close

తాజా వార్తలు

అమరావతి భవిత తేలేది నేడే!

శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
పాలన వికేంద్రీకరణ వైపే ప్రభుత్వం అడుగులు?
బిల్లును ఎదుర్కొనేందుకు తెదేపా వ్యూహరచన
మండలిలో వ్యతిరేకించాలని నిర్ణయం
ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్రం
ఈనాడు - అమరావతి

రాష్ట్రం మొత్తం శాసనసభ వైపు చూస్తోంది. ప్రభుత్వ వ్యూహం ఏంటి? రాజధాని అమరావతి భవిష్యత్తేంటి? ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటే.. భూములిచ్చిన రైతుల పరిస్థితేంటి? వారి ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటించబోతోంది? ఇవన్నీ ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పాలన వికేంద్రీకరణ నిర్ణయానికే కట్టుబడి ఉంది. దానిపైనే సోమవారం ఉదయం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాజధాని గ్రామాలు.. శాసనసభ ముట్టడికి పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. పోలీసు దిగ్బంధంలో అమరావతి.. ఇలాంటి తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠల నడుమ రాజధాని అమరావతి భవిష్యత్తు శాసనసభ వేదికగా సోమవారం తేలనుంది. ముట్టడికి వస్తారన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెదేపా ముఖ్య నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు, ఐకాస నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ప్రతిపక్ష తెదేపా వ్యూహరచన చేసింది. శాసనసభలో బిల్లును ఆమోదించి, మండలికి పంపిస్తే.. అక్కడ తమకు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నందున గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించింది. అధ్యయనానికి వారం రోజుల సమయం కోరాలనీ తెదేపా నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి రాజధాని ప్రజలు, వివిధ పార్టీలు సన్నద్ధమవుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాజధాని గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించింది.  తమ కళ్లుగప్పి చీమ కూడా రాజధాని గ్రామాల్లోకి ప్రవేశించకుండా అన్ని మార్గాల్లో పోలీసులు భారీసంఖ్యలో పహరా కాస్తున్నారు.
 

వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు
‘మూడు రాజధానుల’ అంశంపై ప్రభుత్వం మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం ఇదివరకే స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండొచ్చని డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్‌ శాసనసభలో పేర్కొన్నారు. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు కన్వీనర్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రెండూ ముఖ్యమంత్రి శాసనసభలో వెల్లడించిన ఆలోచనా విధానానికి అనుగుణంగానే నివేదికలు ఇచ్చాయి. డిసెంబరు 20న జీఎన్‌రావు కమిటీ, జనవరి 3న బీసీజీ నివేదికలు అందజేశాయి. దీనిపై భిన్నవర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో.. ఆ రెండు కమిటీలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం పది మంది మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ 3, 4 దఫాలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. వారి ఆలోచనలు, చర్చలు అన్నీ మూడు రాజధానుల చుట్టూనే జరిగాయని కమిటీ సభ్యుల వ్యాఖ్యల్ని బట్టి స్పష్టమవుతోంది. రాజధానిపై వారి సిఫారసులు కూడా జీఎన్‌రావు కమిటీ, బీసీజీల ప్రతిపాదనల్ని సమర్థిస్తూనే ఉంటాయన్నది స్పష్టమవుతోంది. రాజధాని రైతుల ఆందోళనల విషయంలో ఈ కమిటీ కొంత కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. దానిపై ఈ కమిటీ ముఖ్యమంత్రి ముందు ఉంచిన ప్రతిపాదనలేంటి? దానికి ఆయన స్పందనేంటి? చివరకు ఎలాంటి పరిష్కారం సూచించబోతున్నారన్నది గోప్యంగా ఉంచింది.

  గొడవ చేస్తే సీఎం ప్రకటనతో సరి!
పాలన వికేంద్రీకరణ బిల్లుకు ఉభయసభల ఆమోదం పొందేందుకు అధికారపక్షం వ్యూహం రూపొందించింది. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రిమండలి సమావేశం జరగనుంది. బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. 11 గంటలకు శాసనసభ సమావేశం మొదలవుతుంది. సభ మొదలైన వెంటనే పాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చకు ఆహ్వానిస్తారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం గొడవ చేసినా, సభ జరగకుండా అడ్డుకున్నా.. ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. వెంటనే సభను మర్నాటికి వాయిదా వేస్తారు. మంగళవారం శాసనసభతో పాటు, శాసనమండలి సమావేశం జరుగుతుంది. ఆరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన బిల్లును కొన్ని సవరణలతో శాసనసభలో మళ్లీ ప్రవేశపెడతారు. శాసనమండలిలో పాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెడతారు. ఆ బిల్లును శాసనమండలి మంగళవారం ఆమోదిస్తే.. అదేరోజు మండలితో పాటు, శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు. ఆ బిల్లును మండలి ఆమోదించకుండా, శాసనసభకు తిప్పిపంపితే.. మళ్లీ ఆ బిల్లును మండలికి పంపిస్తారు.

ఆదివారం విస్తృత కసరత్తు..!
రాజధానిపై సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై సంబంధిత శాఖల అధికారులు ఆదివారం సెలవు రోజూ విస్తృతంగా కసరత్తు చేశారు. న్యాయ, సాధారణ పరిపాలన శాఖ అధికారులను ప్రత్యేకంగా సచివాలయానికి పిలిపించారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ వారు ఆ బిల్లుపై కసరత్తు కొనసాగించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.