close

తాజా వార్తలు

ప్రపంచం విలవిల

57 దేశాలకు కరోనా వ్యాప్తి
అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్నీ చుట్టేసిన కరోనా వైరస్‌
అంతకంతకూ పెరుగుతున్న మరణాలు
కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలు

ఒక మహమ్మారి జగతిని కమ్ముకుంటోంది. భూగోళాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ప్రపంచ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తోంది. మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంపై ప్రత్యేక కథనం.

కరోనా వైరస్‌(కోవిడ్‌ 19).. ఇప్పుడిది చైనాలోని వుహాన్‌కే పరిమితమైన అంటువ్యాధి కాదు. దాని సరిహద్దుల్ని ఎప్పుడో దాటేసి.. విశృంఖలంగా విజృంభిస్తూ.. అనేకానేక దేశాలను చుట్టబెట్టేస్తోంది. చైనాలో నమోదవుతున్న కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటే.. బయటిదేశాల్లో మాత్రం ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌కు ‘ప్రపంచ అంటువ్యాధి’గా మారే సత్తా ఉందన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికల్ని ముమ్మాటికీ నిజం చేస్తోంది. వివిధ దేశాల్లో శీఘ్రగతిన వ్యాపిస్తూ.. పదుల సంఖ్యలో ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. ఒక్క అంటార్కిటికా తప్ప మొత్తం ఆరు ఖండాల్నీ ఈ వైరస్‌ చుట్టేసింది. దీంతో అనేకదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆర్థిక వ్యవస్థల్లో అల్లకల్లోలం రేగుతోంది. ఆరోగ్య సంక్షోభాలు తలెత్తుతున్నాయి. జనం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడకుండా, వైరస్‌ సోకిన దేశాలకు ప్రయాణించకుండా వివిధ దేశాలు నిషేధం విధిస్తున్నాయి. విమాన సర్వీసుల్ని రద్దుచేస్తున్నాయి. వైరస్‌ సోకినవారిని బలవంతంగా ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చైనా తర్వాత అత్యధిక కేసులు దక్షిణకొరియా(2337)లో నమోదయ్యాయి. దేశంలో మరణాలు అంతకంతకూ పెరుగుతుండడంతో దక్షిణకొరియా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికే వణుకుతున్నారు. దీని దెబ్బకు హ్యుందాయ్‌ మోటార్స్‌ తన ప్లాంట్లలో ఒకదాన్ని తాత్కాలికంగా మూసేస్తోంది. దేగూ నగరం, చెంగ్డో కౌంటీల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

ఇరాన్‌ గజగజ
ఇరాన్‌లో నమోదైన కేసులు తక్కువే అయినా.. ఎక్కువ మరణాలు(34) సంభవిస్తుండడం ఈ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏకంగా ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మసౌమే ఎబ్తేకర్‌కు, ఆరోగ్య ఉపమంత్రికి వైరస్‌ సోకింది. వాటికన్‌లో ఇరాన్‌ తొలి రాయబారి హదీ ఖోస్రోసాహి ఈ వైరస్‌ సోకి మరణించారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఇరాన్‌ శుక్రవారం ప్రార్థనల్నీ రద్దుచేసింది. దాదాపు 10 ప్రావిన్సుల్లో పాఠశాలల్ని మూసేశారు.

ఏ దేశంలో ఏం జరుగుతోంది?
*  జపాన్‌లోని రెండో అతిపెద్ద ద్వీపం హొకైడోలో అత్యవసర పరిస్థితిని విధించారు. టోక్యోలోని డిస్నీ రిసార్ట్‌, యూనివర్సల్‌ స్టూడియోలను రెండు వారాల పాటు మూసేశారు. మార్చి రెండోతేదీ నుంచి ఏప్రిల్‌ దాకా దేశంలోని దాదాపు 40 వేల పాఠశాలల్నీ మూసేస్తారు. జపాన్‌ తీరంలోని యొకొహామాలో నిలిపిఉంచిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకలోని 705 మందికి ఈ వైరస్‌ సోకింది. ఆరుగురు మృత్యువాత పడ్డారు.
వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమెరికా భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తిని అమెరికా నిఘా సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ విదేశీ ప్రయాణం చేయకున్నా.., వ్యాధిగ్రస్తులనూ కలవకున్నా... వైరస్‌ బారిన పడడంతో ఆందోళన చెందుతున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
*  జర్మనీ.. సంక్షోభ నివారణ బృందాన్ని ఏర్పాటుచేసింది. వైరస్‌ సోకినవారికి ఎక్కడికక్కడ చికిత్సలు అందిస్తున్నారు.
*  బహిరంగ ప్రదేశాల్లో 1000 మందికి మించి గుమికూడకుండా స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. మార్చి 5వ తేదీన జరగాల్సిన జెనీవా ఆటోషోను రద్దుచేసింది.
*  చైనా, దక్షిణకొరియా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, మకావూ, ఇటలీని సందర్శించి వచ్చిన వారందరినీ ఇజ్రాయెల్‌ క్వారెంటైన్‌లో ఉంచింది.
*  వ్యాధి ప్రబలకుండా నిరోధించడానికి సౌదీ అరేబియా వీసాలను రద్దుచేసింది.
*  ఇరాన్‌కు వచ్చిపోయే విమానాలన్నింటినీ యూఏఈ రద్దుచేసింది.
*  ఇటలీలోని మిలన్‌కు 22 విమాన సర్వీసుల్ని బ్రిటన్‌ ఉపసంహరించుకుంది.
*  వైరస్‌ భయంతో అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు.
*  ఇటలీలోని 11 పట్టణాల ప్రజల్ని ఇళ్ల నుంచి బయటికి రానివ్వడం లేదు. ఐదు నగరాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్ని మూసేశారు. వెనెటో, లాండోర్డీలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని రద్దుచేశారు.


భారత్‌లో ప్రబలితే..  ప్రమాదమే సుమా!

కొవిడ్‌-19 (కరోనా) మహమ్మారి చైనా నుంచి శరవేగంతో ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తీరు భారత్‌కూ అత్యంత అప్రమత్తత సంకేతాలను పంపుతోంది. దేశంలో వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతర్జాతీయ ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో ప్రధానంగా అధిక జనసాంద్రత.. భారీగా అంతర్గత వలసలు.. బలహీన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ... పరిమిత వైద్య వసతులు... వంటి సవాళ్లున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ముప్పు ఉండొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఇంతవరకు భారత్‌లో 3 కేసులే గుర్తించినా దేశవ్యాప్తంగా 23,500 మందికి పైగా పరిశీలనలో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. భారత్‌లో జనాభా (130 కోట్ల)తో పోలిస్తే గుర్తించిన కేసుల సంఖ్య లెక్కలోకి రానంత చిన్నదే అయినా చైనా లోపల కంటే బయట దేశాల్లో ఈ మహమ్మారి ఎక్కువగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టమైన హెచ్చరికలు చేస్తోంది. ఆరోగ్య సరంక్షణకు సరైన నిధుల్లేని భారత్‌లో ఈ వ్యాధి విస్తరిస్తే పరిస్థితి ఏమిటన్న ఆందోళనలున్నాయి. ప్రస్తుతానికి అదుపు చేయగల పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఉన్న ఇతర అంటు వ్యాధులతో కలిపి ఈ వ్యాధి వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే.. ఊహించనంత వేగంగా విస్తరిస్తుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జన సాంద్రతే సమస్య
చైనాలో ఒక చదరపు కిలో మీటరు ప్రాంతంలో 148 మంది నివసిస్తుంటే.. భారత్‌లో 420 మంది జీవనం సాగిస్తున్నారు. పారిశుద్ధ్య  లోపంతో, కిక్కిరిసినట్లు ఉండే మురికివాడలూ ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఆరుగురు నగర వాసుల్లో ఒకరు మురికివాడల్లోనే ఉంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద  వాటిలో ఒకటైన ధారావీ (ముంబయి పరిధిలో) వంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇరుకిరుకు ప్రాంతాల్లో ఇళ్లుండటం వంటి కారణాలతో వ్యాధులు సులువుగా ప్రబలే అవకాశం ఉంటుంది. శ్వాస, స్పర్శ, మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం ద్వారా వైరస్‌ కారక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలెక్కువ. భారత్‌లో జనసాంద్రతే ఎక్కువ ఆందోళనకరమని.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాప్తిని పరిశీలిస్తున్న అమెరికా నిఘా సంస్థలు కూడా చెబుతున్నాయి.

అత్యధికంగా వలసలు..
చైనాలో మాదిరిగా భారత్‌లోనూ అంతర్గత వలసల శాతం ఎక్కువే. దాదాపు 45 కోట్ల మంది ఉపాధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. ఎక్కువ మంది పల్లెల నుంచి పట్టణాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కడైనా వ్యాధి ప్రబలితే నియంత్రించడం కష్టమవుతుంది. చైనాలో అక్కడి ప్రభుత్వం వ్యాధి కేంద్రమైన హుబెయ్‌ ప్రావిన్సు మొత్తాన్ని దిగ్బంధనం చేసింది. భారత్‌లో అలాంటి పరిస్థితి దాదాపు అసాధ్యమే. జీడీపీలో కేవలం 3.7 శాతం మాత్రమే ఆరోగ్య సంరక్షణకు ఖర్చుచేసే భారత్‌లో కొవిడ్‌ వంటి వ్యాధులు ప్రబలితే ఆర్థిక రంగంపై మరింత భారం పడుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖర్చులు భరించలేని ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

వేసవి.. ‘చల్లని’ కబురు!
భారత ఉపఖండంలో వేసవి ప్రారంభం కావడం ఒక రకంగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ఎక్కువగా శీతల, పొడి వాతావరణాల్లో వ్యాప్తి చెందుతుందని.. దక్షిణాసియా దేశాల్లో ఎండలు పెరుగుతుండటంతో వేడి వాతావరణంలో వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డెంగీ, క్షయ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించిన అనుభవం కూడా భారత్‌కు కొంత మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ ప్రబలకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ తెలిపారు. విదేశాల్లోని దౌత్య కార్యాలయాలు కూడా ఈ దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దు ప్రాంతాల్లో వచ్చిపోయే ప్రయాణికులను అధికార వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. కేరళలో నమోదైన 3 కేసులకు సంబంధించిన వ్యక్తులను కూడా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

వచ్చేనెలలో సైప్రస్‌లో జరిగే షూటింగ్‌ వరల్డ్‌కప్‌ నుంచి భారత్‌ వైదొలగింది.
- ఈనాడు, ప్రత్యేక విభాగం

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.