close

తాజా వార్తలు

ప్రాణం తీసిన చాక్లెట్‌!

  ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి
  వనస్థలిపురం డీమార్టు బయట ఘటన

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, వనస్థలిపురం, హయత్‌నగర్‌, మేళ్లచెరువు: ఒక్కపూట ముందే అమ్మా ఎలా ఉన్నావంటూ పలకరించిన ఆ గొంతు మూగబోయింది.. ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అవ్వాలనుకున్న కలలు  చితికిపోయాయి. బయటకు వెళ్లి గంటలో వస్తానంటూ కళాశాల హాస్టల్‌ నుంచి బయటికొచ్చి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయాడు.. వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఇంటర్‌ విద్యార్థి లావుడ్య సతీష్‌ నాయక్‌(17) మృతి చెందటం సంచలనం సృష్టించింది. సూర్యాపేట జిల్లా జగ్గుతండాకు చెందిన బాలాజీ, నాగమణి దంపతుల పెద్ద కుమారుడు సతీష్‌ నాయక్‌ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం 5.45 గంటలకు గంటసేపు అనుమతి తీసుకుని కళాశాల హాస్టల్‌ నుంచి బయటికొచ్చాడు. రాత్రి 9.30 గంటలకు అతడు తిరిగి రాలేదంటూ కళాశాల వార్డెన్‌ విద్యార్థి తండ్రి బాలాజీకి ఫోన్‌ చేశాడు. కంగారుపడిన బాలాజీ నగరంలో ఉంటున్న బంధువులను కళాశాల దగ్గరికి పంపించాడు. స్నేహితులను ఆరా తీస్తే సతీష్‌ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసింది.

కావాలనే నాటకాలు ఆడుతున్నాడంటూ..
హాస్టల్‌ నుంచి బయటకెళ్లిన సతీష్‌, అతని స్నేహితులు శరణ్‌, మాధవ, కార్తీక్‌ వనస్థలిపురంలోని డీమార్టు దగ్గర కలుసుకున్నారు. రాత్రి 8.49 నిమిషాలకు డీమార్టు లోపలికెళ్లారు. 8.55 నిమిషాలకు సతీష్‌ బయటికొచ్చాడు. వస్తూ రూ.10 చాక్లెట్‌ను జేబులో వేసుకున్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారని అతడి మిత్రులకు అర్థమైంది. ‘అదే విషయాన్ని చెప్పేందుకు మేం హడావుడిగా బయటికొచ్చాం. అది చెప్పేలోపే వెనుక నుంచి భద్రతా సిబ్బంది వస్తుండటాన్ని గమనించి సతీష్‌ తన జేబులోని చాక్లెట్‌ను కింద పడేశాడు. సిబ్బంది తనిఖీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. మేం కంగారుగా లేపేందుకు ప్రయత్నించాం. కావాలనే నాటకాలు ఆడుతున్నాడంటూ డీమార్టు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యులు లేకపోవడంతో మరో ఆసుపత్రికెళ్లాం. అప్పటికే సతీష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు’ అని అతడి మిత్రులు వివరించారు.

శవపరీక్ష నివేదిక అందితేనే..
సతీష్‌ చాక్లెట్‌ తీసుకోవడం, బిల్లింగ్‌ కౌంటర్‌ నుంచి పరుగెడుతూ డీమార్టు బయటనున్న చెట్టు పక్కకు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డీమార్టు సిబ్బంది కొట్టడం వల్లే సతీష్‌ చనిపోయాడంటూ స్టోర్‌ ఎదుట సతీష్‌ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. లంబాడి ఐక్య వేదిక, అఖిల భారతీయ బంజారా సేన నాయకులు వారికి మద్దతు పలికారు. అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. అనంతరం హయత్‌నగర్‌లో సతీష్‌ చదువుతున్న కళాశాలకు వెళ్లి అతడి మృతికి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ‘నా కుమారుడికి చాక్లెట్‌ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. చదువు కోసం రూ.లక్షలు ధారపోస్తే.. మాకు శవాన్ని అప్పగించారు’ అంటూ సతీష్‌ తండ్రి బాలాజీ వాపోయాడు. గార్డియన్‌ అనుమతి తీసుకునే బయటకు పంపించామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. విచారణలో పోలీసులకు సహకరిస్తున్నామని, ఇప్పుడేం మాట్లాడలేమంటూ డీమార్టు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
HITS2020
VITEEE 2020
Saket Pranamam
besttaxfiler
dr madhu

Panch Pataka

దేవతార్చన