close

తాజా వార్తలు

హిట్‌మయర్‌

షిమ్రోన్‌ మెరుపు శతకం
షై హోప్‌ సెంచరీ
తొలి వన్డేలో భారత్‌ పరాజయం
సిరీస్‌లో వెస్టిండీస్‌ బోణీ
చెన్నై

ఫేవరెట్‌కు షాక్‌. పొట్టి సిరీస్‌ గెలిచిన ఊపుతో వన్డే సిరీస్‌లో అడుగుపెట్టిన కోహ్లీసేనకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. హెట్‌మయర్‌ నిర్దాక్షిణ్యానికి, షై హోప్‌ సహనానికి బౌలర్లు దాసోహమన్న వేళ.. తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయింది. కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకుంటూ పంత్‌, శ్రేయస్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరు అందించినా.. పసలేని బౌలింగ్‌ దాన్ని కాపాడలేకపోయింది. చెపాక్‌ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.

షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (139; 106 బంతుల్లో 11×4, 7×6) మెరుపు శతకానికి.. షై హోప్‌ (102 నాటౌట్‌; 151 బంతుల్లో 7×4, 1×6) ఓపికతో కూడిన సెంచరీ తోడవడంతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌తో 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. రిషబ్‌ పంత్‌ (71; 69 బంతుల్లో 7×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (70; 88 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో మొదట భారత్‌ 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. హెట్‌మయర్‌, హోప్‌ల గొప్ప భాగస్వామ్యం (218)తో లక్ష్యాన్ని విండీస్‌ మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జడేజా (0/58), షమి (1/57), శివమ్‌ దూబె (0/68, 7.5 ఓవర్లు) పూర్తిగా తేలిపోయారు. కుల్‌దీప్‌ యాదవ్‌ (0/45) కట్టడి చేసినా వికెట్లు తీయలేకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దీపక్‌  చాహర్‌ (1/48)కు సరైన సహకారం లభించలేదు. హెట్‌మయర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డే బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది.

తేలిపోయిన బౌలర్లు..: అది మరీ తక్కువ లక్ష్యమేమీ కాదు. కానీ భారత బౌలర్లు తేలిపోయారు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌పై ప్రభావం చూపలేకపోయారు. 11 పరుగులకే ఓపెనర్‌ ఆంబ్రిస్‌ (9) వికెట్‌ను కోల్పోయిన ప్రత్యర్థిపై ఒత్తిడి తేలేకపోయారు. హెట్‌మయయర్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను విజయపథంలో నడిపించాడు. నియంత్రణతో కూడిన దూకుడుతో బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చక్కని ఫుట్‌వర్క్‌, షాట్‌ సెలక్షన్‌తో సాధికారికంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో అదరగొట్టాడు. క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ ఛేదన ఎప్పుడూ తమ జట్టు నియంత్రణలోనే ఉండేలా చేశాడు. హెట్‌మయర్‌లా ధాటిగా ఆడకపోయినా షైహోప్‌ది కూడా అంతే కీలక ఇన్నింగ్స్‌. ఓ వైపు క్రీజులో పాతుకుపోయిన అతడు.. మరోవైపు చెలరేగుతున్న హెట్‌మయర్‌కు చక్కని సహకారాన్నిచ్చాడు. హెట్‌మయర్‌ 50 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయగా.. అందుకు హోప్‌ 92 బంతులు తీసుకున్నాడు. అర్ధశతకం తర్వాత హెట్‌మయర్‌ గేర్‌ మార్చాడు. మరో 35 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. కోహ్లి ఎన్ని మార్పులు చేసినా మధ్య ఓవర్లలో వికెట్‌ దక్కలేదు. ఐదో బౌలర్‌ దూబె పూర్తిగా తేలిపోయాడు. జడేజా కూడా మాయ చేయలేకపోయాడు. 106 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హెట్‌మయర్‌.. జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. దూకుడు కొనసాగించిన అతడు చివరికి షమి బౌలింగ్‌ ఔటైనా.. అప్పటికే వెస్టిండీస్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. 40వ ఓవర్లో హెట్‌మయర్‌   నిష్క్రమించే సమయానికి స్కోరు 229. అయినా విండీస్‌ సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన హోప్‌.. పూరన్‌ (29 నాటౌట్‌)తో కలసి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. భారత్‌ బ్యాటింగ్‌ చేసినప్పుడు ఉన్నంత మందకొడిగా పిచ్‌ లేకపోవడం కూడా విండీస్‌కు కలిసొచ్చింది.

పంత్‌ పాసయ్యాడు.. శ్రేయస్‌ నిలిచాడు: వరుస వైఫల్యాలతో జట్టులో తన స్థానమే ప్రశ్నార్థకమైన స్థితిలో యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌  కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరిణతితో కూడా ఇన్నింగ్స్‌ ఆడిన అతడు కెరీర్‌లో తొలి వన్డే అర్ధశతకం సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. షాట్ల ఎంపికలో ఈసారి అతడు తొందరపడలేదు. మరోవైపు శ్రేయస్‌ కూడా అంతే విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్థానంలో తాను సరైన బ్యాట్స్‌మన్‌నేని మరోసారి నిరూపించుకుంటూ అదరగొట్టాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌.. ఓపెనర్లు రోహిత్‌ (36; 56 బంతుల్లో 6×4), రాహుల్‌ (6) అతి జాగ్రత్తగా ఆడడంతో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. కాట్రెల్‌ వరుస రెండు మెయిడెన్లు వేయగా.. హోల్డర్‌ కూడా ఎక్కువ పరుగులేమీ ఇవ్వలేదు. 5 ఓవర్లకు స్కోరు 17  పరుగులే. ఆరో ఓవర్లో రాహుల్‌, కోహ్లి (4)లను ఔట్‌ చేయడం ద్వారా కాట్రెల్‌ భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. అయితే  భారత్‌  7 ఓవర్లలో 25 పరుగులకే  రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే నిలదొక్కుకుని మంచి స్కోరు చేసేలా కనిపించిన దశలో రోహిత్‌ 18వ ఓవర్లో జోసెఫ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 80/3. ఆ దశలో శ్రేయస్‌కు తోడైన పంత్‌ జట్టును మెరుగైన స్కోరు దిశగా నడిపించాడు. శ్రేయస్‌ లాగే పంత్‌ కూడా నిలదిక్కుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు.  క్రమంగా ఇద్దరూ చక్కని షాట్లతో అలరించారు. సంయమనాన్ని ప్రదర్శించినా అవకాశం వచ్చినప్పుడు బంతిని గాల్లోకి లేపడానికి వెరవలేదు. పిచ్‌ను అర్థం చేసుకున్నాక దూకుడు పెంచిన పంత్‌ బలమైన షాట్లు ఆడాడు. ఇక శ్రేయస్‌.. స్పిన్నర్లు చేజ్‌, హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో చక్కని కట్స్‌ ఆడాడు. అయితే నాలుగో వికెట్‌కు 114 పరుగులు జోడించిన పంత్‌, శ్రేయస్‌ కొద్ది తేడాలో నిష్క్రమించడంతో భారత్‌ 40వ ఓవర్లో 210/5కు  పడిపోయింది. అయితే కేదార్‌ జాదవ్‌ (40; 35 బంతుల్లో 3×4, 1×6), జడేజా (21; 21 బంతుల్లో 2×4) ఆరో వికెట్‌కు వేగంగా 59 పరుగులు జోడించారు. ఇద్దరూ 48వ ఓవర్లో ఔటయ్యారు. అరంగేట్ర ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె (9) భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో చివరి ఓవర్లో నిష్క్రమించాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 36; రాహుల్‌ (సి) హెట్‌మయర్‌ (బి) కాట్రెల్‌ 6; కోహ్లి (బి) కాట్రెల్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) పొలార్డ్‌ (బి) జోసెఫ్‌ 70; పంత్‌ (సి) హెట్‌మయర్‌ (బి) పొలార్డ్‌ 71; జాదవ్‌ (సి) పొలార్డ్‌ (బి) పాల్‌ 40; జడేజా రనౌట్‌ 21; దూబె (బి) హోల్డర్‌ (బి) పాల్‌ 9; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 6; షమి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 24 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 287; వికెట్ల పతనం: 1-21, 2-25, 3-80, 4-194, 5-210, 6-269, 7-269, 8-282; బౌలింగ్‌: కాట్రెల్‌ 10-3-46-2; హోల్డర్‌ 8-0-45-0; వాల్ష్‌ 5-0-31-0; పాల్‌ 7-0-40-2; జోసెఫ్‌ 9-1-45-2; చేజ్‌ 7-0-42-0; పొలార్డ్‌ 4-0-28-1

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ నాటౌట్‌ 102; ఆంబ్రిస్‌ ఎల్బీ (బి) చాహర్‌ 9; హెట్‌మయర్‌ (సి) శ్రేయస్‌ (బి) షమి 139; పూరన్‌ నాటౌట్‌ 29; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (47.5 ఓవర్లలో 2 వికెట్లకు) 291; వికెట్ల పతనం: 1-11, 2-229; బౌలింగ్‌: చాహర్‌ 10-1-48-1; షమి 9-1-57-1; కుల్‌దీప్‌ 10-0-45-0; దూబె 7.5-0-68-0; కేదార్‌ 1-0-11-0; జడేజా 10-0-58-0


భారత్‌ అంటే చాలు..

ఆండీ ఫ్లవర్‌, బ్రయాన్‌ లారా, జయసూర్య, సయీద్‌ అన్వర్‌.. వీళ్లందరికీ పోలిక ఉంది అందరూ లెఫ్ట్‌హ్యాండర్లే కావడం.. అందరూ భారత్‌తో మ్యాచ్‌ అంటే చెలరేగిపోవడం! ఇప్పుడు వెస్టిండీస్‌ కుర్రాడు హెట్‌మయర్‌ను చూస్తే వీళ్లే గుర్తొస్తున్నారు. మిగిలిన జట్లపై అతను పెద్దగా ఆడిందే లేదు.. కానీ భారత్‌ అంటే చాలు అతను పండగ చేసుకుంటున్నాడు. టీ20 సిరీస్‌లో వరుసగా 56, 23, 41 పరుగులు చేసిన ఈ లెఫ్ట్‌హ్యాండర్‌... మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లోనే 139 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. స్లో బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడడమంటే ఇష్టపడే ఈ యువ కెరటం.. జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో విరుచుకుపడి పరుగులు సాధించాడు. మొత్తం మీద భారత్‌పై ఇప్పటిదాకా ఆడిన 9 టీ20ల్లో ఒక అర్ధసెంచరీతో సహా 178 పరుగులు చేసిన హెట్‌మయర్‌.. 10 వన్డేల్లో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. భారత్‌తో తానాడిన తొలి రెండు వన్డేల్లోనే అతను 106, 94 పరుగులు చేశాడు. భారత పేసర్లకు మిగిలిన జట్లు బెదురుతుంటే.. ఈ కుర్రాడు మాత్రం అలవోకగా పరుగులు సాధిస్తున్నాడు. తర్వాతి రెండు వన్డేల్లో అతడికి అడ్డుకట్ట వేయడానికి భారత బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధం కావాల్సిందే.


జడేజా రనౌట్‌పై రగడ

రవీంద్ర జడేజాను అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డగౌట్‌ బయటికొచ్చి తీవ్ర అసహనాన్ని ప్రదర్శించాడు. 48వ ఓవర్లో జరిగింది ఆ ఘటన. జడేజా సింగిల్‌ కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్‌ చేజ్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నేరుగా స్టంప్స్‌కు త్రో చేశాడు. జడేజా క్రీజును అందుకోలేకపోయాడు. ఎవరూ గుర్తించలేదు. విండీస్‌ ఫీల్డర్లు కూడా అప్పీలు చేయలేదు. కానీ రనౌట్‌ను భారీ తెరపై చూపించాక అంపైర్‌ మూడో అంపైర్‌ను సంప్రదించాడు. దీంతో జడేజా రనౌటయ్యాడు. అంపైర్‌ షాన్‌ జార్జ్‌.. మూడో అంపైర్‌కు నివేదించడానికి సంబంధించి టైమింగ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంపైర్‌ అంత ఆలస్యంగా ఎందుకు మూడో అంపైర్‌కు ఇచ్చాడన్నది స్పష్టంగా తెలియదు. కానీ త్రో చేశాక చేజ్‌ అంపైర్‌తో మామూలుగా మాట్లాడుతూ.. రనౌటయ్యాడేమో చూడండి అని అడిగాడు. కానీ అంపైర్‌ వేలెత్త లేదు. అప్పుడు పొలార్డ్‌ కూడా వచ్చి అంపైర్‌ను ప్రశ్నించాడు. అంపైర్‌కు పరిస్థితేంటో అర్థం కానట్లు కనిపించాడు. చాలా అలస్యంగా రిఫరల్‌ అడిగాడు. జడేజాను మూడో అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించగా.. కోహ్లి తన కుర్చీలో నుంచి లేచి మైదానం వైపు వెళ్లి  ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.


‘‘జడేజా రనౌట్‌కు సంబంధించి ఫీల్డర్‌ అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌ అన్నాడు.  అక్కడితో ఆ కథ ముగిసింది. బయట కూర్చుని టీవీ చూస్తున్న వాళ్లు ఫీల్డర్లకు చెబితే.. వాళ్లు అంపైర్‌ను మళ్లీ సమీక్ష కోసం అడగడం క్రికెట్లో ఇంతకముందెన్నడూచూడలేదు. ఈ విషయంలో నిబంధనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. మళ్లీ రీప్లే చూడాలనుకుంటే ఆ బాధ్యత రిఫరీ లేదా అంపైర్లు చూసుకోవాలి. మైదానంలోని విషయాల్ని బయటి వాళ్లు నిర్దేశించకూడదు. ఈ రోజు సరిగ్గా అదే జరిగింది’’

- కోహ్లి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.