close

తాజా వార్తలు

చిన్నది.. మళ్లీ దంచేసింది

వరుసగా మూడో విజయంతో సెమీఫైనల్లో భారత్‌
న్యూజిలాండ్‌ పరాజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌

వయసు పదహారే. ముఖంలో పసి ఛాయలింకా పోనేలేదు. కానీ  ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు షెఫాలీనే పెద్ద దిక్కయిపోయింది.  టోర్నీ ఆరంభం నుంచి విధ్వంసక బ్యాటింగ్‌తో అదిరే  ఆరంభాలనిస్తున్న ఈ చిన్నది మరోసారి చెలరేగిపోయింది.  ఆమె మెరుపు బ్యాటింగ్‌కు బౌలర్ల మెరుగైన ప్రదర్శన తోడైన వేళ  భారత్‌ స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. వరుసగా మూడో విజయంతో టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టయింది.

మెల్‌బోర్న్‌

ర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు మహిళల ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. షెఫాలి వర్మ (46; 34 బంతుల్లో 4×4, 3×6) చెలరేగడంతో గురువారం భారత్‌ 3 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. మొదట భారత్‌ 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఛేదనలో బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూజిలాండ్‌ 6 వికెట్లకు 130 పరుగులే చేయగలిగింది. అయితే గెలుపు ఖాయమనుకున్న దశలో అమెలియా కెర్‌ (34 నాటౌట్‌; 19 బంతుల్లో 6×4) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్‌ను కంగారుపెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్‌.. గ్రూప్‌-ఎ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

షెఫాలి తప్ప..: బ్యాటింగ్‌లో భారత్‌ది అదే తీరు. ఓపెనర్‌ షెఫాలి వర్మ చెలరేగి ఆడినా.. మిగతా బ్యాట్స్‌వుమన్‌ కనీస ప్రదర్శన చేయలేకపోయారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్‌ స్మృతి మంధాన (11) మరోసారి తక్కువ స్కోరుకే నిష్క్రమించింది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ షెఫాలి జట్టుకు గట్టి పునాది వేసింది. బలమైన షాట్లతో అదరగొట్టిన షెఫాలి..  స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అనా పీటర్సన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టింది. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 49/1. కానీ అదిరే ఆరంభాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 9 ఓవర్లలో 68/1తో నిలిచిన భారత్‌.. ఆ తర్వాత 43 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. షెఫాలీకి సహకరించినా.. చాలా నెమ్మదిగా ఆడిన తానియా (23; 25 బంతుల్లో 3×4) రెండో వికెట్‌ రూపంలో నిష్క్రమించింది. కాసేపటికే రోడ్రిగ్జ్‌ (10) కూడా వెనుదిరిగింది. ఆ వెంటనే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (1) పెవిలియన్‌ బాటపట్టింది. షెఫాలి 14వ ఓవర్లో ఔటైంది. వేద (6), దీప్తి  (8) కూడా విఫలమవడంతో 17.1 ఓవర్లలో భారత్‌ 111/7తో నిలిచింది. శిఖ పాండే (10 నాటౌట్‌), రాధ (14) కొన్ని పరుగులు చేయడంతో భారత్‌ స్కోరు 130 దాటింది.

బౌలర్లు కట్టుదిట్టంగా..: తక్కువ స్కోరే చేసినా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్‌పై భారత్‌ పైచేయి సాధించగలిగింది. శిఖ పాండే (1/21), రాజేశ్వరి  (1/22), రాధ (1/25), దీప్తి (1/27), పూనమ్‌  (1/32) కివీస్‌కు కళ్లెం వేశారు. అతి జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌.. 6 ఓవర్లలో 30/1తో నిలిచింది. భారత బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో 90 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది. 18 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 100/5. కివీస్‌ చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ విజయం లాంఛనమే అనుకున్నారంతా! కానీ చెలరేగి ఆడిన కెర్‌ భారత్‌ను భయపెట్టింది. 


ఆఖర్లో ఉత్కంఠ

ఆఖర్లో అమెలియా కెర్‌ మెరుపు బ్యాటింగ్‌తో కలవరపెట్టింది. పూనమ్‌ యాదవ్‌ వేసిన 19వ ఓవర్లో చెలరేగి ఆడిన ఆమె ఏకంగా నాలుగు ఫోర్లు బాదడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఆఖరి ఓవర్లో కివీస్‌కు 16 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే జెన్సన్‌ (11) బౌండరీ బాదడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ ఒత్తిడిలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన శిఖ పాండే, తర్వాతి మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చింది. చివరి రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి కెర్‌ ఫోర్‌ కొట్టింది. చివరి బంతికి శిఖ యార్కర్‌ వేయడంతో కెర్‌ భారీ షాట్‌ ఆడలేకపోయింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో జెన్సన్‌ రనౌటైంది.


భారత మహిళల ఇన్నింగ్స్‌: షెఫాలి వర్మ (సి) జెన్సన్‌ (బి) కెర్‌ 46; స్మృతి మంధాన (బి) తహుహు 11; తానియా భాటియా (సి) కెర్‌ (బి) మైర్‌ 23; రోడ్రిగ్జ్‌ (సి) కెర్‌ (బి) మైర్‌ 10; హర్మన్‌ప్రీత్‌ (సి) అండ్‌ (బి) కాస్పెరెక్‌ 1; దీప్తి (సి) జెన్సన్‌ (బి) డివైన్‌ 8; వేద ఎల్బీ (బి) కెర్‌ 6; శిఖ పాండే నాటౌట్‌ 10; రాధ రనౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133
వికెట్ల పతనం: 1-17, 2-68, 3-80, 4-93, 5-95, 6-104, 7-111, 8-133
బౌలింగ్‌: లీ తహుహు 2-0-14-1; మైర్‌ 3-0-27-2; సోఫీ డివైన్‌ 2-0-12-1; అనా పీటర్సన్‌ 2-0-19-0; హేలే  3-0-20-0; అమెలియా కెర్‌ 4-0-21-2; లీ కాస్పెరెక్‌ 4-0-19-1.

న్యూజిలాండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: ప్రీస్ట్‌ (సి) రాధ యాదవ్‌ (బి) శిఖ పాండే 12; సోఫీ డివైన్‌ (సి) రాధ యాదవ్‌ (బి) పూనమ్‌ యాదవ్‌ 14; సుజీ బేట్స్‌ (బి) దీప్తి శర్మ 6; మ్యాడీ గ్రీన్‌ (సి) తానియా భాటియా (బి) రాజేశ్వరి గైక్వాడ్‌ 24; కేథీ మార్టిన్‌ (సి) రోడ్రిగ్జ్‌ (బి) రాధా యాదవ్‌ 25; అమెలియా కెర్‌ నాటౌట్‌ 34; హేలే జెన్సన్‌ రనౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130
వికెట్ల పతనం: 1-13, 2-30, 3-34, 4-77, 5-90, 6-130
బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-27-1; శిఖ పాండే 4-0-21-1; రాజేశ్వరి గైక్వాడ్‌ 4-0-22-1; పూనమ్‌ యాదవ్‌ 4-0-32-1;    రాధ యాదవ్‌ 4-0-25-1


ఆమే ఒక సైన్యం

భారత జట్టు వరుసగా మూడు విజయాలతో ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టడంలో ప్రధాన పాత్ర 16 ఏళ్ల షెఫాలి వర్మదే. ఆమె బ్యాటింగే జట్టుకు కీలకమెంiది. మూడు మ్యాచ్‌ల్లోనూ తక్కువ పరుగులే చేసినా మెరుగైన బౌలింగ్‌తో భారత్‌ పైచేయి సాధించింది. 132, 142, 133.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లపై భారత జట్టు స్కోర్లివి. ఎన్నో అంచనాలున్న స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ వంటి సీనియర్‌ స్టార్లు పూర్తిగా విఫలమైన వేళ.. షెఫాలీనే బ్యాట్‌ ఝుళిపించకుంటే ఆ మాత్రం స్కోర్లు కూడా అయ్యేవి కావు. మిగతా బ్యాటర్లు చాలా వరకు తేలిపోయినా భారత్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే అది షెఫాలి మెరుపు ఆరంభాల చలవే. ఆరంభం నుంచే ధనాధన్‌ షాట్లతో విరుచుకుపడుతున్న ఈ అమ్మాయి ఆస్ట్రేలియాపై కేవలం 15 బంతుల్లో 29 పరుగులు చేసింది. బంగ్లాపై 17 బంతులోనే 39 పరుగులు సాధించింది. న్యూజిలాండ్‌పైనా అదే జోరు. భారత్‌ కేవలం 3 పరుగుల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్‌లో ఆమె చేసిన 46 (34 బంతుల్లో) పరుగులు ఎంత అమూల్యమైనవో వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో 114 పరుగులు చేసిన షెఫాలి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌ జాబితాలో మూడో స్థానంలో ఉంది. స్ట్రైక్‌రేట్‌ 172పైనే. తొలిసారి మహిళల ప్రపంచకప్‌ సాధించాలని ఆరాటపడుతున్న భారత్‌.. మిగతా మ్యాచ్‌ల్లో ఈ చిన్నది ఇదే జోరు కొనసాగించాలని ఆశిస్తోంది. ఇతర స్టార్లూ గాడిన పడితే కప్పు కలను నెరవేర్చుకోవడం మన జట్టుకు కష్టమేమీ కాదు. 


1
ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన తొలి జట్టు భారత్‌.


4
భారత జట్టు మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ చేరడం ఇది నాలుగోసారి. 2009, 2010, 2018లో సెమీస్‌ వరకు వచ్చింది. 


147.97

మహిళల టీ20 క్రికెట్లో షెఫాలి వర్మ స్ట్రైక్‌రేట్‌. కనీసం 200 పరుగులు చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన బ్యాటర్‌గా ఆమె నిలిచింది.  దక్షిణాఫ్రికాకు చెందిన ట్రియాన్‌ (138.31, 722 పరుగులు)ను అధిగమించింది. షెఫాలి ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌ల్లో 438 పరుగులు చేసింది. 


నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలనుకున్నా. గతి తప్పే బంతుల కోసం నిరీక్షించా. అలాంటివి పడగానే కొట్టేశా. అబ్బాయిలతో కలిసి చేసిన సాధన భారీ షాట్లు ఆడేందుకు ఉపయోగపడుతోంది. మా నాన్నకు, నాతో కలిసి ప్రాక్టీస్‌ చేసి నాకు సహాయం చేసిన అబ్బాయిలకు కృతజ్ఞతలు’’

- షెఫాలి వర

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.