close

తాజా వార్తలు

కుర్రాళ్లు కేక..!

రెచ్చిపోయిన రాహుల్‌, శ్రేయస్‌
204 పరుగుల లక్ష్యం ఉఫ్‌
మరో ఓవర్‌ మిగిలుండగానే ఛేదన
న్యూజిలాండ్‌ పర్యటనలో అదిరే ఆరంభం
ఆక్లాండ్‌

హిట్‌మ్యాన్‌ మెరుపులు మెరిపించకపోయినా.. రాహుల్‌ దుమ్మురేపాడు! కోహ్లి కూడా అదరగొట్టాడు! పది ఓవర్లయినా కాకముందే స్కోరు 115కు చేరుకుంది. ఇంకేముంది ఛేదన లాంఛనమే  అనుకున్న తరుణంలో జోరుమీదున్న ఆ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైపోయారు. అప్పటిదాకా తేలికే అనుకున్న ఛేదన కాసేపటికే కష్టంగా మారిపోయింది. 8 ఓవర్లలో 75 పరుగులు చేయడమంటే సవాలే!

కానీ ప్రతి అవకాశాన్నీ ఒడిసి పట్టుకుంటూ జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌కు.. ఇది సవాల్‌గా అనిపించలేదు. తనేంటో చాటిచెప్పడానికి మరో అవకాశంలా కనిపించింది. తనలోని విధ్వంసక కోణాన్ని చూపిస్తూ ఈ కుర్రాడు కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంకో ఓవరుండగానే లక్ష్యం కరిగిపోయింది. 200+ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి న్యూజిలాండ్‌ పర్యటనను ఘనంగా ఆరంభించింది భారత్‌.

స్వదేశీ సిరీస్‌ల ఊపును విదేశంలోనూ కొనసాగించింది కోహ్లీసేన. సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో మొదలైన అయిదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (56; 27 బంతుల్లో 4×4, 3×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 29 బంతుల్లో 5×4, 3×6), విరాట్‌ కోహ్లి (45; 32 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు మెరిపించడంతో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే  4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మొదట కొలిన్‌ మన్రో (59; 42 బంతుల్లో 6×4, 2×6), కేన్‌ విలియమ్సన్‌ (51; 26 బంతుల్లో 4×4, 4×6), రాస్‌ టేలర్‌ (54 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4, 3×6) చెలరేగడంతో కివీస్‌ 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. రెండో టీ20 ఆదివారం ఈడెన్‌ పార్క్‌లోనే జరుగుతుంది.

మిస్‌ ‘హిట్‌’.. అయినా వరదే: భారీ లక్ష్యం ముందుండగా రోహిత్‌ నుంచి పెద్ద ఇన్నింగ్స్‌ ఆశించారు అభిమానులు. కానీ రెండో ఓవర్లో తనదైన శైలిలో అలవోకగా సిక్సర్‌ బాదిన హిట్‌ మ్యాన్‌.. మరో భారీ షాట్‌ కోసం ప్రయత్నించగా.. షాట్‌ గురి తప్పి ఔటైపోయాడు. తొలి ఓవర్లో నాలుగే పరుగులు, రెండో ఓవర్లో రోహిత్‌ ఔట్‌.. భారత్‌ కోరుకోని ఆరంభమిది. అయితే ఈ ప్రభావాన్ని జట్టుపై ఏమాత్రం పడనవ్విలేదు రాహుల్‌, కోహ్లి. భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్‌.. జట్టులో తన విలువను మరింత పెంచేస్తూ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లి కూడా సమయోచితంగా షాట్లు కొట్టడంతో స్కోరు బోర్డుకు పట్ట పగ్గాల్లేకపోయింది. 6 ఓవర్లకే స్కోరు 65కు చేరుకుంది. మధ్యలో ఓ తేలికైన రనౌట్‌ను కివీస్‌ వృథా చేయడంతో బతికిపోయిన రాహుల్‌.. తొమ్మిదో ఓవర్లో ఓ మెరుపు సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేశాడు. జట్టు స్కోరునూ వంద దాటించేశాడు. పదో ఓవర్లో సౌథీ పట్టిన చక్కటి క్యాచ్‌కు అతను ఔటయ్యే సమయానికి స్కోరు 115. ఇంకో ఓవర్‌ తర్వాత కోహ్లి కూడా ఔటైపోయాడు. గప్తిల్‌ అద్భుతమైన డైవ్‌ క్యాచ్‌తో అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో భారత్‌ 121/3తో కష్టాల్లో పడింది. న్యూజిలాండ్‌ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. భారత్‌ను ఆ జట్టు ఒత్తిడిలోకి నెట్టినట్లే కనిపించింది. కానీ శ్రేయస్‌ ముప్పును ఆ జట్టు ఊహించలేకపోయింది! విరామం లేని విధ్వంసంతో అతను లక్ష్యాన్ని కరిగించేశాడు. శివమ్‌ దూబె (13), మనీష్‌ పాండే (14 నాటౌట్‌) కూడా కొన్ని షాట్లు ఆడారు. 19వ ఓవర్‌ చివరి బంతికి భారీ సిక్సర్‌ బాదిన శ్రేయస్‌ మ్యాచ్‌ను ముగించాడు.

ఆఖర్లో అడ్డుకట్ట: అంతకుముందు న్యూజిలాండ్‌కు దక్కిన ఆరంభం చూస్తే స్కోరు 220 చేరుతుందనిపించింది. ఆ జట్టు ఓపెనర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. మన్రో ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడ్డా.. తర్వాత చెలరేగిపోయాడు. గప్తిల్‌ కూడా దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరు 68/0. ఎనిమిదో ఓవర్లో గప్తిల్‌ (30; 19 బంతుల్లో 4×4, 1×6) ఔటయ్యే సమయానికి స్కోరు 80. మూడో స్థానంలో వచ్చిన విలియమ్సన్‌.. తన శైలికి భిన్నంగా చెలరేగడం, మన్రో జోరు కొనసాగించడంతో స్కోరు మరింత వేగం పుంజుకుంది. ఒక దశలో కివీస్‌ 115/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే మన్రో, గ్రాండ్‌హోమ్‌ (0) స్వల్ప వ్యవధిలో ఔటవడంతో భారత్‌ కాస్త పుంజుకున్నట్లే కనిపించింది. కానీ కేన్‌ జోరు తగ్గకపోవడం, అతడికి టేలర్‌ తోడవడంతో భారత బౌలర్లకు దిక్కు తోచని పరిస్థితి తలెత్తింది. అయితే ఊపుమీదున్న విలియమ్సన్‌ను చాహల్‌ ఔట్‌ చేయగా.. చివరి 3 ఓవర్లలో బుమ్రా, షమి కలిపి 25 పరుగులే ఇవ్వడంతో కివీస్‌ అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది.


‘‘వికెట్‌ కీపింగ్‌ను ఆస్వాదిస్తున్నా. కీపర్‌గా ఉండటం వల్ల పిచ్‌పై ఓ అంచనాకు రావొచ్చు. ఏ షాట్లు ఆడితే ఫలితముంటుందో తెలుస్తుంది’’

 

- కేఎల్‌ రాహుల్‌

 


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) రోహిత్‌ (బి) దూబె 30; మన్రో (సి) చాహల్‌ (బి) శార్దూల్‌ 59; విలియమ్సన్‌ (సి) కోహ్లి (బి) చాహల్‌ 51; గ్రాండ్‌హోమ్‌ (సి) దూబె (బి) జడేజా 0; టేలర్‌ నాటౌట్‌ 54; సీఫర్ట్‌ (సి) అయ్యర్‌ (బి) బుమ్రా 1; శాంట్నర్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203
వికెట్ల పతనం: 1-80, 2-116, 3-117, 4-178, 5-181; బౌలింగ్‌: బుమ్రా 4-0-31-1; శార్దూల్‌ 3-0-44-1; షమి 4-0-53-0; చాహల్‌ 4-0-32-1; దూబె 3-0-24-1; జడేజా 2-0-18-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) శాంట్నర్‌ 7; రాహుల్‌ (సి) సౌథీ (బి) సోధి 56; కోహ్లి (సి) గప్తిల్‌ (బి) టిక్నర్‌ 45; శ్రేయస్‌ నాటౌట్‌ 58; దూబె (సి) సౌథీ (బి) సోధి 13; పాండే నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (19 ఓవర్లలో 4 వికెట్లకు) 204
వికెట్ల పతనం: 1-16, 2-115, 3-121, 4-142; బౌలింగ్‌: సౌథీ 4-0-48-0; శాంట్నర్‌ 4-0-50-1; బెనెట్‌ 4-0-36-0; టిక్నర్‌ 3-0-34-1; ఇష్‌ సోధి 4-0-36-2


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.