close

తాజా వార్తలు

పెట్టుబడులపై గట్టి దెబ్బ

3 రాజధానుల ప్రకటనతో అమరావతిపై తీవ్ర ప్రభావం
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వెనక్కి మళ్లిన సంస్థలు
ఈనాడు - అమరావతి

సలే కొత్త రాష్ట్రం.. పరిశ్రమలు అంతంత మాత్రం.. వ్యవసాయమే ప్రధాన ఆధారం.. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించాలంటే ఒక చోదక శక్తి కావాలి. బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండాలి. ఆ పనిని ‘అమరావతి’ సమర్థంగా నిర్వహించింది. నగరానికి దేశ, విదేశాల్లో మంచి ‘ఇమేజ్‌’ వచ్చింది. ఇది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు చుక్కానిలా పనిచేసింది. ఒకరొకరుగా పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చారు. అమరావతికి వచ్చిన గుర్తింపుతో దానికి సమాంతరంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి మొదలైంది. దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. చాలా ఒప్పందాలు జరిగాయి. కొన్ని ఆచరణలోకి వచ్చాయి. మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి.


44 వేల కోట్లు

అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల విలువే సుమారు రూ.44,300 కోట్లు. ఇవన్నీ ఇప్పటికే రాజధానిలో భూముల కేటాయింపు జరిగిన సంస్థలు ప్రతిపాదించినవి.


7,206 కోట్లు

అమరావతికి రూ.7,206 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ సంసిద్ధమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం రుణంపై విముఖత వ్యక్తం చేయడంతో ప్రపంచబ్యాంకు ఆ ప్రాజెక్టును రద్దు చేసుకుంది. ప్రపంచబ్యాంకు ఇచ్చేది దీర్ఘకాలిక రుణం. వడ్డీ కూడా చాలా తక్కువ.


2,860 కోట్లు

రాజధానిగా అమరావతిని నిర్ణయించాక 3 రైల్వేలైన్లు మంజూరయ్యాయి. నిర్మాణ వ్యయం రూ.2,860 కోట్లు.


50 వేల కోట్లు

అమరావతిలో 1691 ఎకరాల్లో సింగపూర్‌ సంస్థల కన్సార్షియం, ఏడీసీ కలసి అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు తలపెట్టాయి. దీనికి తొలి దశలోనే సుమారు రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవని అంచనా. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి తెలిశాక.. సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ప్రాజెక్టు రద్దుచేసుకుంది.


17,761 కోట్లు

రాజధాని చుట్టూ 189 కి.మీ. పొడవైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం (తెనాలి ఒక్కటే ఓఆర్‌ఆర్‌కి వెలుపల ఉంటుంది) తలపెట్టింది. అంచనా వ్యయం రూ.17,761.49 కోట్లు. ఇది ఆచరణలోకి వస్తే ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి.


ఇదంతా నిన్నటి మాట..!

3 రాజధానుల ప్రకటనతో పరిస్థితి తలకిందులైంది. అమరావతి, చుట్టుపక్కల వస్తాయనుకున్న పెట్టుబడులు, ప్రాజెక్టుల్లో కొన్ని రద్దయ్యాయి. మిగతావి సందిగ్ధంలో పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఇక్కడ కేవలం అసెంబ్లీనే ఉంచితే.. పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, అమరావతికి కొత్త రైల్వేలైను వంటి కేంద్ర సహకారంతో చేపట్టే ప్రాజెక్టులూ రద్దయ్యే అవకాశం ఉంది.


హైదరాబాద్‌, బెంగళూరుకు తరలిపోతున్న నిర్మాణదారులు

విజయవాడ-గుంటూరు మార్గంలో కనకదుర్గ వారధి దాటిన తర్వాత తాడేపల్లి నుంచి మంగళగిరి, కాజ వరకు గత నాలుగేళ్లలో నిర్మాణ రంగంలో కొన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాజధాని ఇక్కడే కొనసాగితే ఆ ప్రాంతంలో భారీ వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మూడు రాజధానుల ప్రకటనతో పరిస్థితి తలకిందులైంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు.

అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల విలువే సుమారు రూ.44,300 కోట్లు. ఇవన్నీ ఇప్పటికే రాజధానిలో భూముల కేటాయింపు జరిగిన సంస్థలు ప్రతిపాదించినవి.
* అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం 130 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు 1,293 ఎకరాలు కేటాయించింది.
* విట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు తరగతులు ప్రారంభించాయి. అమృత యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) నిర్మాణాలు జరుగుతున్నాయి.
*  విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీల పెట్టుబడి ప్రతిపాదనలే రూ.10వేల కోట్లు. ఇప్పుడు.. మొదట అనుకున్న స్థాయిలో పెట్టుబడులపై ఆ సంస్థలు పునరాలోచనలో పడే అవకాశముంది.
*  11 పాఠశాలలు, 4 ఆస్పత్రులు, 15 హోటళ్లు, 2 కన్వెన్షన్‌ సెంటర్లకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. అవన్నీ ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి.
*  ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ 10 ఎకరాల్లో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో 33 అంతస్తుల ఐకానిక్‌ టవర్‌ నిర్మాణం తలపెట్టింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, నివాస ప్రాంతం అందుబాటులోకి తేవాలన్నది ఆలోచన. శంకుస్థాపన జరిగింది. దీనికి ప్రసావాంధ్రుల నుంచి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. బుకింగ్‌లు పూర్తయ్యాయి. రాజధాని తరలిపోతే ఈ ప్రాజెక్టూ సందిగ్ధంలో పడినట్టే!
*  బి.ఆర్‌.షెట్టి, ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థలు.. భారీ పెట్టుబడులతో హెల్త్‌సిటీల నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఆ రెండు ప్రాజెక్టులూ సాకారమైతే.. రూ.7-8 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. ఇండో-యూకే సంస్థతో గత ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక బి.ఆర్‌.షెట్టి సంస్థకు భూ కేటాయింపులు రద్దుచేసింది.
*  హ్యాపీనెస్ట్‌ పేరుతో ప్రజలకు ఫ్లాట్లు విక్రయించేందుకు సీఆర్‌డీఏ తలపెట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే ఫ్లాట్లు బుక్‌ అయిపోయాయి. ఈ డిమాండ్‌తో హ్యాపీనెస్ట్‌-2 ప్రాజెక్టునూ సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇప్పుడు మొదటి ప్రాజెక్టు భవిష్యత్తే అయోమయంలో పడింది.
*  శాఖమూరు పార్కులో రూ.312 కోట్ల ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు పను లు ప్రారంభించాయి. అవన్నీ గాలికి పోయినట్టే!

రైతులకు ఇచ్చిన స్థలాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవి
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సీఆర్‌డీఏ సుమారు 65 వేల ఫ్లాట్లు కేటాయించింది. వాటి విస్తీర్ణం 11,826 ఎకరాలు. వాటిలో నివాస, వాణిజ్య స్థలాలు ఉన్నాయి. రైతులతో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు వాణిజ్య, స్థిరాస్తి సంస్థలు సిద్ధమయ్యాయి. అక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే.. పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు వచ్చేవి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.