close

తాజా వార్తలు

కారు @ 113

పురపాలికల్లో తెరాస పాగా!
కాంగ్రెస్‌కు చండూరు, వడ్డేపల్లి
భాజపాకు ఆమన్‌గల్‌, తుక్కుగూడ
ఎంఐఎంకు భైంసా, జల్‌పల్లి
మక్తల్‌లో భాజపా, తెరాస హోరాహోరీ
చాలాచోట్ల కారెక్కిన స్వతంత్రులు.. రెబల్స్‌
అధికార పార్టీ ఎక్స్‌ అఫిషియో అస్త్రం
కార్పొరేషన్లన్నింటా గులాబీ హవా
కరీంనగర్‌లో నేడు ఓట్ల లెక్కింపు

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల్లో తెరాస అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది. మెజారిటీ సాధించినా.. అధికార పార్టీ సంధించిన ఎక్స్‌అఫిషియో అస్త్రంతో  చాలాచోట్ల ప్రతిపక్షాలు పుర పీఠాలకు దూరమవుతున్నాయి.  స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులతో పాటు పలు చోట్ల కాంగ్రెస్‌ నుంచి ఎంపికైన వారు కారెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తొమ్మిది కార్పొరేషన్లకు గాను తొమ్మిదింటిలో తెరాస జెండా ఎగురనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు ఓట్ల లెక్కింపు సోమవారం జరగతుంది.  రాష్ట్రంలో 113 మున్సిపల్‌ పీఠాలను గులాబీ నేతలు సొంతం చేసుకోబోతున్నారు. చండూరు, వడ్డేపల్లి పురపాలక సంఘాలను కాంగ్రెస్‌; ఆమన్‌గల్‌, తుక్కుగూడలను భాజపా దక్కించుకోబోతున్నాయి. బైంసా, జల్‌పల్లి మున్సిపాలిటీలు ఎంఐఎంవే. మక్తల్‌ను నిలబెట్టుకునేందుకు భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెరాస కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది.

అయిదారుగురు అవసరమైనా...
మెజారిటీ సాధించని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఛైర్‌పర్సన్‌, మేయర్‌ పదవుల కోసం తెరాస పక్కా కార్యాచరణ అమలుచేస్తోంది. ఐదారు ఓట్లు అవసరమైనా ఇదే అస్త్రంతో ముందుకెళ్తోంది. స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులు చేరినా బలం తక్కువగా ఉంటే గరిష్ఠంగా ఎంతమంది ఎక్స్‌అఫిషియో సభ్యులను ఉపయోగించుకోవచ్చో పరిశీలించి ఆ ప్రకారం అడుగులు వేస్తోంది. అప్పటికీ మెజారిటీ రాకపోతే ఇతర పార్టీల నుంచి నెగ్గినవారు మద్దతు ఇచ్చేలా పావులు కదుపుతోంది. పలుచోట్ల కాంగ్రెస్‌, వామపక్షాల అభ్యర్థులను తెరాస స్థానిక నేతలు సంప్రదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులు ఇతర పార్టీల నుంచి నెగ్గినవారికి దక్కే అవకాశం ఉంది.
* పెద్ద అంబర్‌పేట, నారాయణ్‌ఖేడ్‌, తుర్కయాంజాల్‌, ఆదిభట్ల, హాలియాలలో మెజారిటీ సాధించినా వీటిని నిలబెట్టుకునే స్థితిలో కాంగ్రెస్‌ లేదు. స్వతంత్రుల మద్దతు, ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్‌ కంటే తెరాస ఎక్కువ ఓట్లను పొందే స్థితిలో ఉంది.
* నేరేడుచర్లలో 15 వార్డులకు గాను ఏడు చోట్ల నెగ్గిన కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా సీపీఎం ఓటు లభించనుంది. ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడే ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ తెరాస తన ఏడుగురు సభ్యులకు తోడు మూడు ఎక్స్‌అఫిషియో ఓట్లతో రంగంలోకి దిగడంతో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
* మక్తల్‌లో భాజపా, తెరాస మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. ఇక్కడ 16 వార్డులకు ఎనిమిది నెగ్గిన భాజపాకు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు. భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఓటుతో భాజపా బలం పదికి చేరింది. ఇక్కడ నెగ్గిన ఐదు వార్డులతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓట్లతో తెరాస ప్రయత్నం చేస్తోంది. ఈ రూపంలో ఆరు ఓట్లను తెరాస ఉపయోగించాల్సి ఉంటుంది.

ఐదు కార్పొరేషన్లలో...
* నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో భాజపా అత్యధిక స్థానాల్లో నెగ్గినా మేయర్‌ పదవిని దక్కించుకోలేకపోయింది. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు, ఎక్స్‌అఫిషియో సభ్యుల బలంతో తెరాస మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకోనుంది. 13 డివిజన్లలో తెరాస, 16 డివిజన్ల ఎంఐఎం నెగ్గగా ఆధిక్యానికి అవసరమైన బలాన్ని ఒక స్వతంత్ర అభ్యర్థితో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులతో తెరాస నెగ్గనుంది. భాజపా 28 డివిజన్లలో నెగ్గినా అవసరమైన బలాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేసి విఫలమైంది.
* రామగుండం కార్పొరేషన్‌లో 18 డివిజన్లలో నెగ్గిన తెరాసకు దాదాపు అందరు తిరుగుబాటు అభ్యర్థులు తెరాస గూటికి చేరగా మిగిలిన ఓట్లను ఎక్స్‌అఫిషియో సభ్యులతో సమకూర్చుకుంది. దీంతో రామగుండం పీఠం తెరాస ఖాతాలోనే చేరనుంది.
* బడంగ్‌పేటలో తెరాసకు 13 మంది కార్పొరేటర్లు ఉండగా స్వతంత్రులు కారెక్కుతున్నారు. ఇక్కడ నెగ్గిన కాంగ్రెస్‌ కార్పొరేటర్లలో కొందరు తెరాసకు మద్దతు ఇవ్వనున్నారు. ఐదుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులను తెరాస అస్త్రంగా వాడనుంది.
* మీర్‌పేటలో స్వతంత్రుల మద్దతు తెరాసకు లభించడంతో ఎన్నిక ఏకపక్షం కానుంది.
* బోడుప్పల్‌లో స్వతంత్రులు తెరాసలో చేరుతుండటంతో ఈ కార్పొరేషన్‌ను తెరాస సొంతం చేసుకోనుంది.
* మరో నాలుగు కార్పొరేషన్లు... ఫీర్జాదిగూడ, బండ్లగుడా జాగీర్‌; నిజాంపేట్‌, జవహర్‌నగర్‌లలో తెరాసకు స్పష్టమైన మెజారిటీ ఉంది.


కాంగ్రెస్‌ విప్‌

మేయర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. సమావేశంలో పాల్గొనడంతో పాటు ఎవరికి ఓటు వేయాలి అనే అంశాలను పురపాలక సంఘాల వారీగా విప్‌ జారీ చేసింది.


మూడింట రెండొంతుల మంది విప్‌ను ధిక్కరిస్తే...

నెగ్గిన వారిలో మూడింట రెండు వంతుల మంది విప్‌ను ధిక్కరిస్తే ఫార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఈ మేరకు తెరాస నేతలు వ్యూహం పన్నుతున్నారు. బడంగ్‌పేటలో ఈ అస్త్రం తెరాస ప్రయోగించనుందని సమాచారం.


నేటి మధ్యాహ్నం ఎన్నిక

సోమవారం ఉదయం 120 పురపాలక సంఘాలు, తొమ్మిది నగరపాలక సంస్థల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌; మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు తొలి సమావేశం జరుగుతుంది. ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 12.30 గంటలకు నిర్వహించే సమావేశంలో మేయర్‌, ఛైర్‌పర్సన్‌ ఎన్నిక పూర్తి చేస్తారు. అనంతరం డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక జరుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.