close

తాజా వార్తలు

విచారణ ‘దిశ’గా...

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ఆరా
ఆసుపత్రిలో మృతదేహాల పరిశీలన
సంఘటన స్థలం సందర్శన

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, షాద్‌నగర్‌ పట్టణం, శంషాబాద్‌ గ్రామీణ: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణ మొదలైంది. నిందితులు నలుగురూ ఈ ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. కమిషన్‌ నియమించిన సీనియర్‌ ఎస్పీ మన్‌జీత్‌ సైనీతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం దిల్లీ నుంచి శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. బృంద సభ్యులు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. తొలుత మృతదేహాలను, శవపరీక్షల నివేదికలను పరిశీలించారు. గాయాల ఆనవాళ్లు చూశారు. శవపరీక్ష నిర్వహించిన గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల నుంచి వివరాలు సేకరించారు. నిందితులకు పాత గాయాలేమైనా ఉన్నాయా? పోలీసు కస్టడీలో ఏమైనా గాయాలయ్యాయా?, ఎంత దూరం నుంచి కాల్పులు జరిగాయి? తదితర విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. శవపరీక్ష నివేదికలు, వీడియోలను తీసుకున్న బృందం సభ్యులు సాయంత్రం 5 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. అనంతరం గాంధీ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి కృపాల్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిషన్‌ మార్గదర్శకాలు, ప్రొటోకాల్‌ ప్రకారం శవపరీక్షలు నిర్వహించాం. మరో 2, 3 రోజుల్లో శవపరీక్ష నివేదికల్ని సమర్పిస్తాం’ అని తెలిపారు.

చీకటిలోనే ఘటనాస్థలి పరిశీలన
కమిషన్‌ సభ్యుల పర్యటన సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. కేవలం రోగులను మాత్రమే ఆవరణలోకి పంపించారు. ఆసుపత్రి నుంచి నిందితుల స్వగ్రామాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారనే ప్రచారం జరిగినా, కమిషన్‌ సభ్యులు నేరుగా చటాన్‌పల్లికి పయనమయ్యారు. అక్కడికి సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు. గత నెల 27న రాత్రి ‘దిశ’ ద్విచక్ర వాహనం పార్క్‌ చేసిన స్థలాన్ని పరిశీలించారు. తొండుపల్లి టోల్‌గేట్‌ పరిసరాలను చూశారు. అప్పటికే చీకటి పడటంతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని తాత్కాలిక దీపాల వెలుగులో పరిశీలించారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. అనంతరం ‘దిశ’ను కాల్చేసిన స్థలాన్ని పరిశీలించి 6.20 గంటలకు వెనుదిరిగారు. వారు దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నక్షత్ర కాలనీకి వస్తారని ప్రచారం జరిగినా రాలేదు. అక్కడి నుంచి శంషాబాద్‌ డీసీపీ కార్యాలయానికి వెళ్లి, పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.

నేడు గ్రామాల్లో బృందం పర్యటన?
మానవ హక్కుల సంఘం విచారణ బృందం సభ్యులు ఆది, సోమవారాలు కూడా రాష్ట్రంలోనే ఉంటారు. నిందితుల స్వగ్రామాలు గుడిగండ్ల, జక్లేరులో ఆదివారం ఈ బృందం పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితుల శవ పంచనామా కోసం తీసుకువెళ్లిన వారి కుటుంబసభ్యులను పోలీసులు శనివారం రాత్రి హడావుడిగా విడిచిపెట్టారు. వనపర్తి ఎస్పీ అపూర్వారావు పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మహ్మద్‌ ఆరిఫ్‌ తండ్రి హుస్సేన్‌, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్‌ తల్లి లక్ష్మిలను ప్రత్యేక వాహనాల్లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాలను వారు గుర్తించాక సంతకాలు తీసుకున్నారు.

శవాగారం వద్ద భద్రత
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలోనే భద్రపరిచారు. ఇక్కడ నాలుగు ఫ్రీజర్లలో రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రెండింటిని బయటి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి ఆవరణలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.


ఆ నలుగురి దేహాల్లో ఒక్క తూటా కూడా లేదు!

దిశ హత్య కేసు నిందితుల పోస్టుమార్టంలో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. శుక్రవారం రాత్రి వరకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగ అధిపతి డా.కృపాల్‌సింగ్‌, నిపుణులు డా.లావణ్య, డా.మహేందర్‌ శవపరీక్షలు నిర్వహించారు. నలుగురు నిందితుల శరీరాల్లో మొత్తం 12 తూటాలు దిగినట్లు పోలీసులు చెబుతున్నా... పోస్టుమార్టం సమయంలో ఒక్క తూటా కూడా కనిపించలేదని విశ్వసనీయ సమాచారం. అవి వారి శరీరాలను చీల్చుకుని బయటికి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు డా.కృపాల్‌సింగ్‌ నిరాకరించారు.

-మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే


‘దిశ’ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ లేనట్లే!

దిశ హత్యాచార ఘటనలో ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ ఇక లేనట్లే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును త్వరితగతిన ముగించేందుకు హైకోర్టు అనుమతితో ప్రభుత్వం ఈ నెల 3న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌ మొదటి అదనపు జిల్లా, సెక్షన్‌ జడ్జి న్యాయస్థానంలోనే ఈ విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులూ షాద్‌నగర్‌ చటాన్‌పల్లి ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఇక విచారణ అవసరం లేకుండా పోయింది.


ఎందుకు చంపారని నిలదీశా

‘శుక్రవారం రాత్రి మగవాళ్లను ఒక గదిలో, నవీన్‌ తల్లి లక్ష్మిని మరో గదిలో ఉంచారు. మేడం(మహబూబ్‌నగర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరి) వచ్చి మా కుమారుల వివరాలు అడిగారు. కోర్టు 14 రోజుల తర్వాత తీర్పు ఇస్తుంది గదా.. ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశారని ఆమెను అడిగాను. వారు పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పారు. కోర్టు కూడా ఉరిశిక్ష వేస్తే ఒక్కసారి తల్లిదండ్రులు, భార్యతో మాట్లాడిస్తుంది. మా అబ్బాయికి పెళ్లి కాలేదు. ఒక్కసారి మాతో మాట్లాడించాల్సింది అని చెప్పాను. మా నలుగురినీ వేరు వేరుగా విచారించారు’ అని ఒక నిందితుడి తండ్రి ‘ఈనాడు’కు తెలిపారు.


దర్యాప్తు అధికారిగా అదనపు డీసీపీ

చటాన్‌పల్లి ఎదురుకాల్పుల ఘటన దర్యాప్తు అధికారిగా అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ఎస్‌వోటీ ఓఎస్‌డీగా ఉన్నారు. ఎదురుకాల్పుల ఘటనలపై సంబంధిత డివిజన్‌ అధికారులతో కాకుండా వేరే యూనిట్‌ అధికారితో దర్యాప్తు చేయించాలనే ఆదేశాలుండడంతో సురేందర్‌రెడ్డికి ఈ కేసు బాధ్యత అప్పగించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.