close

తాజా వార్తలు

కాగితాలపై కొనుగోళ్లు అక్రమాలకు ఆనవాళ్లు

నగరం నడిబొడ్డున అనుమతిలేని లేఅవుట్‌
ఏకంగా 44 ఎకరాల్లో ప్లాట్ల అమ్మకాలు
జోరుగా నిర్మిస్తున్న భారీ భవంతులు
సరిహద్దు వివాదంతో చోద్యం చూసిన అధికారులు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, రాజేంద్రనగర్‌- న్యూస్‌టుడే: అది హైదరాబాద్‌ నగర నడిబొడ్డు. వందల కోట్ల రూపాయల విలువైన భూమిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అక్రమ వెంచర్‌ వెలిసింది. ఆపై దర్జాగా అమ్మకాలు జరిగిపోయాయి. ప్రస్తుతం 50కిపైగా భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కొసమెరుపు ఏమిటంటే వీటిలో ఏ ఒక్కదానికీ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అనుమతి లేదు. రాజేంద్రనగర్‌ సర్కిల్లో.. బండ్లగూడ రెవెన్యూ పరిధిలోనిÅ సర్వే నంబరు 103/17, 103/18, 103/19లలో ఈ అక్రమాల భాగోతం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఒక ప్రైవేటు సంస్థ 2017లో 44 ఎకరాల్లో జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే అక్రమంగా వెంచర్‌ ప్రారంభించింది. దీన్ని 450 ప్లాట్లుగా చేసి అమ్మకాలు ప్రారంభించింది. ఇందులో 100 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 2018లో ఒక వ్యక్తి ఈ స్థలంపై తమకూ హక్కు ఉందంటూ కోర్టును ఆశ్రయించడంతో ఇందులో కార్యకలాపాలు జరగకుండా కోర్టు స్టే విధించింది. కోర్టు వివాదాల్లో ఉంది కాబట్టి బల్దియా ఎలాగూ వెంచర్‌కు అనుమతి ఇవ్వదన్న ఉద్దేశంతో ప్రైవేటు సంస్థ ప్రతినిధులు అనధికారిక లేఅవుట్‌ను వేశారు. నోటరీ ద్వారానే అమ్మకాలు జరుపుతున్నారు. ఇక్కడ గజం రూ.లక్ష వరకు పలుకుతోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ద్వారా నిర్మాణాలన్నీ క్రమబద్ధీకరిస్తామంటూ వెంచర్‌ వేసినవారు అక్కడి వారికి ఆశలు కల్పించడంతో అనేకమంది ఇప్పటికే పదుల సంఖ్యలో భవన నిర్మాణాలను పూర్తి చేశారు.

మాది కాదంటే మాది కాదు
బల్దియా పరిధిలోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ సర్కిళ్ల మధ్య ఈ వెంచర్‌ ఉండటంతో ఇరువైపులా అధికారులు తమది కాదంటే తమది కాదంటూ రెండేళ్లుగా మిన్నకుండిపోయారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు తమవంతు పాత్ర పోషించారు. ఓ దశలో వారు అధికారులను బెదిరించినట్లు సమాచారం. భారీగా కింది స్థాయిలో నగదు చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా ఇది రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోకే వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ రెండు సర్కిళ్లు దక్షిణ మండలం జోన్‌లోకి వస్తాయి. రెండింటికీ జోనల్‌ కమిషనర్‌ ఒక్కరే. వీటన్నింటికీ అనుమతులు తీసుకుంటే జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం లభించేది. నిర్మాణం పూర్తయిన భవనాలకు ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలుండేది.

10 మందికి నోటీసులు ఇచ్చాం
బండ్లగూడ పరిధిలోని వెంచర్‌లో భారీ భవనాలు నిర్మిస్తున్న మాట వాస్తవమేనని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఏసీపీ రాజేందర్‌ అన్నారు. ఇప్పటి వరకు 10 మందికి నోటీసులిచ్చామని చెప్పారు. ఉపకమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పట్టణ ప్రణాళిక విభాగాధికారులు అది తమపరిధి కాదని, అందుకే చర్యలు తీసుకోలేదని తెలిపారన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
HITS2020
besttaxfiler
dr madhu
Saket Pranamam
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన