Gas cylinder Price: వచ్చే వారం గ్యాస్‌ ధర మళ్లీ పెంపు!

ప్రధానాంశాలు

Gas cylinder Price: వచ్చే వారం గ్యాస్‌ ధర మళ్లీ పెంపు!

సిలిండర్‌పై రూ.100 నష్టం వస్తోందంటున్న కంపెనీలు

దిల్లీ: వంట గ్యాస్‌ ధరలు వచ్చే వారం మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్‌పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేరకు పెంచాలన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల ఆరో తేదీనే సిలిండర్‌పై రూ.15 పెరిగింది. జులై నుంచి లెక్కిస్తే విడతల వారీగా మొత్తం రూ.90 పెరిగినట్లయింది. ఈ నెలలో సౌదీలో గ్యాస్‌ ధరలు 60 శాతం మేర పెరిగాయి.  టన్ను ధర 800 డాలర్లు (సుమారు రూ.60 వేలు) పలుకుతోంది. అందువల్ల సిలిండర్‌ ధర రూ.వందకుపైగానే పెరిగింది. ఇందులో సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం ఎంతవరకు భరిస్తుందో తెలియనందున ఏ మేరకు ధరను పెంచాలో ఇంకా నిర్ణయించలేదని ప్రభుత్వ రంగ చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. ‘‘సాంకేతికంగా చూస్తే వంట గ్యాస్‌ను నియంత్రణ సరకుగానే పరిగణిస్తారు. అంటే వీటి ధర ఎంత ఉండాలన్నది ప్రభుత్వమే నిర్ణయించవచ్చు. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు సబ్సీడీ ఇవ్వవచ్చు. అయితే ఆ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ విషయమై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సూచనలు అందలేదు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అవి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతుంటాయి. గ్యాస్‌ ధరలు నియంత్రణ పరిధిలోనే ఉన్నా, రాయితీని దాదాపుగా ఎత్తివేసింది. కొనుగోలు ధరతో సమానంగా ఉండేలా అమ్మకం ధరను దఫదఫాలుగా పెంచుతూ వస్తోంది. సబ్సిడీని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే సిలిండర్‌ ధరలు పెంచుతామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెంపు మరీ ఎక్కువగా ఉండబోదని, మధ్యస్థంగా ఉంటుందని తెలిపాయి. దిల్లీ, ముంబయిల్లో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాసు సిలిండర్‌ ధర రూ.899.50గా ఉంది. కోల్‌కతాలో రూ.926 పలుకుతోంది. సంవత్సరానికి 12 సిలిండర్లను ఈ సబ్సిడీ ధరపై అందిస్తారు.

రేషన్‌ షాపుల ద్వారా చిన్న సిలిండర్లు

రేషన్‌ దుకాణాలను లాభసాటిగా మార్చడానికి వాటి ద్వారా చిన్న గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేయించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక లావాదేవీలు జరిపే సేవలను కూడా అందించే ఏర్పాట్లు చేయనుంది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే..చమురు కంపెనీల ప్రతినిధులు, ఐటీ, ఆర్థిక, పెట్రోలియం శాఖల అధికారులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు చర్చలు జరిపారు. పెట్టుబడుల నిమిత్తం రేషన్‌ డీలర్లకు ‘ముద్ర’ రుణాలు అందించాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ విషయమై డీలర్లకు అవగాహన కలిగించాలని రాష్ట్రాలకు సూచించింది. 


పెరిగిన పెట్రో ధరలు

రెండు రోజుల విరామం అనంతరం బుధవారం పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు 35 పైసలు మేర పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోలు రూ.107.94, డీజిల్‌ రూ.96.67 పలుకుతోంది. ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.113.80, డీజిల్‌ రూ.104.75గా ఉంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని