close

తాజా వార్తలు

తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద కీలకాధారాలు

దిశ, ఆమె సోదరి స్వరాలు, సంభాషణలు నిర్ధారణ
అత్యాధునిక సాంకేతికతతో సెల్‌ఫోనుల విశ్లేషణ
సిద్ధమైన ఫోరెన్సిక్‌ నివేదిక
ఈనాడు - హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై పోలీస్‌ పరిశోధన కీలకదశకు చేరుకుంది. దిశను హత్యాచారం చేసిన నిందితులు మహ్మద్‌ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్‌ కుమార్‌ (పోలీసు ఎదురు కాల్పుల్లో చనిపోయారు)కు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నివేదికను సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి శంషాబాద్‌, షాద్‌నగర్‌ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు గత ఏడాది డిసెంబరు రెండో వారంలో పంపించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలు, సూక్ష్మపరికరాలతో వాటిని విశ్లేషించారు. ఇందులో కీలకమైన సాక్ష్యాలు.. దిశ, ఆమె సోదరి స్వరాలు, తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద దిశను లాక్కెళ్లేటప్పుడు నిక్షిప్తమైన సీసీ కెమెరా ఫుటేజీ, దిశ సెల్‌ఫోనులోని నంబర్లు.. సంక్షిప్త సందేశాలు.. సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని రెండురోజుల్లో పోలీసులకు అందజేయనున్నట్టు తెలిసింది.

40 అడుగుల ఎత్తులో ఉన్నా..
తొండుపల్లి టోల్‌ప్లాజా కూడలి వద్ద 40 అడుగుల ఎత్తులో ఉన్న సీసీ కెమెరాలో ‘దిశ’ హత్యాచార ఘటనకు సంబంధించిన అత్యంత కీలకమైన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఆమె ద్విచక్ర వాహనం టైరు పంక్చర్‌ చేయడం, బాగు చేయిస్తామంటూ నిందితులు ఆమెతో మాట్లాడటం, అక్కడున్న వారెవరికీ అనుమానం రాకుండా లారీ వద్దకు లాక్కెళ్లడం.. ఇలా అని దృశ్యాలూ ఆ ఫుటేజీలో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నిందితుల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించేలా ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అధికారులు అభివృద్ధి చేశారు. ఇతర సీసీ కెమెరాలు ఘటనా స్థలికి దూరంగా ఉండడం, వాహనాల నంబర్లను మాత్రమే చిత్రీకరించే ఎత్తులో అమర్చడంతో వాటిని ఫోరెన్సిక్‌ ప్రయోగశాల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.

స్వరం.. సంభాషణలు..
గత ఏడాది నవంబరు 27న ఘటన జరగడానికి ముందు ‘దిశ’, ఆమె సోదరి మాట్లాడుకున్న సంభాషణల రికార్డులను పరిశీలించారు. అనంతరం సాంకేతికంగా పరీక్షించగా ఆ స్వరాలు వారివేనని తేలింది. ఆ రోజు రాత్రి 9 గంటల నుంచి 9.40 గంటల వరకు ‘దిశ’ అక్కడే ఉన్నట్టు ఆమె సెల్‌ఫోను ఆధారంగా తేల్చారు. దీంతోపాటు ఆ రోజుకు ముందు 15 రోజులుగా ఎవరెవరితో మాట్లాడింది.. ఎక్కువగా ఆమెతో ఎవరు మాట్లాడారో కూడా పరిశీలించారు. మరోవైపు, చటాన్‌పల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు, రివాల్వర్లనూ బాలిస్టిక్‌ నిపుణులు పరిశీలించి అందులోని వివరాల రిపోర్టును ఇచ్చారని తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఆ సాక్ష్యాధారాలను విచారణ సమయంలో న్యాయస్థానానికి సమర్పించనున్నామని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.