close

తాజా వార్తలు

3 రాజధానులకు ఎదురుదెబ్బ

శాసనమండలిలో ఆమోదం పొందని బిల్లులు
అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సెలక్టు కమిటీకి
తీవ్ర ఉత్కంఠ నడుమ ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం
విస్తుపోయిన మంత్రులు, అధికారపక్షం
ఛైర్మన్‌ పోడియంను చుట్టుముట్టిన మంత్రులు, వైకాపా సభ్యులు
రక్షణగా వచ్చిన తెదేపా సభ్యులు
సభలో తోపులాట
రాజధాని గ్రామాల్లో ఆనందోత్సాహాలు
ఈనాడు - అమరావతి

మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి విపక్షాలు ఎంతగా ప్రతిఘటించినా.. ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా.. ఎంత తీవ్రస్థాయిలో నిరసనలు ప్రతిధ్వనిస్తున్నా మొండిగా ముందుకెళుతున్న అధికార పక్షానికి బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో మాదిరిగానే.. శాసనమండలిలోనూ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని విశ్వప్రయత్నం చేసిన వైకాపాకు పెద్దల సభ పెద్ద షాకే ఇచ్చింది.
రోజంతా అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాల అనంతరం ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ప్రకటించారు. ఈ హఠాత్పరిణామానికి వైకాపా ఎమ్మెల్సీలు, వారికి దన్నుగా మండలిలోనే మోహరించిన మంత్రులు నిర్ఘాంతపోయారు. ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా మండలిలో పట్టు నిలబెట్టుకున్నామన్న ఆనందంతో తెదేపా ఎమ్మెల్సీలు సంబరాల్లో మునిగిపోయారు. అంతలోనే తమకు అనుకూలంగా నిర్ణయం రాలేదన్న ఆగ్రహంతో మంత్రులు, వైకాపా ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌పైకి దూసుకెళ్లడం, విపక్ష తెదేపా సభ్యులు ప్రతిఘటించడంతో శాసనమండలి రణరంగాన్ని తలపించింది. మరోవైపు రాజధానిని తరలించొద్దంటూ 36 రోజులుగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అమరావతి ప్రాంత రైతుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.
మొత్తానికి.. అనూహ్యంగా రెండు బిల్లులకూ చుక్కెదురయిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఎలా ముందుకెళ్లబోతుంది.. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోందన్నది ఉత్కంఠగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ‘మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు పెద్దల సభలో చుక్కెదురయింది.  తన విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులనూ సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించడంతో అధికార వైకాపా సభ్యులు, మంత్రులు నిర్ఘాంతపోయారు. మరోవైపు తెదేపా సభ్యులు హర్షాతిరేకాలతో సభను హోరెత్తించారు. ఈ రెండు బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ కోరింది. నిబంధనలు అందుకు అనుమతించబోవని, సవరణలు ప్రతిపాదిస్తూ ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని చేపట్టనప్పుడు సెలక్టు కమిటీకి పంపే అవకాశం లేదని అధికారపక్ష సభ్యుల వాదించారు. కీలకమైన ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉన్నందున సెలక్టు కమిటీకి పంపాల్సిందేనని ప్రతిపక్ష తెదేపా పట్టుబట్టింది. అధికార పక్షమూ వెనక్కి తగ్గకపోవడంతో మండలిలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో శాసనమండలి ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ సభను సాయంత్రం 5.43 నిముషాలకు వాయిదా వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అన్నిపక్షాల నాయకులను తన ఛాంబర్‌కు పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత రాత్రి 8.34 నిముషాలకు సభ తిరిగి ప్రారంభమైంది. తీవ్ర ఉత్కంఠ వాతావరణంలో మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధన 154 ప్రకారం తన విచక్షణాధికారం మేరకు ఈ రెండు బిల్లులను సెలక్టు కమిటీకి  పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఛైర్మన్‌పైకి దూసుకెళ్లిన మంత్రులు
ఛైర్మన్‌ నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందనే ఆలోచనతో అధికార వైకాపా సభ్యులు చప్పట్లు చరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. బిల్లులను సెలక్టు కమిటీకి పంపుతున్నట్లు షరీఫ్‌ ప్రకటించడంతో మంత్రులు కంగుతిన్నారు. వారంతా ఒక్క ఉదుటున లేచి ఛైర్మన్‌ పోడియం వైపు దూసుకెళ్లారు. వైకాపా సభ్యుడు జంగా కృష్ణమూర్తి పోడియంపైకి ఎక్కి ఛైర్మన్‌ ముందున్న కాగితాలను లాక్కుని చింపి పడేశారు. మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌లు ఛైర్మన్‌ పోడియం ముందున్న బల్లలు ఎక్కి ఛైర్మన్‌ షరీఫ్‌తో వాగ్వాదానికి దిగారు. మంత్రి బొత్స సత్యనారాయణ, కన్నబాబు కింది నుంచి చేతులు చూపుతూ ఛైర్మన్‌తో వాదించేందుకు ప్రయత్నించారు. ఆర్థిక మంత్రి బుగ్గన, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కూడా పోడియం ముందుకొచ్చి గట్టిగా మాట్లాడారు. దుర్భాషలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఛైర్మన్‌పై విరుచుకుపడటంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్యాలరీల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఛైర్మన్‌ను దూషిస్తూ కనిపించారు. అయినా షరీఫ్‌ తన స్థానంలో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఒకవైపు వైకాపా మంత్రులు, ఎమ్మెల్సీలు ఛైర్మన్‌ను చుట్టుమ్టుటగా రెండోవైపు తెదేపా సభ్యులు ఆయనకు రక్షణగా వచ్చి నిలబడ్డారు. తెదేపా సభ్యులు బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్‌, దీపక్‌రెడ్డి తదితరులు సభను వాయిదా వేసి వెళ్లిపోవాలంటూ ఛైర్మన్‌ను అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మిగిలిన తెదేపా సభ్యులు రాకుండా మంత్రి వెలంపల్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులకు, మంత్రికి మధ్య తోపులాట జరిగింది. వెలంపల్లి శ్రీనివాస్‌, తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మధ్య మాటామాటా పెరిగింది. ఈలోపు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, పేర్ని నాని తదితరులు రెండోవైపు నుంచి ఛైర్మన్‌ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు తదితర తెదేపా సభ్యులు మంత్రులను అడ్డుకున్నారు. దీంతో తోపులాట, పెనుగులాట చోటు చేసుకున్నాయి.

లోకేశ్‌తో మంత్రుల ఘర్షణ
ఇదంతా జరుగుతుండగా తెదేపా సభ్యుడు నారా లోకేశ్‌ సభలో వీడియో తీస్తున్నారని గ్యాలరీలో ఉన్న ఎమ్మెల్యేలు కేకలు వేస్తూ దూషించడం ప్రారంభించారు. దీంతో మంత్రి పేర్ని నాని దూసుకొచ్చి లోకేశ్‌ నుంచి మొబైల్‌ లాక్కునే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం, పెనుగులాట చోటు చేసుకుంది. మంత్రులు అనిల్‌, కన్నబాబు కూడా అక్కడికి వచ్చి లోకేశ్‌ చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించారు. తెదేపా సభ్యులు అక్కడికి వచ్చి ప్రతిఘటించారు. ఈ సమయంలో ఒక మంత్రి లోకేశ్‌ను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మరోవైపు ఛైర్మన్‌ వద్ద అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు, తోపులాటలు ఎక్కువయ్యాయి. దీంతో ఛైర్మన్‌ షరీఫ్‌ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెదేపా సభ్యుల సహకారంతో తన ఛాంబరులోకి వెళ్లిపోయారు. ఉద్రిక్తత కొనసాగుతుండగానే మంత్రి కొడాలి నాని షరీఫ్‌ ముందున్న పత్రాలు లాక్కున్నారు. మండలి సిబ్బంది చేతుల్లోని పత్రాలనూ గుంజుకున్నారు.

వాయిదా పడినా అక్కడే..
బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలన్న ఛైర్మన్‌ ప్రకటనతో అధికారపక్ష సభ్యులు, మంత్రులు హతాశులయ్యారు. మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌లు సభ వాయిదా పడ్డ తర్వాత కూడా అక్కడే నిలబడి చర్చించుకుంటూ ఉండిపోయారు. వారిలో నిరాశ స్పష్టంగా కనిపించింది. మహిళా మంత్రులు సుచరిత, తానేటి వనిత, పుష్ప శ్రీవాణిలు సైతం చర్చించుకుంటూ అక్కడే ఉండిపోయారు. మంత్రి బొత్స  భాజపా ఎమ్మెల్సీలు మాధవ్‌, సోము వీర్రాజు తదితరుల వద్దకు వచ్చి చాలాసేపు ఆవేదన వినిపించారు.

మండలి ఛైర్మన్‌ ప్రకటన ఇదీ
‘మన ముందుకు చర్చకు వచ్చిన రెండు బిల్లుల గురించి మాట్లాడేందుకు మీ ముందుకొచ్చాను. ఈ బిల్లులపై చర్చ కోసమే మండలిని సమావేశపరిచాం. సభా వ్యవహారాల కమిటీ అజెండా ప్రకారం అనుకోకుండా నిబంధన 71 కింద తీర్మాన ప్రతిపాదన వచ్చింది. తర్జనభర్జనల అనంతరం.. ప్రభుత్వం, సభ్యుల సహకారంతో గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నాం. నిబంధన 71 కింద చర్చతో పాటు ప్రభుత్వ బిల్లులను పరిగణనలోకి తీసుకున్నాం. అందువల్ల బిల్లుకు సవరణల విషయం, సెలక్టు కమిటీకి పంపే విషయమూ ప్రస్తావనకు రాలేదు. ఆ తర్వాత ప్రతిపక్ష సభ్యులు ఈ రెండు అంశాలపై నాకు లేఖ పంపారు. అవి పంపడం ఆలస్యమైంది. ప్రతిపాదన ఇచ్చామనే ఆలోచనతో వారు ఉన్నా ఆ విషయం రికార్డులకు ఎక్కలేదు. బిల్లుపై చర్చ అనంతరం ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు ఈ బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని అడిగారు. సకాలంలో అది రాలేదని, ఆ సవరణ తీర్మానాన్ని చేపట్టలేదని, సాంకేతికంగా నిబంధనల ప్రకారం అది జరగలేదని అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై రెండున్నర గంటలపాటు వివిధ పక్షాల నేతలతో చర్చించాను. ప్రతిపక్ష తెదేపా తాము సవరణ తీర్మానాలు ఇచ్చామని, తమ వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అధికారపక్షం చెప్పింది. బిల్లు చేపట్టిన 12 గంటల్లోపు సవరణ ఇవ్వడం, అది పరిగణనలోకి తీసుకోవడం జరగలేదు. నిబంధనల ప్రకారం రాని ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోకూడదని భాజపా, పీడీఎఫ్‌ నాయకులు అభిప్రాయపడ్డారు.  ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలి? దేనికి మొగ్గు చూపాలి? ఎలాంటి రూలింగు ఇవ్వాలని ఆలోచించాం. ఇప్పటికే కాలాతీతమైంది. ఆలోచనలతో కాలయాపన సరికాదనేది నా ఉద్దేశం. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల బిల్లులను సెలక్టు కమిటీకి పంపించే పరిస్థితి లేదు. అందువల్ల నేను ఛైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుంటున్నాను. నిబంధన 154 ప్రకారం ఈ 2 బిల్లులను సెలక్టు కమిటీకి పంపిస్తున్నా’ అని ఛైర్మన్‌ ప్రకటించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.