close

తాజా వార్తలు

అమరావతిపై నాటి మాటలకు విలువే లేదా?

అమరావతి ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువు
పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా జలాన్ని తెచ్చా
దేశ రాజధానినే అమరావతిలో కలిపేశా
ఆంధ్రప్రదేశ్‌ వికాస యాత్రలో భుజం భుజం కలిపి నడుస్తాం
రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో నాడు ప్రధాని మోదీ భరోసా
హాజరైన ప్రముఖులందరి నోటా అమరావతి మాటే

ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతి నగరానికి సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి వస్తూ పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది జలాలను తన వెంట తీసుకొచ్చారు. అవి రెండూ దేశ రాజధానిని అమరావతిలో కలిపేశామనడానికి సంకేతాలని చెప్పారు. కొత్తగా నిర్మించబోయే అమరావతి నగరం ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా ఉంటుందని, ఇదో ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోబోతోందని ఉద్ఘాటించారు. రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2015, అక్టోబరు 22న జరిగిన అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు.

....ఒక్క ప్రధానే కాదు, నాటి కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గవర్నర్లు, తెలంగాణ ముఖ్యమంత్రి, విదేశీ ప్రముఖులు... ఇలాంటి మహామహులెందరో ఆ మహోత్సవానికి అతిథులుగా హాజరై కొత్త రాజధాని నిర్మాణానికి శుభాకాంక్షలు అందజేశారు. అమరావతి నగరం అజరామరమై చరిత్రలో నిలుస్తుందని ఇప్పటి ఉప రాష్ట్రపతి, నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం సాగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. నగర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని జపాన్‌, సింగపూర్‌ మంత్రులూ భరోసా ఇచ్చారు. వీరందరి శుభాకాంక్షలతో మార్మోగిన ఆ శంకుస్థాపన కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం ఉంది. నాడు ప్రధాని, ఇతర ప్రముఖులు ఇచ్చిన హామీలు, చేసిన బాసలకు ఏమాత్రం విలువ లేనట్లుగా ప్రస్తుత వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో... అసలు అమరావతి శంకుస్థాపనకు హాజరైన అగ్ర నేతలు ఏం చెప్పారు? ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి ఎలాంటి భరోసా ఇచ్చారు? అనే అంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకుంటే....


నూతన అధ్యాయంలోకి ఆంధ్రప్రదేశ్‌: మోదీ

శతాబ్దాల సంస్కృతి, చారిత్రక వైభవంతో తులతూగిన అమరావతి ఇప్పుడు ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. ఆనాటి చారిత్రక వైభవాన్ని మేళవించి, సరికొత్త ఆధునికతను సంతరించుకుని ఆంధ్రుల ఆశ, ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయంలోకి ప్రవేశిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచి ఆచరణలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి, జోడించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
కొత్త నగరాల నిర్మాణం సవాల్‌తో కూడుకున్నదే
కొత్త నగరాల నిర్మాణం ఎంతో శ్రమతో కూడుకున్నదని జపాన్‌ అనుభవాలు చెబుతున్నాయి. అలాంటి అనుభవం నాకూ ఉంది. 2001లో గుజరాత్‌లో భయంకరమైన భూకంపం వచ్చి కచ్‌ జిల్లాతోపాటు గుజరాత్‌లోని పలు పట్టణాలకు పట్టణాలే ధ్వంసమయ్యాయి. నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటి పునర్నిర్మాణాన్ని సవాల్‌గా తీసుకున్నా. రాజకీయ సంకల్పం, ప్రజా మద్దతు, స్పష్టమైన ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టగలిగాం. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల జాబితాలో కచ్‌ స్థానం సంపాదించింది.
ప్రాంతాలు వేరైనా తెలుగువారి ఆత్మ ఒకటే
ఆంధ్రప్రదేశ్‌ అయినా.. తెలంగాణ అయినా... ఆత్మ మాత్రం తెలుగు అని గుర్తుంచుకోవాలి. రెండు ఆత్మలు అభివృద్ధిలో పోటీ పడితే దేశం శక్తిమంతంగా తయారవుతుంది. కేంద్రం చేపట్టిన స్టార్టప్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగల సత్తా తెలుగు గడ్డకు మాత్రమే ఉంది.. ఆంధ్ర, తెలంగాణలు వేరు పడినప్పటికీ భుజం భుజం కలిపి పనిచేస్తే బలంగా ఎదిగే అవకాశం ఉంది. అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించినప్పుడు నేను సంతోషంగా అంగీకరించాను. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించారని ప్రసారమాధ్యమాల ద్వారా తెలిసి ఎంతో ఆనందించా.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కలలు నెరవేరుస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంది. ఇక్కడుండే మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ మరింత ముందుకెళ్తుంది. చంద్రబాబు ఆ దిశగా ముందడుగు వేశారు. మీరు నిశ్చింతగా ఉండండి. చంద్రబాబు, నరేంద్రమోదీ జోడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కలల్ని సాకారం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చెబుతున్నా... పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది పవిత్ర జలాన్ని తెచ్చి ముఖ్యమంత్రికి  అందజేశాను. ఇక్కడికి తెచ్చింది కేవలం ఈ రెండే కాదు... అమరావతికి దేశ రాజధానే చేరిందని, రాష్ట్ర రాజధానిలో కలవడానికి వచ్చిందన్నది దీని సందేశం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి యాత్రలో దిల్లీ అడుగడుగునా భుజం భుజం కలిపి నడుస్తుందని, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నది దీని విస్పష్ట సంకేతం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి తక్కువ నగరాలను మాత్రమే కొత్తగా నిర్మించగలిగాం. ఈ రోజు వాటి అవసరం ఉంది. పట్టణీకరణ, నగరాభివృద్ధిని ఓ సమస్యగా కాకుండా... మహత్తర అవకాశంగా మలచుకోవాలి. అందుకే ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో 100 ఆకర్షణీయ నగరాలను తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇవి ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి, సంపద సృష్టికి దోహపడతాయి. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల వీటి ప్రధాన ఉద్దేశం. అత్యాధునిక రవాణా వ్యవస్థ, కార్యాలయాలకు నడిచి వెళ్లగలిగే సౌలభ్యం ఈ నగరాల్లో ఉంటుంది. అలాంటి ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి అమరావతి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నా.


అమరావతి భవిష్యత్తు సురక్షితం: వెంకయ్య నాయుడు

శాతవాహనులు, ఇక్ష్వాకులు, చాణుక్యులు, రెడ్డి రాజుల నుంచి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలించిన ధరణికోట దాకా అమరావతి చరిత్రను కాపాడుకునేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం.. తెలుగుజాతి సమైక్యత, ఔన్నత్యాన్ని చాటుదాం.

ప్రధాని మోదీ మన మీద ప్రేమతో దేశానికే అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది నుంచి జలాన్ని తెచ్చి ఇచ్చారు. ‘నేను సైతం ప్రజా రాజధానికి పుట్ట మన్ను సమర్పిస్తున్నాను’... అని ఆయన అన్న మాటలతో.. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అజరామరమై చరిత్రలో నిలుస్తుంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని నిలబెడతామంటూ మనమంతా సంకల్పబద్ధులం కావాలి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. పరిపాలనా సౌలభ్యం కోసం మనం విడిపోయినా తెలుగు వారంతా కలిసి ఉండాలి. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రావడం సంతోషించాల్సిన, అభినందించాల్సిన అంశం... మంచి సంకేతం ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఇదే మార్గంలో నడవాలి. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తుంటే. భారత్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌ల వైపు చూస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా కుల, మత, ప్రాంత విభేదాలు విస్మరించి ప్రభుత్వానికి అండగా నిలవాలి. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా తూచ తప్పకుండా పోలవరం ప్రాజెక్టుకు అన్నివిధాలా సహకరిస్తాం. తెలుగు ప్రజల శ్రేయోభిలాషిగా నిరంతరం ఏపీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సహకారం అందిస్తా.


ప్రపంచ స్థాయి ప్రజా రాజధాని
- చంద్రబాబు

ఇవాళ మనమంతా ఇక్కడకు రావడానికి కారణం రైతన్నలే.. భూసమీకరణ కింద ముందుకు రావాలని పిలుపు ఇస్తే.. 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. అలాంటి స్ఫూర్తి చూపిన.. వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా

దివ్య ముహూర్తంలో ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి విజయవంతంగా ఎదుగుతుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి. రష్యా నుంచి వచ్చిన తర్వాత ప్రధాని ఫోన్‌ చేసి చెప్పడంతో.. తుర్కమెనిస్థాన్‌, కజకిస్థాన్‌ రాజధానులు పరిశీలించాం. వాటికి దీటుగా, ప్రపంచ ఉత్తమ ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. అమరావతికి మంచి వాస్తు ఉంది. ఈశాన్యంలో నీరు ప్రవహిస్తోంది. మంచి పేరు, ప్రజల మద్దతు ఉంది. అమరావతి శంకుస్థాపన మన అందరికీ పండగ రోజు. తెలంగాణకు హైదరాబాద్‌, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయాన్నిచ్చే నగరం లేదు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేదాకా కేంద్రం చేయూత ఇవ్వాలి. అధైర్యపడొద్దు.. దిల్లీ కంటే మెరుగైన రాజధానిని నిర్మిస్తామని మోదీ తిరుపతిలో హామీ ఇచ్చారు. రాజధాని శంకుస్థాపనను ఎంతో పవిత్ర కార్యక్రమంగా భావించి... 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల నుంచి మన నీరు, మన మట్టిని తీసుకొచ్చాం. దేశంలోని అన్ని నదులు, పుణ్యస్థలాల నుంచి పుట్టమన్ను, పవిత్ర జలాలు తెచ్చి రాజధాని ప్రాంతంలో చల్లి పుణ్యభూమిగా తయారు చేశాం. ఎక్కడిక్కడ నీరు, కాల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే సుందరమైన హరిత, నీలి రాజధానిగా నిర్మించుకునే అవకాశాలున్నాయి. మంచి నగరం నిర్మించాలనే ఆలోచన వివరించి... మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇవ్వమని అడగ్గానే సింగపూర్‌ అంగీకరించింది. మేమూ భాగస్వాములమవుతామని జపాన్‌ ఫ్రభుత్వమూ ముందుకొచ్చింది. వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తున్నాం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలతోపాటు దేశీయ, రాష్ట్రస్థాయి సంస్థలూ ముందుకొచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించాలి.


ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌

రాజధాని అంటే.. కేవలం పరిపాలనా కేంద్రం కాదు. ఆర్థిక కార్యకలాపాలకు అదో గొప్ప వేదిక కావాలి. యువతరానికి ఉపాధి కల్పించే నెలవుగా మారాలి. సేవారంగానికి అత్యంత కీలకమై.. ప్రజాసేవలో చరితార్థమవ్వాలి. వీటన్నింటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మున్ముందు చిరునామాగా ఉంటుంది.

ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయ పూర్వక విజయదశమి శుభాకాంక్షలు. పవిత్రమైన విజయదశమి రోజున భారత ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరగడం ఆనందదాయకం.. ఈ ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలి. అందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది.


ఆసియా, పసిఫిక్‌కు అమరావతి ముఖ ద్వారం
- జపాన్‌ మంత్రి యుసుకె టకారీ

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ముఖద్వారంగా నిలుస్తుంది. అమరావతి నిర్మాణానికి జపాన్‌ తరఫున పూర్తి సహకారం అందిస్తాం. కొత్త రాజధాని అమరావతి ప్రాంతంలో నాడు బౌద్ధం విలసిల్లింది. మా పాఠ్య పుస్తకాల్లోనూ నాగార్జున విశ్వవిద్యాలయం గురించిన ప్రస్తావన ఉంది. ప్రపంచ యుద్ధం సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుని మేం ఉన్నత స్థాయికి ఎదిగాం. కొత్త నగరాల నిర్మాణంలో మా అనుభవాల్ని, సాంకేతికతను అమరావతికి అందిస్తాం. గొప్ప నగరంగా ఎదిగేందుకు సహకరిస్తాం.


ఆంధ్ర ప్రజలు గర్వించే స్థాయికి అమరావతి
- సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌

అమరావతి నగరం చరిత్రలో నిలిచే స్థాయికి ఎదగాలి. చంద్రబాబు సింగపూర్‌ వచ్చి ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతికి అద్దం పట్టేలా అమరావతి రాజధానిని నిర్మించాలనే తన ఆలోచన మాకు వివరించారు. ప్రణాళికల తయారీకి మమ్మల్ని ఆహ్వానించారు. చంద్రబాబు మాకు పాత మిత్రుడే. భారత్‌లో ప్రధాని మోదీ పట్టణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. రైజింగ్‌ ఇండియా పథకంలో లక్షల మంది జీవితాలను మెరుగుపరిచేలా ఆకర్షణీయ నగరాలు, అమృత్‌ పట్టణాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మోదీ ఆహ్వానించారు. అమరావతి అభివృద్ధికి ప్రోత్సాహం ఇస్తున్నారు. సబానా, జురాంగ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు అమరావతి రాజధాని నగరం, ప్రాంతం అభివృద్ధికి దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ఇచ్చాయి. ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలతో మెరుగైన జీవనం అందించే నగరంగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గర్వించే స్థాయికి అమరావతి అభివృద్ధి చెందుతుంది.

- ఈనాడు, అమరావతి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.