close

తాజా వార్తలు

రాజధానుల మధ్య అంత దూరమా!

ఎండగట్టిన జాతీయ మీడియా
బిజినెస్‌ స్టాండర్డ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సుదూర ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలన్న సిద్ధాంతాన్ని జాతీయ మీడియా ఎండగడుతోంది. రెండు ప్రముఖ దినపత్రికలు బిజినెస్‌ స్టాండర్డ్‌, ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ అంశంపై ఇటీవల రెండు సంపాదకీయాలు రాశాయి. రియల్‌ ఎస్టేట్‌ క్రీడకు అతీతంగా జగన్‌ వాదన ఎలా ముందుకు సాగుతుందో చూడటం కష్టమని బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొంది. జగన్‌ తన శక్తి సామర్థ్యాలను రైతుల్లో ఉన్న నిస్పృహ పోగొట్టేందుకు ఉపయోగించాలని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సూచించింది. -ఈనాడు, దిల్లీ


అటూ ఇటూ పరుగులా..!

కాల్పనిక రచయిత చైనా మివిల్లే 2009లో, ‘ద సిటీ’ ద్వారా పాఠకులపై బౌలింగ్‌ చేశారు. అందులో రెండు మెట్రో నగరాలు ఒక దాంట్లో ఒకటి ఉండి.. ఆ రెండింటి మధ్య మూడో నగరం ఉన్నట్లు వదంతుల్లో చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు ఆమోదించి మూడు రాజధానులకు వేదిక కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి అద్భుతమైన కథకే తెరతీశారు. మివిల్లే నగరాలు రేఖాగణితాన్ని ఉల్లంఘించి ఒకే స్థలాన్ని పంచుకోవడానికి పోటీపడితే, ఇందులోని దూరాలు జగన్‌మోహన్‌రెడ్డి పథకానికి విఘాతంగా మారాయి. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం.. న్యాయ రాజధాని కర్నూలుకు 700 కిలోమీటర్లు, శాసన రాజధాని అమరావతికి 400 కిలోమీటర్ల దూరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో రోజువారీ వ్యవహారాలు ప్రయాణపరంగా పీడకలగా మారే పరిస్థితులున్నాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి ఉన్నతాధికారులను రక్షించుకోవడానికి మొగలులు రెండు రాజధానులను ఎంచుకున్నారు. అంతకుముందెన్నడూ భౌగోళికంగా ప్రభుత్వ అంగాలను విభజించే ప్రయత్నం జరగలేదు. ప్రస్తుత వికేంద్రీకరణ ఆలోచన 1937నాటి శ్రీబాగ్‌ ఒప్పందం నాటిదని, చంద్రబాబు బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చే యత్నంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ప్రభుత్వం వాదిస్తోంది. 2010లో ఏర్పాటైన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ, 2014లో ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ మరింత సమతుల అభివృద్ధిని సూచించాయి. 2019లో ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీ 3 రాజధానులను సూచించగా, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అవి ఎక్కడెక్కడుండాలో సిఫార్సు చేసింది. శాసనసభ సమావేశాలు ఉన్నప్పుడు మంత్రులకు బ్రీఫ్‌ చేయడానికి అధికారులు అమరావతికి సులభంగా రావొచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. విశాఖపట్నంలో రోజువారీ పనులు వదులుకొని వాళ్లు అసెంబ్లీ సమావేశాలు ఉన్నంతకాలం అక్కడే ఉండాలి. పోలీసు అధికారులు ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి విశాఖపట్నంలోని సచివాలయానికి ప్రయాణం చేయాలి. పరిపాలన, పోలీసులతో ముడిపడిన ముఖ్యమైన వివాదాలు తలెత్తితే ప్రతి ఒక్కరూ కర్నూలుకు పోయిరావాలి. దీనివల్ల ప్రయాణ ఖర్చులు అసాధారణంగా పెరుగుతాయి. వికేంద్రీకృత అభివృద్ధి ద్వారా వస్తాయనుకొనే ఫలితాలను వ్యవస్థ ద్వారా పుట్టుకొనే అసమర్థతలు వేగంగా తినేస్తాయి.
ఈ అశాస్త్రీయ విధానం రాజకీయ వైరుధ్యంతో వచ్చి ఉండొచ్చు. 2015లో ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతుల సమక్షంలో నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. అయితే కేంద్ర మద్దతు లేక ఆ పథకం చతికిలపడింది. ఇప్పుడు జగన్‌ నేతృత్వంలోని వైకాపా అధికారంలోకి రాగానే 3 రాజధానులను తీసుకొచ్చారు. ఒకవేళ దీని ఉద్దేశం చంద్రబాబు అమరావతి ఆలోచనను నీరుగార్చడం అయితే.. అది అసమర్థ నిర్ణయం. ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన విజయవాడ నగరం సమీపంలోనే ఉంది. జగన్‌ తన ఆత్మ సంతృప్తికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆయన తన శక్తి సామర్థ్యాలను రైతుల నిస్పృహను పోగొట్టడానికి ఉపయోగించాలి. అదే అంశం గత ఏడాది ఆయనను సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టడానికి దోహదపడింది.

- ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌  23.1.2020 నాటి సంపాదకీయం


తర్కానికి విరుద్ధం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూపర్‌ కేపిటల్‌ అమరావతిని రద్దు చేసి, దాని స్థానంలో రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్లో 3 రాజధానులను నిర్మించాలని నిర్ణయించడం అన్ని తర్కాలకు విరుద్ధంగా ఉంది. 175 స్థానాలున్న అసెంబ్లీలో 151 మంది సభ్యుల మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చట్టాన్ని ఆమోదింపజేసుకోవడం కష్టం కాదు. ఆయనకు ముందున్న చంద్రబాబు నాయుడు అభివృద్ధిలో పరుగులు తీయించిన అమరావతి.. ఇప్పుడు కేవలం శాసన రాజధానిగానే మిగలనుంది. అక్కడికి 367 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కానుంది. అక్కడే సచివాలయం, రాజ్‌భవన్‌ ఉంటాయి. అంతిమంగా, విశాఖపట్నానికి 692 కిలోమీటర్లు, అమరావతికి 343 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలు.. హైకోర్టుతో న్యాయ రాజధాని కానుంది. చంద్రబాబు రూపొందించిన బ్లూప్రింట్‌ను కాదని జగన్‌మోహన్‌రెడ్డి ఏ తర్కంతో ఈ నాటకీయమైన మార్పునకు శ్రీకారం చుట్టారన్నది స్పష్టంగా తెలియదు. తనకు ‘సమ్మిళిత అభివృద్ధి’ కావాలని ఆయన అంటున్నారు. జాతీయ రాజకీయ యవనికపై తరచూ వినిపించే ఈ పదం ఉద్దేశాల వెనకున్న భిన్న కోణాలను సాధారణంగానే దాచిపెడుతుంది. ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకున్నా, రియల్‌ ఎస్టేట్‌ క్రీడకు అతీతంగా ఆ వాదన ఎలా ముందుకు సాగుతుందో చూడటం చాలా కష్టం. అందరికీ సమర్థపాలన అందించడమే సమ్మిళిత అభివృద్ధి అసలు ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పాటయ్యే 3 ప్రభుత్వ అంగాలు వికేంద్రీకరణ లక్ష్యాన్ని ఎలా సాధిస్తాయో తెలియదు.
అధికార వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పరిపాలనను దగ్గరకు చేర్చాలనుకుంటున్నట్లు చెప్పడంలో బలమైన వాదన ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి నిజంగా దీని గురించే ఆలోచిస్తుంటే.. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని గురుగ్రాం, నోయిడాల్లో ఏర్పాటు చేసినట్లు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో మినీ సచివాలయాల ఏర్పాటు అర్థవంతం అనిపించుకుంటుంది. దీనివల్ల భూసేకరణ ద్వారా రైతులకు లబ్ధి, ప్రజల వద్దకే పాలన ద్వారా రెండు రకాల లాభం చేకూర్చినట్లవుతుంది. కానీ ఇలాంటి అర్థవంతమైన విధానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసే అవకాశాలు కనిపించట్లేదు. అందుకు కారణం చంద్రబాబు, ఆయన అనుచరులు ప్రాతినిధ్యం వహించే కోస్తా కమ్మవాళ్లు, రాయలసీమ రెడ్ల మధ్య కుల శత్రుత్వమే. అమరావతి భూ లావాదేవీల ద్వారా కోస్తా కమ్మవాళ్లు లబ్ధి పొందారని, అందుకే జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కులానికి ఈ వికేంద్రీకరణ పథకం ద్వారా మేలుచేసి సమతూకం సాధించాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అమరావతి కోసం భూములిచ్చి పూర్తి స్థాయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు చంద్రబాబు చేసిన వాగ్దానాలకు మించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంపై ఉన్న అప్పుల భారాన్ని చూస్తే ఈ హామీ నిలబెట్టుకోవడంతో పాటు, 3 రాజధానుల ప్రణాళికకు నిధుల సమీకరణ కూడా కష్టమే.
ఇంధన కొనుగోలు ఒప్పందాల సమీక్ష, స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, చంద్రబాబు హయాంలో కట్టిన నిర్మాణాలను కూలగొట్టడం లాంటి చర్యలు.. స్థిరత్వాన్ని కోరుకునే వ్యాపార సంస్థలకు ఏ మాత్రం ప్రోత్సాహాన్నివ్వవు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు అంతిమ ఫలితం ఎగువసభపై ఆధారపడి ఉంటుంది. అందులోని 58 మంది సభ్యుల్లో చంద్రబాబుకు 28 మంది మద్దతు ఉంది. అందర్నీ కలుపుకొని పోవడానికి బదులు, భూప్రయోజనాలు, కుల సమీకరణల మధ్య నెలకొన్న సంఘర్షణలే ఐదేళ్ల వయస్సున్న ఈ రాష్ట్రానికి 3 రాజధానులా.. లేదంటే ఒకటా? అన్నది నిర్ణయించనున్నాయి. సమ్మిళిత అభివృద్ధి సాధనకు ఇంతకంటే ఉత్తమ మార్గాలు ఎన్నో ఉన్నాయి.

- బిజినెస్‌ స్టాండర్డ్‌ 24.1.2020 నాటి సంపాదకీయం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.