close

తాజా వార్తలు

అమరావతికి కంఠాభరణం పురోగతికి రాజమార్గం

189 కి.మీ.ల పరిధిలో అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అంతా సిద్ధం
రూ.17,761 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి
రాజధాని మారిస్తే ఆగిపోయే ప్రమాదం

 

బాహ్య వలయ రహదారులు... ప్రపంచ వ్యాప్తంగా నగర ప్రణాళికల్లో అత్యంత కీలక పాత్ర వీటిది! ఎన్నో మహానగరాల పురోభివృద్ధికి ఈ అవుటర్‌ రింగురోడ్లు దోహదం చేశాయి. ఇందుకు హైదరాబాద్‌ నగరమే తాజా ఉదాహరణ. ఓఆర్‌ఆర్‌  నిర్మించక ముందు, నిర్మించిన తర్వాత అనే స్థాయిలో అక్కడ అభివృద్ధి జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు కేవలం అమరావతి నగర నిర్మాణానికే పరిమితం కాలేదు. అమరావతిని సమీపంలోని మరో రెండు నగరాలు, రెండు పట్టణాలతో అనుసంధానిస్తూ ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి నాటి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కలసి ప్రతిపాదలను రూపొందించాయి. కేంద్ర ప్రభుత్వమూ అనుమతి ఇవ్వడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కూడా తయారైంది. ఇక అవసరమైన భూములను సమీకరించడమే తరువాయి..! వెంటనే పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధంగా ఉంది. ఇలాంటి కీలక తరుణంలో రాజధానిని మారిస్తే... రూ.వేల కోట్లతో చేపట్టే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదముంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికీ అది విఘాతమే అవుతుంది.

చుట్టుపక్కల ఉన్న 2 నగరాలు, 2 పెద్ద పట్టణాలు, 87కు పైగా గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మించే ఈ ‘ఓఆర్‌ఆర్‌’... రాజధాని అమరావతి ప్రాంతం మొత్తాన్ని ఓ మహా నగరంగా తీర్చిదిద్దేందుకు నాటి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది మొత్తం రాష్ట్రాభివృద్ధికీ రాచబాటగా నిలుస్తుందని కార్యాచరణా చేపట్టింది. దీనికి కేంద్రం అనుమతీ వచ్చింది.  కానీ,... ఇటీవలి కాలంలో రాజధాని మార్పు అంశం తెరపైకి రావడంతో... రూ.17వేల కోట్ల అంచనాతో పట్టాలెక్కబోతున్న ఈ భారీ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూసేకరణ చేస్తే చాలు... పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ‘ఓఆర్‌ఆర్‌’పై  ప్రత్యేక కథనం

 

 

బాహ్య వలయ స్వరూపం ఇలా...!

* నిర్మాణ వ్యయం (2018 జనవరి అంచనాల ప్రకారం) రూ.17,761 కోట్లు. అవసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4198 కోట్లు (రెండేళ్ల క్రితం అంచనాలు)
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ 189 కి.మీ.ల పొడవున దీన్ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఫర్‌ న్యూ కేపిటల్‌ సిటీ’గా నామకరణం చేశారు.
* ఓఆర్‌ఆర్‌కి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు శాఖ(మోర్త్‌) 2018లో అంగీకారం తెలిపింది. దేశంలో ఏడో దశ రింగు రోడ్ల అభివృద్ధి పథకం కింద దీనికి మంజూరు లభించింది.
* ఓఆర్‌ఆర్‌ కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల క్రాస్‌ చేస్తుంది. మొత్తం 87 గ్రామాల మీదుగా వెళుతుంది. కృష్ణా నదిపై గుంటూరు జిల్లా అమరావతి ఆలయానికి సమీపంలో, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద వంతెనలను నిర్మిస్తారు.
* విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి-65పై కంచికచర్ల వద్ద ప్రారంభమై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16ని కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్‌-65లో కలుస్తుంది. అక్కడి నుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో జాతీయ రహదారి-16ని పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో కలుస్తుంది. మళ్లీ అక్కడ మొదలై కంచికచర్ల వద్ద జాతీయ రహదారి-65ని కలుస్తుంది.
* 150 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి వీలుగా భూసేకరణ/సమీకరణ చేస్తారు. మొదట 4 వరుసలుగా నిర్మించి, భవిష్యత్తులో వాహన రద్దీ పెరిగిన తర్వాత 8 వరుసలకు విస్తరిస్తారు.


రోడ్ల వెంటే ప్రగతి పరుగులు

అభివృద్ధికి రహదారులే ప్రాణాధారం. కొత్తగా రోడ్డు పడిందంటే ఆ ప్రాంతానికి జీవం వచ్చినట్టే..! ఒక ప్రాంత ఆర్థిక, సామాజిక పురోగతిలో రహదారులది కీలక భూమిక. ఒకప్పుడు నాగరికతకు నదీ తీరాలు ఆలంబనగా నిలిస్తే... ఇప్పుడు దేశ అభివృద్ధిలో ఆ పాత్రను రోడ్లు పోషిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి. వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు పెరగడానికి, వైద్య, విద్య, సామాజిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇలాంటి రహదారులు సంధానాలుగా నిలుస్తాయి.
* జాతీయ, రాష్ట్ర రహదారులు, రింగు రోడ్లను నిర్మిస్తే వివిధ ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. ట్రాఫిక్‌ సమస్యలూ తగ్గుతాయి.
* ఆర్థిక, సామాజికాభివృద్ధికి రోడ్లు చోదకశక్తులుగా పనిచేస్తాయి.
* అప్పటి వరకు ప్రగతికి దూరంగా ఉన్న ప్రాంతాల పురోగతికి బాటలు వేస్తాయి.
* రవాణాకి అనుకూలంగా... పోర్టులు, విమానాశ్రయాలకు కలిపేలా ఉండే ప్రధాన రహదారుల పక్కన పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ పరిణామంతో ప్రత్యక్షంగా ఉద్యోగితకు, పరోక్షంగా ఉపాధికి దారులు పడతాయి.
* ఒక రహదారిని రూ.కోటి ఖర్చుతో నిర్మిస్తే... ఆమేరకు 10 రెట్లు ఆర్థికవృద్ధి జరుగుతుందన్నది అంచనా. అంటే అమరావతి ఓఆర్‌ఆర్‌ను రూ.17,761 కోట్లతో నిర్మిస్తే ఇక్కడా అదేస్థాయిలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.


భూమిని సమీకరిస్తే చాలు..

ఓఆర్‌ఆర్‌కి అవసరమైన భూమిని సమీకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. భూమిని అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమంటూ ఎన్‌హెచ్‌ఏఐ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసింది. భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా? రాజధాని కోసం అనుసరించిన భూసమీకరణ విధానంలో తీసుకోవాలా? అని గత ప్రభుత్వం ఆలోచించింది. అంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు రాజధానినే ఇక్కడి నుంచి తరలిస్తే రూ.17 వేల కోట్లకుపైగా నిధులతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుకి చూస్తూ చూస్తూ నీళ్లు వదులుకున్నట్లే అవుతుంది. ఓఆర్‌ఆర్‌ లోపల ఒక మహా నగరాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంపైనా, ఈ ప్రాంతాన్ని గ్రోత్‌ సెంటర్‌గా మార్చాలన్న ప్రణాళికలపైనా కారుమబ్బులు కమ్ముకుంటాయి.


నిర్మిస్తే అభివృద్ధికి ఆలంబన

* ఓఆర్‌ఆర్‌ కార్యరూపం దాలిస్తే అమరావతి కేంద్ర స్థానంగా... రింగురోడ్డు లోపలి ప్రాంతాలతోపాటు వెలుపలా కొన్ని కి.మీ.ల దూరం వరకు ప్రగతి పరుగులు పెడుతుంది.
* విజయవాడ, అమరావతి, తాడేపల్లి పక్కపక్కనే ఉన్నాయి. ప్రస్తుతం తాడేపల్లి-కాజ మధ్య విస్తృతంగా నిర్మాణాలు జరిగాయి. త్వరలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి ఒక మహా నగరంగా రూపొందే అవకాశమూ ఉంది.
* ఓఆర్‌ఆర్‌కి వెలుపల, సమీపంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలు, ముఖ్యమైన మండల కేంద్రాలకు వలయంతో అనుసంధానత పెరిగి.... అవన్నీ ప్రత్యేక ‘డెవలప్‌మెంట్‌ నోడ్స్‌’గా పరుగులు పెడతాయి. గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాలను అర్బన్‌ నోడ్స్‌గా, మైలవరం, ఆగిరిపల్లి, పెదఅవుటుపల్లి, నేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచర్ల, అమరావతి(పాత), కంచికచర్లను గ్రోత్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. మరో 17 శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు శ్రీకారం చుట్టాలన్న ప్రతిపాదనా ఉంది.
* ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు ఇవి దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి పోర్టులకు వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ ద్వారా వెళ్లడం తేలికవుతుంది.
* అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్‌ విమానాశ్రయాలకు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లడం సులువు.
* విశాఖ-హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విజయవాడకు రావలసిన అవసరమూ ఉండదు.

 


ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధికి అవకాశాలు

* విజయవాడ: ఇది అవుటర్‌ రింగు రోడ్డు లోపల ఉండే పెద్ద నగరం. రవాణా, విద్య, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. మరింత ప్రగతికి ఎక్కువ అవకాశాలున్నాయి.
* గుంటూరు: రెండో పెద్ద నగరం. మిర్చి, పొగాకు, పత్తికి ప్రధాన మార్కెటింగ్‌ కేంద్రం. పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది.
* తెనాలి: మూడో పెద్ద పట్టణం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కి కేంద్రం. ఇక్కడి నుంచి ధాన్యం, బియ్యం, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి.
* మంగళగిరి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. పర్యాటకంగానూ ప్రగతి సాధిస్తుంది.
* గుడివాడ: విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, ఏలూరులకు ఇది కూడలి వంటిది. ఆక్వా, ఆహారశుద్ధి పరిశ్రమల వృద్ధికి అవకాశముంది.
* గొల్లపూడి: విజయవాడకు గేట్‌వే వంటిది. రాయనపాడు ఇప్పటికే పారిశ్రామిక కేంద్రంగా ఉంది. అది మరింత అభివృద్ధి చెందుతుంది.
* నూజివీడు: మామిడి ఎగుమతులు, మామిడి ఆధారిత పరిశ్రమలు.
* కొండపల్లి/నందిగామ/జగ్గయ్యపేట: విద్యుత్తు, సిమెంటు, ఫార్మా, ప్లాస్టిక్‌, రసాయన పరిశ్రమలు.
* పొన్నూరు: గుంటూరు-చీరాల రాష్ట్ర రహదారిపై ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే వీలుంది.
* సత్తెనపల్లి: గుంటూరుకి 35 కి.మీ.ల దూరంలోని ఈ ప్రాంతం... ప్రధాన వాణిజ్య హబ్‌గా ఎదుగుతుంది.
* ఉయ్యూరు: సారవంతమైన భూములున్నాయి. కేసీపీ షుగర్స్‌ దేశంలోనే పెద్ద పరిశ్రమ.


ఉద్యాన దిగుబడుల రవాణా సులువు

* కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, మైలవరం తదితర ప్రాంతాల్లో మామిడి, జామ తదితర తోటలు అధికంగా ఉన్నాయి.  మిరప సాగు ఎక్కువ.
* గుంటూరు జిల్లాలో అమరావతి, పెదకూరపాడు, మేడికొండూరు, సత్తెనపల్లి, యడ్లపాడులో మిరప సాగు అధికం.
* తెనాలి ప్రాంతంలో పండ్లతోటలు, కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుంది. పసుపు సాగూ ఎక్కువే. వీటి దిగుబడులను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఓఆర్‌ఆర్‌ మీదుగా సులువుగా రవాణా చేయవచ్చు.


ఇవీ మరిన్ని విశేషాలు

* బాహ్యవలయ రహదారికి పూర్తిగా లోపల ఉన్న, రహదారి వెళుతున్న మండలాలు: 40
* ఆయా ప్రాంతాల్లో జనాభా: 36.13 లక్షలు
* ఈ ప్రాంతాల మొత్తం జీవీఏ (జీఎస్‌డీపీలో వాటా): రూ.70,602 కోట్లు. (2016-17 అంచనాలు)
* ప్రజల తలసరి ఆదాయం: రూ.1,26,775

- ఈనాడు, అమరావతి

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.