close

తాజా వార్తలు

మా ముందు నుంచే వెళ్లి..మనవరాలి తలను నిమిరాడు


కొలంబో: ఈస్టర్ పర్వదినం..తమ కష్టాలు, సంతోషాలు దేవుడికి విన్నవించుకుంటూ చర్చిలో భక్తులంతా ప్రార్థనల్లో మునిగిపోయారు. వారికి అప్పుడేమీ తెలీదు, కొద్ది సేపట్లో ఆ ప్రాంతమంతా భయానకంగా మారుతుందని. తమ తోటి వారు అన్యాయంగా ప్రాణాలు విడుస్తారని. తమలోని ఒకడిగా, అమాయకంగా కనిపించిన ఓ వ్యక్తే తమ పాలిట కాలయుముడిగా మారడతాడని. ఈ పండుగ రోజును జీవితంలో మర్చిపోలేని బాధాకర ఘటనగా మిగుల్చుతాడని. ఇదంతా శ్రీలంకలో చర్చిలు, పలు హోటళ్లు ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లినప్పటి వాతావరణం. ఆ ఘటనలో 290 మంది  అమాయక ప్రజలకు మరణించగా.. సుమారు 500 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి దిలీప్‌ ఫెర్నాండో కుటుంబ సభ్యులు తమ కళ్లెదుట జరిగిన ఘటన, తమ ఆత్మీయులు దూరమైన తీరును వివరిస్తూ వాపోయారు. చాలా బుద్ధిమంతుడిలా, చిన్న వయసు వ్యక్తిలా కనిపించిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడతాడని వారు ఊహించలేకపోయారు. కానీ ఈ ఘటనతో తాము ఏ మాత్రం వెరవమని, ఉగ్ర చర్యలు తమనేమీ చేయలేవని వారు గట్టి దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించారు. 

ఫెర్నాండో మాట్లాడుతూ..‘ప్రార్థనలు పూర్తవుతోన్న సమయంలో యుక్త వయసులో ఉన్న ఓ వ్యక్తి బరువైన బ్యాగుతో చర్చిలోకి ప్రవేశించాడు. మా కుటుంబం పక్క నుంచి వెళ్తూ.. మా మనవరాలి తల మీద నిమిరాడు కూడా. అతడే బాంబు దాడికి పాల్పడ్డాడు’ అని  వెల్లడించాడు. ప్రార్థనలు పూర్తయ్యే సమయానికి అతడు చర్చిలోకి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదని అతడు ఆశ్చర్యపోయాడు. అతడికి సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని, చాలా అమాయకంగా కనిపించాడని అతడి బంధువులు తెలిపారు. అయితే అతడు చర్చిలోకి ప్రవేశించిన వెంటనే పెద్ద బాంబు పేలుడు జరిగిందని వివరించారు. 

‘అతడి మొహంలో ఏ మాత్రం భయం, ఆత్రుత కనిపించలేదు. చాలా నిశబ్దంగా ఉన్నాడు. బాంబు పేలుడు వినగానే అక్కడి వారంతా భయంతో బయటకు పరిగెత్తారు. వారంతా చాలా ఆందోళనగా కనిపించారు. వెంటనే వారు నాకు ఫోన్ చేసి చర్చిలో ఉన్నావా? అని ప్రశ్నించారు. అయితే అదృష్టం కొద్దీ నేను బయటకు వచ్చాను ’ అని ఫెర్నాండో ఆదివారం నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబంలో ఎవరికి ఏ అపాయం చోటుచేసుకోలేదని, అయితే తన వర్గానికి చెందిన వారు చాలా మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రతిసారి మేం ఇదే చర్చికి వెళతాం. మేం చాలా అదృష్టవంతులం. కానీ మా గ్రామం చాలా బాధకు గురైంది. ఇక్కడ భారీ అంత్యక్రియలు జరగనున్నాయి’ అని వెల్లడించాడు. ‘ఈ రోజు ఉదయం చర్చి తెరవగానే నేను వెళ్తాను. మేం ఏ మాత్రం భయపడం. ఉగ్రవాదులను ఎంతమాత్రం గెలవనీయం’ అని ఉగ్రవాదులకు గట్టి సందేశం పంపాడు ఫెర్నాండో.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.