close

తాజా వార్తలు

ఉద్యోగాన్ని వదలాలంటే...తీసుకున్నవన్నీ కట్టండి!

వేతనం తిరిగి ఇచ్చేయాల్సిందే
మెరుగైన కొలువులొచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంకట స్థితి

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయంలో మీరు ఉద్యోగా? అంతకన్నా మెరుగైన కొలువు వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా? ఆ మేరకు లేఖ ఇచ్చి వెళ్లిపోవడం అంత సులువు కాదు. ఇప్పటిదాకా మీకు శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాల్ని తిరిగి చెల్లిస్తేనే రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మీకొచ్చిన మెరుగైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే.

తప్పని ఆందోళన
గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.10 లక్షలకుపైగా ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. నిర్వహించాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. సచివాలయాల్లో కొలువులకు ఎంపికైన వారిలో అత్యధికులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ), ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారితోపాటు ఇతర పోటీ పరీక్షలకు అప్పటికే హాజరైన వారు, పరీక్షలు రాసేందుకు సిద్ధమైన వారే ఉన్నారు. వీరిలో కొందరు మెరుగైన ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే ఎంపికవుతున్నారు. ఇలాంటి వారంతా రాజీనామాలు చేసి బయటకు వెళ్లాలంటే ఇంతవరకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం చేసిన ఖర్చు, మూడు నెలల వేతనం డబ్బు తిరిగి చెల్లించాలన్న జిల్లా యంత్రాంగం ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారు.

ఖజానాకు జమచేశాకే...
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ సి.మహేశ్వరరెడ్డి రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఫిబ్రవరి 6న రాజీనామా చేశారు. ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ.2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం రూ.57,095 తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయించాక సంబంధిత చలానా వివరాలతో తదుపరి ఆమోదం కోసం జిల్లా పంచాయతీ అధికారికి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయం లేఖ రాసింది. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాల్లో ఇద్దరు డిజిటల్‌ అసిస్టెంట్లు... మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారి సంబంధిత ఎంపీడీవోలకు ఇటీవల లేఖ రాస్తూ ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేశాకే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆదేశాల్లేకపోతే ఎలా సాధ్యం?
రాజీనామా చేస్తే అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ నియామక ప్రకటన (నోటిఫికేషన్‌)లో పేర్కొన్నా.. అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలివ్వలేదని అధికారులు చెబుతున్నారు. రాజీనామాలపై స్పష్టత కావాలంటూ జిల్లాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ అందలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జీతభత్యాలు, ఇతర అలవెన్సులు విధిగా వసూలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వలేదని ఆయన వివరించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.