close

తాజా వార్తలు

ఈసారి బంతితో..

భారత బౌలర్ల ధాటికి కివీస్‌ విలవిల
203 కొట్టిన చోటే 132/5కు కట్టడి
మళ్లీ మెరిసిన రాహుల్‌, శ్రేయస్‌
రెండో టీ20లోనూ కోహ్లీసేన ఘనవిజయం

రెండు రోజుల కిందట న్యూజిలాండ్‌ 203 పరుగులు చేసిన అదే ఈడెన్‌ పార్క్‌ మైదానం! మొన్న టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. ఈసారి టాస్‌ గెలిచి తనే బ్యాటింగ్‌ తీసుకుంది! తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు పడ్డాయి.. స్కోరు 13.
ఇంకేముంది.. భారత బౌలర్లకు బడిత పూజ తప్పదని.. పరుగులు పోటెత్తబోతున్నాయని.. 200 కంటే పెద్ద లక్ష్యానికి భారత్‌ సిద్ధపడాల్సిందే అని ఒక అంచనాకు వచ్చేశారు అభిమానులు!
కానీ అనూహ్యం.. రెండో ఓవర్‌ నుంచి బ్యాట్లు లేవనేలేదు! ఫోర్లు, సిక్సర్ల సంగతి తర్వాత.. సింగిల్స్‌ తీయడానికీ అవస్థలే! క్రీజులో ఎన్నెన్ని విన్యాసాలు చేసినా.. బంతి చిక్కక కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు!
ముందు మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌ నెమ్మదించగా.. అద్భుతమైన బౌలింగ్‌ ప్రతిభతో వారెవా అనిపించారు భారత బౌలర్లు. వారి ధాటికి బ్యాటింగ్‌ స్వర్గధామంగా పేరున్న ఈడెన్‌ పార్క్‌.. బౌలర్ల డెన్‌గా మారిపోయింది.
గత మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ ముందు ఈసారి నిలిచింది 133 పరుగుల స్వల్ప లక్ష్యం. మధ్యలో కాస్త ఇబ్బంది పడ్డా.. చివరికి అలవోకగా ఈ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమ్‌ఇండియా.

ఆక్లాండ్‌

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా దూసుకెళ్తోంది. అయిదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో అలవోకగా నెగ్గిన ఈడెన్‌ పార్క్‌లోనే ఆదివారం మరో ఘనవిజయాన్నందుకుంది. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి, 15 బంతులు మిగిలుండగానే ఛేదించింది భారత్‌. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ కేఎల్‌ రాహుల్‌ (57 నాటౌట్‌; 40 బంతుల్లో 3×4, 2×6) ఇంకో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (44; 33 బంతుల్లో 1×4, 3×6) కూడా మరోసారి మెరిశాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ (2/20) రాణించాడు. అంతకుముందు రవీంద్ర జడేజా (2/18), జస్‌ప్రీత్‌ బుమ్రా (1/21)లకు తోడు మిగతా బౌలర్లూ రాణించడంతో కివీస్‌ 20 ఓవర్లలో 132/5కు పరిమితమైంది. గప్తిల్‌ (33; 20 బంతుల్లో 4×4, 2×6), సీఫర్ట్‌ (33 నాటౌట్‌; 26 బంతుల్లో 1×4, 2×6) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడారు. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.

అంత తేలిగ్గా ఏమీ కాదు..: స్కోరు బోర్డు చూస్తే భారత్‌ చాలా సులువుగా గెలిచేసినట్లు అనిపిస్తుంది కానీ.. నిజానికి ఛేదన అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. రోహిత్‌ (8) మరోసారి విఫలం కాగా.. కోహ్లి (11) సైతం త్వరగా వెనుదిరగడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి 40/2తో కష్టాల్లో పడ్డట్లే కనిపించింది. తర్వాత  5 ఓవర్ల వ్యవధిలో 23 పరుగులే వచ్చాయి. అయితే గత మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్‌ను గెలిపించిన రాహుల్‌, శ్రేయస్‌.. ఈసారి సంయమనంతో ఆడి జట్టును గట్టెక్కించారు. ఆరంభంలో మెరుపులు మెరిపించాక నెమ్మదించిన రాహుల్‌.. తర్వాత అడ్డదిడ్డంగానే కొన్ని షాట్లు ఆడి పరుగులు రాబట్టాడు. అప్పర్‌ కట్‌తో అతను బంతిని స్టాండ్స్‌లోకి పంపిన షాట్‌ మ్యాచ్‌కే హైలైట్‌. కుదురుకున్నాక శ్రేయస్‌ కూడా క్రీజులో తనదైన శైలిలో కదులుతూ భారీ షాట్లు ఆడాడు. 39 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో రాహుల్‌ను రనౌట్‌ చేసే అవకాశాన్ని వృథా చేయడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. విజయానికి 8 పరుగులే అవసరమైన స్థితిలో అయ్యర్‌ ఔట్‌ కాగా.. దూబె వచ్చి యువీ స్టయిల్లో ఒక మెరుపు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ఆపసోపాలే..: అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. శార్దూల్‌ వేసిన తొలి ఓవర్లో గప్తిల్‌ వరుసగా రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభమే ఇచ్చినా.. బుమ్రా వేసిన రెండో ఓవర్‌ నుంచి పరుగుల రాక కష్టమైంది. మరో ఓపెనర్‌ మన్రో (25 బంతుల్లో 26) చాలా బంతులు వృథా చేశాడు. గప్తిల్‌ ఉన్నంత వరకు స్కోరు వేగం పర్వాలేదు కానీ.. ఆ తర్వాత కివీస్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. కొంచెం ఊపందుకుంటున్న సమయంలో మన్రో వెనుదిరగ్గా.. ఫామ్‌లో విలియమ్సన్‌ (14)ను జడేజా ఔట్‌ చేసి కివీస్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. గ్రాండ్‌హోమ్‌ (3)ను కూడా అతనే ఔట్‌ చేశాడు. టేలర్‌ (18) చాలాసేపు క్రీజులో ఉన్నా బ్యాట్‌ ఝులిపించలేకపోయాడు. సీఫర్ట్‌ కొన్ని షాట్లు ఆడబట్టి కివీస్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. 9-15 మధ్య 6 ఓవర్లలో 36 పరుగులే రాగా.. చివరి 4 ఓవర్లలో 23 పరుగులే నమోదయ్యాయి.


13 ఓవర్లలో 6 అంతకంటే తక్కువ..

5, 5, 5, 6, 4, 3, 3, 5, 6, 4, 6, 3, 5.. ఏమిటీ అంకెలంటరా? రెండో టీ20లో భారత బౌలర్లు వివిధ ఓవర్లలో ఇచ్చిన పరుగులు. 6 అంతకంటే తక్కువ పరుగులు నమోదైన ఓవర్లు ఈ మ్యాచ్‌లో 13 ఉండటం విశేషం. కేవలం మూడు ఓవర్లలో మాత్రమే రెండంకెల సంఖ్యలో పరుగులు నమోదయ్యాయి. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగూ రాని బంతులు ఏకంగా 45 ఉండటం విశేషం. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ 7 ఫోర్లు, 5 సిక్సర్లు మాత్రమే కొట్టారు. తొలి టీ20తో పోలిస్తే ఈడెన్‌ పార్క్‌ పిచ్‌ నెమ్మదించడం, పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారడం వాస్తవం. కానీ న్యూజిలాండ్‌ను 132/5కే పరిమితం అయిందంటే అందుకు భారత బౌలర్ల ప్రతిభే ప్రధాన కారణం. వికెట్లు చేతిలో ఉన్నా, క్రీజులో విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఉన్నా కివీస్‌ స్కోరు బోర్డు ముందుకు కదల్లేదంటే.. భారత బౌలర్లు ఎలా బంతులేశారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి బౌలింగ్‌నైనా ఉతికారేసే మన్రో, రాస్‌ టేలర్‌.. షాట్ల కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. వాళ్లు అలవోకగా ఆడే షాట్లు ఈ మ్యాచ్‌లో పని చేయలేదు. పదే పదే బంతి బీట్‌ అయింది. ముఖ్యంగా బుమ్రా, షమి వీళ్లిద్దరినీ ఆటాడుకున్నారు. ఇక జడేజా అయితే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేశాడు. అసలు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు. అతను నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం.


రాహుల్‌..  భలే ఛాన్సులే

కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా బాగానే కలిసొస్తున్నాయి! అతడిని రనౌట్‌ చేసేందుకు మంచి మంచి అవకాశాలొస్తున్నా వదిలేస్తున్నారు. తొలి టీ20లో రాహుల్‌ ఒకే బంతికి రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అతను పిచ్‌ మధ్యలో ఉండగా సౌథీ త్రో విసిరితే గురి తప్పింది. తిరిగి అవతల మరో ఫీల్డర్‌ బంతి అందుకుని విసరగా.. అప్పటికీ రాహుల్‌ క్రీజులోకి రాలేదు. మళ్లీ గురి తప్పింది. రెండో టీ20లో రాహుల్‌ రెండు అవకాశాలొచ్చాయి. 42 పరుగుల వద్ద ఓసారి, 52 వద్ద మరోసారి అతణ్ని రనౌట్‌ చేసే అవకాశాన్ని కివీస్‌ ఫీల్డర్లు వృథా చేశారు. బ్యాటింగ్‌ ఎంత బాగా చేస్తున్నప్పటికీ.. పరుగు విషయంలో రాహుల్‌ బద్దకం వీడాల్సిందే!


‘‘బౌలర్లు సమయోచితంగా నిలబడ్డారు. మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వికెట్‌కు ఒకవైపే బంతులేస్తూ బలమైన న్యూజిలాండ్‌ జట్టును 132 పరుగులకే కట్టడి చేయడం చాలా తక్కువ స్కోరు చేయనిచ్చినట్లే. ఇది 160 పరుగులు చేయగల పిచ్‌ అనుకున్నాం. జడేజా, బుమ్రా అసాధారణంగా బౌలింగ్‌ చేశాడు. మిగతా బౌలర్లూ చక్కటి ప్రదర్శన చేశారు. బౌలర్లకు ఫీల్డర్లు కూడా చక్కటి మద్దతునివ్వడం కీలకమైన విషయం’’

- కోహ్లి


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) కోహ్లి (బి) శార్దూల్‌ 33; మన్రో (సి) కోహ్లి (బి) దూబె 26, విలియమ్సన్‌ (సి) చాహల్‌ (బి) జడేజా 14; గ్రాండ్‌హోమ్‌ (సి) అండ్‌ (బి) జడేజా 3; టేలర్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 18; సీఫర్ట్‌ నాటౌట్‌ 33; శాంట్నర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132; వికెట్ల పతనం: 1-48, 2-68, 3-74, 4-81, 5-125; బౌలింగ్‌: శార్దూల్‌ 2-0-21-1; షమి 4-0-22-0; బుమ్రా 4-0-21-1; చాహల్‌ 4-0-33-0; దూబె 2-0-16-1; జడేజా 4-0-18-2

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) టేలర్‌ (బి) సౌథీ 8; రాహుల్‌ నాటౌట్‌ 57; కోహ్లి (సి) సీఫర్ట్‌ (బి) సౌథీ 11; శ్రేయస్‌ (సి) సౌథీ (బి) సోధి 44; దూబె నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-8, 2-39, 3-125; బౌలింగ్‌: సౌథీ 3.3-0-20-2; బెనెట్‌ 3-0-29-0; టిక్నర్‌ 3-0-34-0; శాంట్నర్‌ 4-0-19-0; ఇష్‌ సోధి 4-0-33-1


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.