close

తాజా వార్తలు

ఆఖరి సమరంలో అదరోహిట్‌

 కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
విజృంభించిన జడేజా, షమి
 మూడో వన్డేలో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఘనవిజయం

వాంఖడేలో 10.. రాజ్‌కోట్‌లో 42! రోహిత్‌ నుంచి ఆశించిన మెరుపులు లేకపోవడంతో అభిమానుల్లో ఏదో వెలితి! భారీ ఇన్నింగ్స్‌ కోసం ఎన్నో డిమాండ్లు. వాళ్ల ఆకాంక్షను హిట్‌మ్యాన్‌ అర్థం చేసుకున్నట్లే ఉన్నాడు. నిర్ణయాత్మక సమరంలో జూలు విదిల్చాడు. అచ్చొచ్చిన చిన్నస్వామిలో అదరగొట్టాడు. పరీక్షించిన మందకొడి పిచ్‌పై సంయమనంతో కూడిన దూకుడుతో శతక్కొట్టేశాడు.

అతడికి తోడు కెప్టెన్‌ కోహ్లి కూడా అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడేశాడు. అదిరే ఫామ్‌ను  కొనసాగిస్తూ ఛేదనకు ఇరుసులా నిలిచాడు. శ్రేయస్‌ కొస మెరుపులూ అలరించాయి.    ఫలితమే ఆఖరి వన్డేలో టీమ్‌ఇండియా ఘనవిజయం. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ తనదేనని నమ్మిన కంగారూలకు ఆశాభంగం. ఆఖరి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. స్టీవ్‌ స్మిత్‌ శతకం వృథా అయింది.

బెంగళూరు

టీమ్‌ ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆదివారం చివరిదైన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. రోహిత్‌ శర్మ (119; 128 బంతుల్లో 8×4, 6×6), విరాట్‌ కోహ్లి (89; 91 బంతుల్లో 8×4), శ్రేయస్‌ అయ్యర్‌ (44 నాటౌట్‌; 35 బంతుల్లో 6×4, 1×6) మెరవడంతో 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మిత్‌ (131; 132 బంతుల్లో 14×4, 1×6), లబుషేన్‌ (54; 64 బంతుల్లో 5×4) రాణించడంతో మొదట ఆస్ట్రేలియా 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. జడేజా (2/44), షమి (4/63) ఆసీస్‌ను కట్టడి చేశారు.

ధావన్‌ రాకపోయినా..: ఛేదనలో రోహిత్‌, కోహ్లీలే భారత్‌ హీరోలు. చక్కని ఇన్నింగ్స్‌తో రోహిత్‌ జట్టును బలమైన స్థితిలో నిలిపితే.. మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కోహ్లి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా.. మందకొడి పిచ్‌ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించింది. గాయంతో ధావన్‌ ఓపెనింగ్‌ చేయలేకపోవడం ఛేదనలో భారత్‌కు ప్రతికూలాంశం. కానీ ఆ లోటేమీ తెలియనివ్వలేదు రోహిత్‌. బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మరోవైపు రాహుల్‌ నిలబడగా.. రోహిత్‌ తనదైన శైలిలో  బ్యాటింగ్‌ చేశాడు. నియంత్రణతో ఆడినప్పటికీ బంతి ఏమాత్రం లయ తప్పినా వదల్లేదు. నాలుగో ఓవర్లో స్టార్క్‌ బౌలింగ్‌లో పాయింట్‌ మీదుగా సిక్స్‌ దంచాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో ఓ చక్కని ఫ్లిక్‌తో అలవోకగా సిక్స్‌ కొట్టేశాడు. 13వ ఓవర్లో ఔటయ్యేటప్పటికి స్కోరు 69. అయితే రోహిత్‌కు కెప్టెన్‌ కోహ్లి తోడు కావడంతో భారత్‌ సాఫీగా లక్ష్యం దిశగా సాగింది.

మెరిసిన రోహిత్‌.. నిలిచిన కోహ్లి: రోహిత్‌ దూకుడు కొనసాగిస్తుంటే.. కోహ్లి చక్కగా స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. కోహ్లి ఎక్కువగా సింగిల్స్‌ తీశాడు. స్కోరు మరీ వేగంగా ఏమీ రాకపోయినా.. ఛేదన ఎప్పుడూ పూర్తిగా భారత్‌ నియంత్రణలోనే ఉంది. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంది. జంపా బంతిని మిడ్‌వికెట్లో స్టాండ్స్‌లోకి పంపిన రోహిత్‌.. ఓ ప్రయత్నం చేద్దామంటూ బౌలింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ ఫించ్‌కూ అదే శిక్ష వేశాడు. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌.. అతడి తర్వాతి ఓవర్లో లాంగాన్‌లో ఓ కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. క్రమంగా దూకుడు పెంచిన కోహ్లి కూడా కమిన్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించాడు. అయితే 38వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో రోహిత్‌ ఔట్‌ కావడం ఆసీస్‌కు ఊరట. ఎందుకంటే అప్పటికి భారత్‌ పూర్తి సురక్షితం కాదు. స్కోరు 206. కానీ కోహ్లి..ప్రత్యర్థికి ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వలేదు. చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ ధాటిగా ఆడుతూ జట్టును వేగంగా లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. 46వ ఓవర్లో కోహ్లి ఔటైనా.. అప్పటికే భారత్‌ విజయం ఖరారైంది.

కంగారూల కట్టడి..: 173/2. 32వ ఓవర్లో ఆస్ట్రేలియా స్కోరిది. స్మిత్‌, లబుషేన్‌ క్రీజులో పాతుకుపోయి ఉన్నారు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కానీ రాజ్‌కోట్‌లోలాగే పుంజుకున్న భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టి కంగారూల భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు. జడేజా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ వికెట్లు తీశాడు. బుమ్రా ఇన్నింగ్స్‌ ఆసాంతం అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. షమి ఎక్కువ పరుగులే ఇచ్చినా కీలక వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీయడంలో తన వంతు పాత్ర పోషించాడు. టాస్‌ గెలిచి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. వార్నర్‌ (3)ను ఔట్‌ చేయడం ద్వారా నాలుగో ఓవర్లోనే ఆ జట్టుకు షమి షాకిచ్చాడు. స్మిత్‌తో సమన్వయ లోపంతో 9వ ఓవర్లో ఫించ్‌ (19) రనౌటయ్యేటప్పటికి స్కోరు 46 పరుగులు. ఆ తర్వాత స్మిత్‌, లబుషేన్‌ చక్కని బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. క్రమం తప్పకుండా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, అప్పుడప్పుడు బౌండరీ సాధిస్తూ మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. కానీ భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తున్న ఆసీస్‌కు జడేజా షాకిచ్చాడు. 32వ ఓవర్లో లబుషేన్‌ను ఔట్‌ చేయడం ద్వారా ప్రమాదకర భాగస్వామ్యాన్ని విడదీసిన అతడు.. అదే ఓవర్లో స్టార్క్‌నూ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేరీ (35)తో స్మిత్‌ 58 పరుగులు జోడించాడు. 42వ ఓవర్లో కేరీని కుల్‌దీప్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత స్మిత్‌ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ శతకం పూర్తి చేసుకున్నా.. మరోవైపు నుంచి అతడికి సరైన సహకారం అందలేదు. చివరి 10 ఓవర్లలో 63 పరుగులే చేసిన ఆసీస్‌.. స్మిత్‌ వికెట్‌ సహా ఐదు వికెట్లు చేజార్చుకుంది. 


కేఎల్‌ రాహుల్‌ జట్టుకు మంచి సమతూకాన్ని తెస్తున్నాడు.  మార్పుల్లేని జట్టుతో బాగా ఆడాం. మార్పులు చేయడానికి నాకు కారణాలు కనిపించట్లేదు. రాహుల్‌ కీపింగ్‌ చేయడం వల్ల మాకు అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించే వీలు కలుగుతోంది. అది జట్టును చాలా బలోపేతం చేస్తోంది. జట్టు సమతూకంలో ఇది ముఖ్యమైన అంశం. 2003 ప్రపంచకప్‌లో రాహుల్‌ భాయ్‌ (ద్రవిడ్‌) కీపింగ్‌ చేయడం మొదలెట్టడంతో జట్టుకు మరింత సమతూకం వచ్చింది. ఎందుకంటే జట్టు అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించగలిగింది. అలాంటప్పుడు ముందొచ్చే  బ్యాట్స్‌మెన్‌ మరింత సానుకూల దృక్పథంతో ఆడగలుగుతారు.

- విరాట్‌ కోహ్లి

 

 

హిట్‌మ్యాన్‌ @ 9000

రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా అ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. రికార్డు కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 194 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వేలకు చేరుకోగా.. అందుకోసం రోహిత్‌ 217 ఇన్నింగ్స్‌ ఆడాడు. డివిలియర్స్‌ 208 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. రోహిత్‌ ఇప్పటివరకు 224 వన్డేల్లో 49.27 సగటుతో 9115 పరుగులు చేశాడు. ఇందులో 29 శతకాలు, 43 అర్ధశతకాలు ఉన్నాయి.


707

ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్ణయాత్మక మ్యాచ్‌ల్లో రోహిత్‌ పరుగులు. వన్డేల్లో అతడిదే రికార్డు. రోహిత్‌ తర్వాత డివిలియర్స్‌ (630) ఉన్నాడు.  బౌలర్లతోపాటు కోహ్లి కూడా ఆసీస్‌ కట్టడిలో తన వంతు పాత్ర పోషించాడు. అతడి కళ్లు చెదిరే క్యాచ్‌తో భారత్‌కు విలువైన వికెట్‌ దక్కింది. 32వ ఓవర్లో జరిగిందిది. అప్పటికి క్రీజులో నిలదొక్కుకున్న లబుషేన్‌.. స్మిత్‌తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించే దిశగా సాగుతున్నాడు. ఆ సమయంలో జడేజా బౌలింగ్‌లో కవర్స్‌లో లబుషేన్‌ షాట్‌ ఆడగా.. గాల్లోకి అమాంతం డైవ్‌ చేస్తూ కోహ్లి బంతిని ఒడిసిపట్టేశాడు. భారత అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఆ క్యాచ్‌ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ గమనాన్నే మార్చేసింది. భారత్‌ను బలంగా పోటీలోకి తెచ్చింది.


ధావన్‌కు మళ్లీ గాయం..

రాజ్‌కోట్‌ వన్డే సందర్భంగా గాయపడ్డ ధావన్‌ ఎలాగో కోలుకుని బెంగళూరులో బరిలోకి దిగడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. కానీ అతడు ఎంతోసేపు మైదానంలో లేడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడి ఐదో ఓవర్లోనే నిష్క్రమించాడు. ఫించ్‌ కొట్టిన షాట్‌ను డైవ్‌ చేస్తూ ఆపే క్రమంలో ధావన్‌ భుజానికి గాయమైంది. ఛేదనలో ధావన్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. ఎక్స్‌రేకి వెళ్లొచ్చాక ధావన్‌ ఎడమచేతికి కట్టుతో కనిపించాడు. దీంతో న్యూజిలాండ్‌ పర్యటనకు అతడు వెళ్లడం అనుమానంగా మారింది.   34 ఏళ్ల ధావన్‌ ఇంతకుముందు వేలి గాయంతో ప్రపంచకప్‌ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. కోలుకున్నాక.. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గాయపడ్డాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి గాయానికి గురయ్యాడు. 


8

ఆస్ట్రేలియాతో వన్డేల్లో రోహిత్‌ సెంచరీలు. కోహ్లీకి 8 సెంచరీలున్నాయి. సచిన్‌ అత్యధికంగా 9 సెంచరీలు చేశాడు. 


9

వన్డేల్లో స్టీవ్‌ స్మిత్‌కు ఇది తొమ్మిదో శతకం. సరిగా మూడేళ్ల విరామం తర్వాత అతడు వన్డే సెంచరీ సాధించాడు.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 3; ఫించ్‌ రనౌట్‌ 19; స్మిత్‌ (సి) అయ్యర్‌ (బి) షమి 131; లబుషేన్‌ (సి) కోహ్లి (బి) జడేజా 54; స్టార్క్‌ (సి) చాహల్‌ (బి) జడేజా 0; కేరీ (సి) అయ్యర్‌ (బి) కుల్‌దీప్‌ 35; టర్నర్‌ (సి) రాహుల్‌ (బి) సైని 4; అగర్‌ నాటౌట్‌ 11; కమిన్స్‌ (బి) షమి 0; జంపా (బి) షమి 1; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 286; వికెట్ల పతనం: 1-18, 2-46, 3-173, 4-173, 5-231, 6-238, 7-273, 8-276, 9-282; బౌలింగ్‌: బుమ్రా 10-0-38-0; షమి 10-0-63-4; సైని 10-0-65-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-62-1; జడేజా 10-1-44-2

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) స్టార్క్‌ (బి) జంపా 119; రాహుల్‌ ఎల్బీ (బి) అగర్‌ 19; కోహ్లి (బి) హేజిల్‌వుడ్‌ 89; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 44; మనీష్‌ పాండే నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 289; వికెట్ల పతనం: 1-69, 2-206, 3-274; బౌలింగ్‌: కమిన్స్‌ 7-0-64-0; స్టార్క్‌ 9-0-66-0; హేజిల్‌వుడ్‌ 9.3-1-55-1; అగర్‌ 10-0-38-1; జంపా 10-0-44-1; లబుషేన్‌ 1-0-11-0; ఫించ్‌ 1-0-9-0


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.