close

తాజా వార్తలు

ఏపీ పాలనా రాజధాని విశాఖే

3 ముక్కలుగా రాజధాని

  అమరావతిలో శాసన వ్యవస్థ
  న్యాయ రాజధానిగా కర్నూలు
   3, 4 జిల్లాలకో ప్రాంతీయ బోర్డు సీఆర్‌డీఏ చట్టం రద్దు..
   అమరావతి అభివృద్ధికి ప్రాధికార సంస్థ.. బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
  17 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్‌
 
మందడం దారిలో చంద్రబాబు అరెస్టు
ముట్టడితో అట్టుడికిన అమరావతి
ఈనాడు - అమరావతి

 

ఉవ్వెత్తున ఎగసిన నిరసనలు.. ఎక్కడికక్కడ నేతలు, ప్రజలు, రైతులు, విద్యార్థుల అరెస్టులు.. గృహ నిర్బంధాలు.. వీటన్నింటి నడుమ పాలన వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతోపాటే సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుకూ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు మొదలైన శాసనసభ తొలిరోజు సమావేశం.. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాడివేడి వాగ్వాదాల మధ్య రాత్రి 11 గంటల వరకు సాగింది. చంద్రబాబు మినహా ప్రతిపక్ష తెదేపాకు చెందిన 17 మంది సభ్యులను సస్పెండ్‌ చేసి.. బిల్లులను ఆమోదించారు. మూడు రాజధానులు.. జోన్లవారీగా ప్రణాళికాభివృద్ధి బోర్డుల ఏర్పాటుతో.. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ ప్రధాన లక్ష్యంగా బిల్లును రూపొందించారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు కర్నూలులో ఉండేలా అక్కడ న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని, పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌లు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి ప్రాధికారసంస్థ (ఏఎంఆర్‌డీఏ)ను ఏర్పాటు చేశారు. సభ నుంచి మందడం వెళ్తుండగా చంద్రబాబును అరెస్టు చేశారు.  బిల్లులు రెండూ నేడు అధికారపక్షానికి అంతగా బలం లేని శాసనమండలి ముందుకు రానున్నాయి. మరి మండలిలో ఏం జరగనుంది? అధికారపక్షం వ్యూహం ఏంటన్నది ఉత్కంఠభరితంగా మారింది.


మా కుటుంబానికి కృష్ణా జిల్లాతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. రాజధాని ఎక్కడికీ పోవడం లేదు. ఈ ప్రాంతానికి అన్యాయమూ చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం. అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే చట్టాలు చేస్తాం. దీనితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నాం.

-బిల్లుపై చర్చకు సమాధానంలో సీఎం జగన్‌


ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధాని మారిస్తే ఎలా? నన్ను ఎగతాళి చేసినా, విమర్శించినా పర్వాలేదు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. చిన్నవాడైనా ముఖ్యమంత్రి జగన్‌కు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. రాజధానిపై పునరాలోచించండి. తొందరపడొద్దు. రాజకీయంగా వెళ్తే మీకు, రాష్ట్రానికీ నష్టం. భూములిచ్చిన రైతుల గురించి ఆలోచించండి. 

 -శాసనసభలో బిల్లుపై చర్చలో చంద్రబాబు

ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా.. 3 రాజధానులను, జోన్లవారీగా ప్రణాళికాభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. పాలనా రాజధానిగా విశాఖను ఖరారుచేయగా, శాసనవ్యవస్థ అమరావతిలో, న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయనుంది. ఉన్నత స్థాయి కమిటీ (హైపవర్‌ కమిటీ) సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.  దీనికి సంబంధించిన బిల్లును సోమవారం శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ మూజువాణి ఓటుతో దాన్ని రాత్రి 11 గంటల సమయంలో ఆమోదించింది. ‘‘రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల్ని సాంస్కృతికంగా, మానసికంగా సంఘటితపరచడంలో, అభివృద్ధి ఫలాలను పంచడంలో విఫలమైంది. శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా రాజధాని నగరాన్ని నిర్ణయించడం వివాదాలకు దారి తీసింది. ఇతర ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకుండా పరిపాలనా విభాగాలను, అభివృద్ధిని రాజధాని ప్రాంతానికే పరిమితం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన నమూనానే అనుసరించారు’’ అని బిల్లు ఉద్దేశాలు, కారణాల్లో పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు నిపుణుల కమిటీని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై మార్గసూచీ రూపొందించేందుకు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ను (బీసీజీ) ఏర్పాటు చేశాం. శివరామకృష్ణన్‌ కమిటీ సహా ఈ కమిటీలిచ్చిన నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి (హైపవర్‌) కమిటీని నియమించాం’’ అని తెలిపారు.

 

ఉన్నతస్థాయి కమిటీ ఏం చెప్పిందంటే..

* ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల్లో వేర్వేరు సామాజిక,  ఆర్థిక,  సాంస్కృతిక  పరిస్థితులున్నాయి.
* ప్రాంతీయ అసమానతలు రాష్ట్రంలో అశాంతికి దారితీశాయి. ప్రజల్లో సమానాభివృద్ధిని కోల్పోయామనే భావన కల్పించాయి.
* సామాజిక, ఆర్థిక, ప్రగతి ఫలాలను వివిధ ప్రాంతాల్లోని ప్రజలు సమానంగా అనుభవించేలా చూడాలి. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణపై శ్రద్ధ వహించాలి. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించాలి.
* ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నందువల్ల 217 చ.కి.మీ. పరిధిలోని ఒక చిన్న ప్రాంతంలోనే వనరులన్నింటినీ ఉపయోగించడం వాంఛనీయం కాదు.


అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే..

ఉన్నతస్థాయి కమిటీ నివేదిక, సిఫార్సులను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడంతోపాటు చట్టపూర్వక తోడ్పాటుకు సంకల్పించినట్లు ప్రభుత్వం బిల్లులో వివరించింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి, వివిధశాఖలు, సంస్థల వికేంద్రీకరణకు చట్టం చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.


బిల్లులోని ముఖ్యాంశాలు..

* రాష్ట్రం మొత్తాన్ని జోన్లుగా విభజించి సరిహద్దుల నిర్ణయం.
* జోన్ల పరిధిలో అభివృద్ధికి ప్రాంతీయ ప్రణాళికా బోర్డుల ఏర్పాటు.
* ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ బాధ్యత బోర్డులదే.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సిఫారసు చేసే అధికారం.


3, 4 జిల్లాలకో జోన్‌: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో బిల్లు తెస్తున్నాం. ప్రాంతాలవారీగా ప్రత్యేక జోన్ల ఏర్పాటు ద్వారా పాలనాధికారాలు, స్థానాలను వికేంద్రీకరిస్తున్నాం. 3, 4 జిల్లాలకు ఒక జోన్‌ను ఏర్పాటు చేస్తాం. న్యాయస్థానం ద్వారా తగిన అనుమతులు, ఉత్తర్వులు పొందిన తర్వాత కర్నూలులో ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టును ఏర్పాటు చేస్తాం. ఇది న్యాయ రాజధాని. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తితో కూడిన హైకోర్టు  ఉంటుంది. ఇతర  ప్రాంతాల్లో బెంచ్‌లు ఏర్పాటవుతాయి. అమరావతి ఇది శాసనపరమైన రాజధాని. శాసనసభ, శాసనమండలి భవనాలు ఇక్కడ  ఉంటాయి. విశాఖపట్నం ఇదే పరిపాలనా రాజధాని.రాజ్‌భవన్‌, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.