close

తాజా వార్తలు

‘మూడు రాజధానులు’ చెడ్డ నిర్ణయం

అది రాజకీయ ఆలోచనగా కనిపిస్తోంది
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి అదనపు భారం
కార్యనిర్వాహక, శాసన రాజధానులు ఒకే చోట ఉండాలి
ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి
రాజ్యసభ టీవీలో ప్రసారమయ్యే ‘ద బిగ్‌ పిక్చర్‌’ కార్యక్రమంలో నిపుణుల అభిప్రాయం
ఈనాడు - అమరావతి

మూడు రాజధానుల నిర్ణయం చెడ్డ ఆలోచనని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది ఏమాత్రం తోడ్పడే అంశం కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అది పూర్తిగా రాజకీయ నిర్ణయంగానే కనిపిస్తోందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది ఆర్థికంగానూ భారమేనన్నారు. అధికార వికేంద్రీకరణకు ఆచరణ సాధ్యమైన విధానాలుండగా, వాటిని వదిలేసి పాలన వికేంద్రీకరణ చేయడమంటే ప్రజల నమ్మకాన్ని పాలకులు వమ్ము చేయడమేనన్నారు. కార్యనిర్వాహక, శాసన రాజధానులు ఒకేచోట ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ టీవీలో ప్రసారమయ్యే ‘ద బిగ్‌ పిక్చర్‌’ కార్యక్రమంలో ఈనెల 21న ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బహుళ రాజధానులు, పాలన వికేంద్రీకరణ’ అంశంపై చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది, ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి, ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌, సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌ ఈ చర్చలో పాల్గొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను నలుగురూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంపై తెదేపా అధినేత చంద్రబాబు శనివారం ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘మూడు రాజధానులు భయంకరమైన ఆలోచన. దేశానికి తప్పుడు సంకేతాలిచ్చేలా ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ టీవీలో ప్రసారమైన చర్చా కార్యక్రమం యూట్యూబ్‌ లింక్‌ను ట్విటర్‌కు జతచేశారు.

అభివృద్ధికి సాధనం కాదు
- బీకే చతుర్వేది
ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి 3రాజధానులు పరిష్కారం కాదు. కార్యనిర్వాహక రాజధాని ఒకచోట, శాసన రాజధాని ఒకచోట అన్నది ఊహకందని విషయం. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజధాని లఖ్‌నవూలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోరాజధాని భోపాల్‌లో ఉంటే, హైకోర్టు జబల్‌పూర్‌లో ఉంది. గుజరాత్‌లో రాజధాని గాంధీనగర్‌లో ఉంటే హైకోర్టు అహ్మదాబాద్‌లో ఉంది. ఇలా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నా ఫర్వాలేదు. శాసన రాజధాని ఒకచోట, కార్యనిర్వాహక రాజధాని మరోచోట ఏర్పాటు చేయాలనుకోవడం చెడ్డ ఆలోచన. ఆ రెండు వ్యవస్థలూ ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధం కలిగి ఉంటాయి. అసెంబ్లీ జరిగే సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలి. బిల్లులపై మంత్రులకు వివరించాలి. విశాఖ, అమరావతి ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలనుకుంటే.. పారిశ్రామికంగా, పెట్టుబడులు ఆకర్షించడం, అభివృద్ధికి అనుకూల వ్యూహాలు రూపొందించాలి. ప్రాంతీయ స్థాయిలో అదనపు అధికారాలివ్వాలి. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కర్నూలులో హైకోర్టు, రాష్ట్రం మధ్యలో ఉండే అమరావతిలో రాజధాని ఉండాలి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎగువసభ లేదు. చిన్న రాష్ట్రాలకు ఇది ఆర్థికంగానూ భారమే. అయితే ఆంధ్రప్రదేశ్‌కు అవసరమే. ఎగువ సభను కొనసాగించాలి.

రాజకీయ నిర్ణయం: కేవీ ప్రసాద్‌
అమరావతి అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉంటుంది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే.. రాయలసీమ జిల్లాల వారు వెయ్యి కి.మీ.లకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. మూడు రాజధానుల నిర్ణయం రాజకీయ క్రీడలో భాగమనుకుంటున్నా. ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌ అమరావతి అంశాన్ని ప్రస్తావించలేదు. అప్పట్నుంచే ఆయన మనసులో ఈ ఆలోచన ఉన్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. అమరావతి మార్పు ఆర్థికంగానూ భారమే. ఇంకోచోట పెట్టుబడి పెట్టడం ఖర్చుతో కూడిన వ్యవహారమే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరమే. ఇప్పటిదాకా ఈ అంశాన్ని విస్మరించిన మాటా నిజమే. ఎగువ సభ అనేది నిపుణులతో కూడినదై నిష్పాక్షికంగా సలహాలు, సూచనలు చేసేదై ఉండాలి.

జిల్లాకో రాజధాని కావాలంటే ఏం చేస్తారు?: జయసాయి దీపక్‌
సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడమంటే.. రాజ్యాంగ, న్యాయపరంగా ప్రశ్నించే అధికారం రైతులకు ఉంటుంది. ప్రజల పన్నుల ద్వారా చేపట్టిన అభివృద్ధిని నిలిపేస్తున్నారు. ఎందుకీ ఆలోచన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరమా? రేపు నాలుగు.. అయిదు కావచ్చు, జిల్లాకు ఒకటి అనొచ్చు. చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు అంటే.. రేపు మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోనూ ఇదేవిధంగా అంటే ఏంటీ పరిస్థితి? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును దుర్వినియోగం చేయడమే. అధికార వికేంద్రీకరణ అనేది పంచాయతీ, పురపాలకస్థాయి నుంచి జరగాలి. స్థానిక అధికారాలు వికేంద్రీకరించాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా దృష్టి పెట్టాలి. ఎగువ సభ రాజకీయాలకతీతంగా సూచనలు చేయాలి. ఉద్దేశం పక్కదారి పట్టకూడదు.


అది వృథా ప్రయాస: ఎస్‌.సి.త్రిపాఠి

చాలా రాష్ట్రాల్లో చారిత్రక కారణాలవల్ల హైకోర్టులు వేరే చోట ఉన్నాయి. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు పార్లమెంటరీ విధానంలో ఒకే నాణానికి రెండు పార్శ్వాల వంటివి. ఇవి ఒకేచోట ఉండాలి. శాసన వ్యవస్థ ఎక్కడుంటే కార్యనిర్వాహక వ్యవస్థ అక్కడే ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఎన్నో అంశాలుంటాయి. అధికారం ఒకే ప్రాంతంలో ఉండాలి. ఇందుకు అన్ని విభాగాలూ ఒకేచోట ఉండాలి. న్యాయ వ్యవస్థ పని తీరు వీటికి భిన్నంగా ఉంటుంది. మూడు రాజధానుల నిర్ణయం వృథా. ఎలాంటి ఉపయోగం ఉండదు. శాసన రాజధాని నుంచి పరిపాలన రాజధాని వేరు చేస్తే దానికి చేసే ఖర్చూ నిరుపయోగమే. ఎగువ సభలు పెద్ద రాష్ట్రాలకూ అవసరమే. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చేవారితోపాటు వి విధ రంగాల నిపుణులు ఇందులో ఉంటారు. శాసన తయారీలో వీరి భాగస్వామ్యం ఉంటుంది. అయితే ఇది రాజకీయ పునరావాసం కాకూడదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.