపై కాల్పులు జరిపారని, దాంతో తాము ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులూ హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ తతంగమంతా ఉదయం 6.15 గంటలకు ముగిసింది. పది నిమిషాలపాటు ఎదురుకాల్పులు కొనసాగిన తర్వాత నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించగా నలుగురు నిందితులు నిర్జీవులుగా కనిపించారు.

కస్టడీ అంతా రహస్యం
దిశ ఉదంతంపై దేశవ్యాప్తంగా పెనుదుమారం రేగిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన 24 గంటల్లోనే నిబంధనల ప్రకారం రిమాండుకు తరలించారు. అయితే దర్యాప్తులో భాగంగా వీరిని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ మాత్రం పోలీసులు తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు. సోమవారం కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయగా అదేరోజు న్యాయస్థానం అనుమతించింది. కాని పోలీసులు మాత్రం దాన్ని దాచిపెట్టారు. ఎదురు కాల్పుల్లో నిందితులు హతమయ్యే వరకూ వారు పోలీసు కస్టడీలో ఉన్న సంగతి బయటికి తెలియకపోవడం గమనార్హం.

చీకట్లో ఎందుకు తీసుకువెళ్లారు?
ఏ నేరం జరిగినా కైం సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ జరుగుతుంది. నిందితులు తీసుకెళ్లి వారు నేరం చేసిన విధానాన్ని అడిగి తెలుసుకుంటారు. ఇదంతా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే దిశ వ్యవహారంలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రకావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను పట్టపగలు బయటకు తీసుకొస్తే జనం తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతోనే ఎవరికీ తెలియకుండా తెల్లవారుఝామునే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.

ఉదయం నుంచి అక్కడే సజ్జనార్‌
ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నిందితుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించే వరకూ అంటే సాయంత్రం 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్‌కౌంటర్‌ వివరాలను వెల్లడించారు. ఆయనతోపాటు డీసీపీలు ప్రకాష్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పద్మజ, అనసూయ, విజయ్‌కుమార్‌, రోహిణీప్రియదర్శిని, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌లు అక్కడే ఉన్నారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి శవపరీక్షల కోసం మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.


నాలుగు మృతదేహాలు నాలుగుచోట్ల

దిశను దహనం చేసిన కల్వర్టుకు ఎడమవైపు పొలాల మధ్య చిన్న కాలిబాట మాత్రమే ఉంది. దాదాపు 400 మీటర్ల దూరం నడిచిన తర్వాత కొంత మైదాన ప్రాంతం ఉంది. అటు నుంచి పొలాల మధ్యగా కిలోమీటరు దూరం వెళితే దూసుకల్లు గ్రామానికి వెళ్లే దారి వస్తుంది. అక్కడ వెంకటయ్య అనే రైతుకు చెందిన ఖాళీ స్థలం మీదుగా పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో నలుగురూ హతమయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆరిఫ్‌, చెన్నకేశవులు కుడి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరికి కొంత దూరంలో నవీన్‌, శివల మృతదేహాలు ఉన్నాయి.


నిందితుల గుండెల్లో దిగిన తూటాలు
ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ను కూల్చిన నాలుగు బుల్లెట్లు
మృతదేహాలకు 12 గాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌కౌంటరైన నిందితుల మృతదేహాలకు 12 తూటా గాయాలున్నాయి. ఒక్కో మృతదేహానికి మధ్య సుమారు 10 అడుగుల దూరం ఉంది.
* ఆరిఫ్‌ మృతదేహంలో నాలుగు తూటా గాయాలున్నాయి. అతడి ఛాతీకి కుడి, ఎడమవైపుల్లో ఒక్కోటి చొప్పున, డొక్క, కడుపులోకి మరో రెండు తూటాలు దూసుకెళ్లాయి.
* జొల్లు శివ కుడి వైపు ఛాతీ, మెడ, కడుపుల్లో తూటా గాయాల్ని గుర్తించారు.
* జొల్లు నవీన్‌ కణత, ఛాతీ నుంచి తూటాలు దూసుకెళ్లాయి. అతడి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి.
* చింతకుంట చెన్నకేశవులు ఛాతీ, కడుపు, ఎడమ భుజానికి ఈ గాయాలున్నాయి.


13 ఆయుధాల గుర్తింపు

పోలీసులపై దాడి చేసేందుకు నిందితులు రెండు తుపాకులతోపాటు కర్రలు, ఇటుకలు, రాళ్లు ఉపయోగించారు.


జనం హర్షాతిరేకాలు

దిశ నిందితులు పోలీసు ఎదురు కాల్పుల్లో మరణించారన్న విషయం తెలియగానే ఉదయం 7 గంటల నుంచే జనం తండోపతండాలుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. షాద్‌నగర్‌ హైవేపై కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాదిమంది జనం హైవేపైనా, కింద ఉన్న పొలాల్లో నిలబడి పెద్దఎత్తున హర్షధ్వానాలు చేయడం మొదలుపెట్టారు. పటాకులు కాల్చారు. పోలీసులపై పూలవర్షం కురిపించారు.బస్సుల్లో, వాహనాల్లో వెళ్తున్నవారు కూడా పోలీసులకు జేజేలు పలికి వెళ్లిపోవడం గమనార్హం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.