close

తాజా వార్తలు

పాముల నుంచే కరోనా కాటు

కొత్త తరహా వైరస్‌కు కారణం సర్పాలే
చైనా అధ్యయనంలో వెల్లడి
5 నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేత

బీజింగ్‌: చైనాను వణికిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌ ప్రధానంగా పాముల నుంచి మనుషుల్లోకి ప్రవేశించిందని ఒక అధ్యయనంలో వెల్లడయింది. ప్రాణాంతకంగా మారిన వైరస్‌ ఇప్పటి వరకు 17 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. బీజింగ్‌ సమీపంలోని ఉత్తర హెబెయ్‌ ప్రావిన్స్‌లో గురువారం మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 18కి చేరింది. మొదటగా పాముల్లో ఈ వైరస్‌ ఉండేదని, రకరకాల ప్రాణుల్ని అక్రమంగా విక్రయించే టోకు మార్కెట్‌కు వచ్చినవారి ద్వారా ఇది మనుషుల శరీరంలోకి వ్యాపించి ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ‘జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ వైరాలజీ’లో దీని వివరాలు ప్రచురితమయ్యాయి. గత నెలలో వుహాన్‌ నగరంలో మొదలైన వైరస్‌ ప్రభావం క్రమంగా హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియాలకు సోకింది. గతంలో వెలుగు చూసిన కరోనా వైరస్‌లకు, తాజా రకానికి మధ్య ఎలాంటి తేడాలున్నాయనేది అధ్యయనకర్తలు పరిశీలించారు. గబ్బిలాలు, లేదా పాము వల్లనే కొత్త రకం వైరస్‌ వచ్చిందని భావిస్తున్నారు. చైనాలో 4000 మందికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనికి 2019-ఎన్‌సీవోవీ అని పేరు పెట్టారు. తుమ్ములు, దగ్గు ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వ్యాప్తి చెందకుండా నగరాలపై ఆంక్షలు
కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో హుబెయ్‌ ప్రావిన్సులోని వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌, ఖియాన్‌జింగ్‌ నగరాలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌ నగరాల్లోనే దాదాపు 1.70 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి బయల్దేరే విమానాలు, రైళ్లు, బస్సులను నిరవధికంగా నిలిపేశారు. మార్కెట్లు, సినిమా హాళ్లు, ఇంటర్నెట్‌ కేంద్రాలు సహా అన్నీ మూతపడ్డాయి. ప్రత్యేక కారణం లేకుండా నగరం దాటి వెళ్లవద్దని, ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని చెప్పారు. చైనా నూతన సంవత్సరం రోజు భారీగా ప్రార్థనలు జరగడం రివాజుగా వస్తోంది. ఈసారి అలాంటివన్నీ రద్దయ్యాయి. శుక్రవారం నుంచి వేడుకలు ఆరంభం కావాల్సి ఉంది. వైరస్‌ తమ దేశాల్లోకి రాకుండా చూసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

భారతీయుల కోసం హాట్‌లైన్‌ సేవలు
వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రవాస భారతీయులకు సహాయపడేందుకు భారత దౌత్య కార్యాలయ వర్గాలు రెండు హాట్‌లైన్లను ఏర్పాటు చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తాము పంచుకునే సమాచారాన్ని చూడాల్సిందిగా కోరాయి. రాకపోకల్ని నిషేధించిన నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఆహార సరఫరా సహా అన్ని రకాలుగా సాయం అందిస్తామని చైనా అధికార వర్గాలు భరోసా ఇచ్చాయి.

దేశంలో 12,828 మందికి స్క్రీనింగ్‌
ఈనాడు, దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులను దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో పరీక్షించారు. దాని ఆనవాళ్లు వీరెవరిలోనూ కనిపించలేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. చైనా, హాంకాంగ్‌నుంచి వచ్చే ప్రయాణికులకు దిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చిలలో థర్మల్‌ స్క్రీనింగ్‌ జరిపారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాల్సిందిగా తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు ఈ శాఖ లేఖలు రాసింది. కేరళకు చెందిన ఒక నర్సుకు సౌదీ అరేబియాలో కరోనా సోకినట్లు తెలియడంతో ఆమెకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ కోరారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.