close

తాజా వార్తలు

లెక్క సరి..

రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ విజయం
మెరిసిన రాహుల్‌, ధావన్‌, కోహ్లి

కోహ్లీసేన ఆల్‌రౌండ్‌ జోరుతో అదరగొట్టింది. రాజ్‌కోట్‌లో లెక్క సరి చేసింది. వాంఖడే పరాభవం నుంచి బలంగా పుంజుకుంటూ కంగారూలను దెబ్బకు దెబ్బ తీసింది! బ్యాటుతో పరుగుల వరద పారించి.. బంతితో ప్రత్యర్థిని కట్టిపడేసిన భారత్‌... ఫీల్డింగ్‌లోనూ మెరిసింది. సమష్టి ప్రదర్శనతో రెండో వన్డేలో నెగ్గి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ కేఎల్‌ రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడితే.. ధావన్‌ మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. తిరిగి మూడో స్థానంలో వచ్చిన విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. బంతితో కుల్‌దీప్‌ కీలక దశలో మాయ చేశాడు. ఇక అభిమానుల కళ్లన్నీ నిర్ణయాత్మక మూడో వన్డే పైనే.

రాజ్‌కోట్‌

భారత్‌ అదరగొట్టింది. తొలి వన్డేలో పేలవంగా ఆడిన కోహ్లి బృందం తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. అన్ని రంగాల్లో సత్తా చాటి కంగారూలకు ఓటమి రుచి చూపించింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (96; 90 బంతుల్లో 13×4, 1×6), కేఎల్‌ రాహుల్‌ (80; 52 బంతుల్లో 6×4, 3×6), కోహ్లి (78; 76 బంతుల్లో 6×4) చెలరేగడంతో మొదట భారత్‌ 6 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో ఓ దశ వరకు గట్టిగా పోటీలో నిలిచిన ఆస్ట్రేలియా.. చివరికి 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. కీలక దశలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా కుల్‌దీప్‌ (2/65) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. షమి (3/77), జడేజా (2/58), సైని (2/62), బుమ్రా (1/32) రాణించారు. స్టీవ్‌ స్మిత్‌ (98; 102 బంతుల్లో 9×4, 1×6) ఆసీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. చివరిదైన మూడో వన్డే ఆదివారం బెంగళూరులో జరుగుతుంది.

పోరాడిన స్మిత్‌: భారీ ఛేదనలో భారత బౌలర్లను స్మిత్‌ దీటుగా ఎదుర్కొన్నాడు. తొలి వన్డే సెంచరీ వీరుడు వార్నర్‌ (15) ఆరంభంలోనే వెనుదిరగగా.. ఫించ్‌ (33) తోడుగా స్మిత్‌ ఇన్నింగ్స్‌ కుదుటపరిచాడు. వీళ్లిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న స్థితిలో జడేజా బౌలింగ్‌లో రాహుల్‌ చేసిన మెరుపు స్టంపింగ్‌తో ఫించ్‌ వెనుదిరిగాడు. ఈ దశలో సూపర్‌ఫామ్‌లో ఉన్న లబుషేన్‌ (46; 47 బంతుల్లో 4×4).. స్మిత్‌కు జత కలవడంతో ఆస్ట్రేలియా పరుగుల వేటకు ఆటంకం లేకుండాపోయింది. లబుషేన్‌ తోడుగా అద్భుత షాట్లు ఆడిన స్మిత్‌.. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. లబుషేన్‌ కూడా చక్కని షాట్లు కొట్టాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 96 పరుగులు జత చేయడంతో ఆస్ట్రేలియా 31వ ఓవర్లో 178/2తో బలంగా కనిపించింది. అయితే లబుషేన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా ఆసీస్‌ను దెబ్బ కొట్టాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పింది మాత్రం కుల్‌దీపే. అతడే 38వ ఓవర్లో కేరీ (18)తో పాటు స్మిత్‌ను ఔట్‌ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. క్రమంగా మ్యాచ్‌పై భారత్‌ పట్టుబిగించింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడం.. తమ తమ ఓవర్లలో షమి, సైని రెండేసి వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా ఛేదనలో వెనకబడిపోయింది. షమి వేసి 49వ ఓవర్లో రిచర్డ్‌సన్‌ (24 నాటౌట్‌; 4×4, 1×6) మూడు ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు సాధించినా... అప్పటికే ఆసీస్‌ పరాజయం ఖాయమైపోయింది.

రాణించిన ధావన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... తొలి వన్డే నేర్పిన పాఠాలతో పట్టుదలగా ఆడింది. ప్రణాళికతో బ్యాటింగ్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌ విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మొదట రోహిత్‌శర్మ (42; 44 బంతుల్లో 6×4)తో ధావన్‌ తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేసి శుభారంభం అందిస్తే..

ఆ తర్వాత ధావన్‌, కోహ్లి జోడీ రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. రోహిత్‌, ధావన్‌ ఆసీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ధావన్‌ తనదైన శైలిలో ఆఫ్‌ సైడ్‌ కట్‌ షాట్లు, డ్రైవ్‌లతో అలరిస్తే.. ఉన్నంతసేపు రోహిత్‌ కూడా ఆకట్టుకున్నాడు. అయితే జంపా బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో రోహిత్‌ ఔటయ్యాడు. అతను సమీక్ష కోరినా ఫలితం దక్కలేదు. ఈ స్థితిలో తాను ఎప్పుడూ బరిలో దిగే మూడో స్థానంలోనే వచ్చిన కోహ్లి... ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరు స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. 60 బంతుల్లో ఈ సిరీస్‌లో రెండో అర్ధసెంచరీ సాధించిన ధావన్‌.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. ఆగర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన శిఖర్‌.. అతడి మరో ఓవర్లో మరో సిక్స్‌, ఫోర్‌ అందుకున్నాడు. అతని ఊపు చూస్తే సెంచరీ చేసినట్లే కనిపించాడు. అయితే సెంచరీ ముంగిట.. రిచర్డ్‌సన్‌ వేసిన బంతిని పుల్‌ చేయబోయి ఫైన్‌ లెగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. శ్రేయస్‌ (7) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ స్థితిలో కోహ్లి జోరు పెంచాడు. సరిగ్గా 50 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన విరాట్‌.. కమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అదే ఊపులో జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టబోయి బౌండరీకి సమీపంలో దొరికిపోయాడు. మనీష్‌ పాండే (2) కూడా అతణ్ని అనుసరించడంతో భారత్‌ 280/5తో నిలిచింది.

రాహుల్‌ జోరు..: కీలక సమయంలో కోహ్లి ఔటైనా భారత్‌ భారీ స్కోరు చేసిందంటే ప్రధాన కారణం కేఎల్‌ రాహులే. ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపిస్తూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి చెలరేగిన రాహుల్‌ మరో సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తూ చక్కని షాట్లతో అలరించాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్స్‌, బౌండరీతో స్కోరు 300 పరుగులు దాటించిన రాహుల్‌... కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు. 38 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన అతడు.. జడేజా (20 నాటౌట్‌)తో కలిసి ఆరో వికెట్‌కు 58 పరుగులు జత చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో అతడు రనౌటయ్యాడు. రాహుల్‌ జోరుతో చివరి ఐదు ఓవర్లలో భారత్‌ 53 పరుగులు సాధించింది.
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) జంపా 42; ధావన్‌ (సి) స్టార్క్‌ (బి) రిచర్డ్‌సన్‌ 96; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) జంపా 78; శ్రేయస్‌ (బి) జంపా 7; రాహుల్‌ రనౌట్‌ 80; పాండే (సి) ఆగర్‌ (బి) రిచర్డ్‌సన్‌ 2; జడేజా నాటౌట్‌ 20; షమి నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 340.
వికెట్ల పతనం: 1-81, 2-184, 3-198, 4-276, 5-280, 6-338.
బౌలింగ్‌: కమిన్స్‌ 10-1-53-0; స్టార్క్‌ 10-0-78-0; రిచర్డ్‌సన్‌ 10-0-73-2; ఆడమ్‌ జంపా 10-0-50-3; ఆగర్‌ 8-0-63-0; లబుషేన్‌ 2-0-14-0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) పాండే (బి) షమి 15; ఫించ్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 33; స్మిత్‌ (బి) కుల్‌దీప్‌ యాదవ్‌ 98; లబుషేన్‌ (సి) షమి (బి) జడేజా 46; కేరీ (సి) కోహ్లి (బి) కుల్‌దీప్‌ 18; టర్నర్‌ (బి) షమి 13; ఆగర్‌ ఎల్బీ (బి) సైని 25; కమిన్స్‌ (బి) షమి 0; స్టార్క్‌ (సి) రాహుల్‌ (బి) సైని 6; రిచర్డ్‌సన్‌ నాటౌట్‌ 24; జంపా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 6; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 304
వికెట్ల పతనం: 1-20, 2-82, 3-178, 4-220, 5-221, 6-259, 7-259, 8-274, 9-275.
బౌలింగ్‌: బుమ్రా 9.1-2-32-1; షమి 10-0-77-3; సైని 10-0-62-2; జడేజా 10-0-58-2; కుల్‌దీప్‌ 10-0-65-2.


ఆల్‌రౌండ్‌ రాహుల్‌

ఈ మ్యాచ్‌లో భారత్‌ స్కోరు 340 పరుగులు చేసిందంటే కారణం కేఎల్‌ రాహుల్‌ వల్లే. ఏ స్థానంలోనైనా ఆడతా అన్నట్లు చెలరేగిన అతడు అద్భుత షాట్లతో అలరించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌.. స్టార్క్‌, కమిన్స్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌, థర్డ్‌మన్‌ దిశగా కొట్టిన సిక్స్‌లు అద్భుతం. కోహ్లి ఔటైనా.. జడేజా తోడుగా ఇన్నింగ్స్‌ను నడిపించిన విధానం.. ఆఖరి ఓవర్‌ వరకు జోరును కొనసాగించిన తీరు సూపర్‌. బ్యాటింగ్‌ ఒక్కటే కాదు కీపర్‌గానూ మెరిశాడు అతడు. జడేజా బౌలింగ్‌లో ఫించ్‌ కాస్త క్రీజు దాటగానే మెరుపు వేగంతో బెయిల్స్‌ ఎగరేసిన విధానం.. ధోనిని గుర్తుకు తెచ్చింది. గత తొమ్మిది నెలల్లో టాప్‌, మిడిలార్డర్‌లో రాహుల్‌ ఆడని స్థానం అంటూ లేదని.. కీపింగ్‌ కూడా చేస్తూ అతడు రాహుల్‌ ద్రవిడ్‌ను తలపిస్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పోస్టులు పెట్టారు.


పాండే సూపర్‌ క్యాచ్‌

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మనీష్‌ పాండే పట్టిన క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. షమి బౌలింగ్‌లో వార్నర్‌ కొట్టిన కట్‌ షాట్‌ని కవర్స్‌లో ఉన్న పాండే కళ్లు చెదిరే క్యాచ్‌గా మలిచాడు. బంతి అతణ్ని దాటి వెళ్లిపోతున్నట్లే కనిపించినా.. కొద్దిగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో  ఒడిసిపట్టేశాడు. ఈ క్యాచ్‌ను వార్నర్‌ కాసేపు నమ్మలేనట్లు చూశాడు.


100
స్మిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.


‘‘ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ అతని పరిణతి, క్లాస్‌కు ఉదాహరణ. జట్టు శ్రేయస్సు కోసమే మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌ దిగా. వన్డేల్లో స్థిరంగా రాణించే బ్యాట్స్‌మెన్‌లో శిఖర్‌ ధావన్‌ ఒకడు. అతను రోహిత్‌తో కలిసి శుభారంభం అందించడం ఆనందంగా ఉంది. రోహిత్‌ భుజానికి గాయమైంది. అయితే ఎలాంటి చీలిక లేదు. అతను మూడో వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది’’

- విరాట్‌ కోహ్లి
Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.