close

తాజా వార్తలు

ప్రాణం తీసిన పరాచికం!

120 కి.మీ. వేగం.. ఆపై నిర్లక్ష్యం
  హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ-భరత్‌నగర్‌ పైవంతెనపై   ఘోర రోడ్డు ప్రమాదం
  30 అడుగుల ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ కిందపడిన కారు
  ఒకరు అక్కడికక్కడే మృతి.. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు
ఆరుగురు సభ్యుల మిత్రబృందం.. సగటున రెండు పదుల ప్రాయం..
ఉరిమే ఉత్సాహం..అందుబాటులో కారు.. వయసు తెచ్చిన హుషారు..

ఆ జోరులో అర్ధరాత్రివేళ అలాఅలా నగరంలో తిరిగొద్దామనుకున్న వారి పాలిట అతివేగం, ఆపై నిర్లక్ష్యం శాపాలయ్యాయి. పెను ప్రమాదానికి మూలమయ్యాయి. కారు నడుపుతున్న యువకుడి ముఖాన మరణ శాసనం రాశాయి. మిగిలిన వారినీ తీవ్రగాయాలపాలు చేశాయి.

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, సనత్‌నగర్‌: హైదరాబాద్‌ ఎర్రగడ్డ సమీప భరత్‌నగర్‌ పైవంతెనపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంటకు 120 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పైవంతెన ఫుట్‌పాత్‌ ఎక్కి.. రక్షణగోడను ఢీకొని 30 అడుగుల ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ కిందపడి నుజ్జునుజ్జయ్యింది. రాత్రివేళ సరదాగా నగరాన్ని చుట్టొద్దామనుకున్న ఆరుగురు సభ్యుల మిత్రబృందంలో ఒకరు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మాదాపూర్‌లో బిర్యానీ.. బాలానగర్‌లో చాయ్‌
బోరబండకు చెందిన సునీల్‌(22), మహ్మద్‌ సొహైల్‌(27), మోహిజ్‌(19), గౌస్‌(20), ఇర్ఫాన్‌(18), అశ్వక్‌(18) స్నేహితులు. వీరంతా పేద కుటుంబాలకు చెందినవారే. నగరంలో అర్ధరాత్రి తరువాత.. సరదాగా షికారుకెళ్లాలని భావించారు. సొహైల్‌ బంధువుకు చెందిన కారులో బయలుదేరారు. లారీ డ్రైవర్‌గా అనుభవమున్న సునీల్‌ కారు నడిపించగా పక్కనే సొహైల్‌, మిగిలిన నలుగురు వెనుక కూర్చున్నారు. ముందుగా హైటెక్‌ సిటీలోని ఓ హోటల్‌లో బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి బాలానగర్‌ చౌరస్తాకు చేరుకుని చాయ్‌ తాగారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 2.10 గంటలకు మూసాపేట వైపు నుంచి భరత్‌నగర్‌ పైవంతెనపైకి చేరుకున్నారు. నిమిషాల్లోనే భరత్‌నగర్‌ కూరగాయల మార్కెట్‌ వద్ద భారీ శబ్దంతో కారు ఒక్కసారిగా పైనుంచి అక్కడే విద్యుత్‌ పనుల కోసం వినియోగిస్తున్న జేసీబీ బాస్కెట్‌పై పడింది. బాంబు పేలిందేమోనంటూ అక్కడి రైతులు, వ్యాపారులు, విద్యుత్‌ పనులు చేస్తున్న కార్మికులు పరుగులు తీశారు. ఆపై నుజ్జయిన కారు నుంచి యువకులను జేసీబీ సాయంతో బయటకుతీసి పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సొహైల్‌ అక్కడికక్కడే మరణించాడు. మిగిలినవారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మితిమీరిన వేగం.. సర్కస్‌ ఫీట్లు
ప్రమాదం జరిగిన తీరును చూసి కారు నడిపిన వ్యక్తి అతిగా మద్యం తాగి ఉంటాడని అంతా భావించారు. కానీ.. ఆ ఆరుగురిలో ఎవరూ తాగలేదని పోలీసుల పరిశీలనలో తేలింది. మరి.. అంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. పైవంతెనపై వాహనాల రద్దీ లేకపోవడంతో కారు వేగాన్ని 120 కి.మీ.లకు పెంచారు. ఆరుగురు మిత్రులు లోపల పరాచికాలు ఆడుకుంటూ.. సర్కస్‌ ఫీట్లు చేస్తూ పైవంతెన మధ్యలోకి చేరుకునే సరికి కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కింది. నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో రెయిలింగ్‌ను ఢీకొంది. అది విరిగిపోవటంతో అంత ఎత్తు నుంచి కారు పల్టీలు కొడుతూ కింద పడిందని ప్రత్యక్ష సాక్షులు ‘ఈనాడు’కు వివరించారు.   పైవంతెన కింద విద్యుత్‌ కేబుళ్లు వేసే పనుల కోసం  ఉంచిన జేసీబీపై కారు పడటంతో ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గిందని కారులోని వ్యక్తులను బయటకు తీసిన రాజు, ఆదం వివరించారు.

క్షతగాత్రులకు ‘గాంధీ’లో చికిత్స
గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: భరత్‌నగర్‌ పైవంతెనపై కారు బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు చనిపోగా, గాయపడిన మిగిలిన అయిదుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో సునీల్‌ కంటికి తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన మిగిలినవారికి ప్రథమ చికిత్స అందించి డిశ్ఛార్జి చేసినట్లు గాంధీ వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతిచెందిన సొహైల్‌ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.