Bharat bandh: భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన  

ప్రధానాంశాలు

Bharat bandh: భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన  

ఉత్తరాదిన సంపూర్ణం.. దక్షిణాన ఓ మోస్తరు..
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు
కాంగ్రెస్‌, వామపక్షాలు సహా పలు పార్టీల మద్దతు

దిల్లీ: కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. బంద్‌ ప్రభావం దిల్లీ, పంజాబ్‌, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లలో అధికంగా... రాజస్థాన్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో కొంత మేర కనిపించింది. తమిళనాడు, కేరళలో రైతన్నలకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక ఎస్‌కేఎం ఇచ్చిన బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్జేడీ, ఎస్సీ, ఆప్‌, బీఎస్పీ తదితర రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపినప్పటికీ బంద్‌ నిర్వహణకు దూరంగా ఉంది. ఆందోళనకారులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే పలుచోట్ల రైళ్లను, జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పంజాబ్‌లో రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో దిల్లీ, అమృతసర్‌, అంబాలా, ఫిరోజ్‌పుర్‌ డివిజన్లలో 25కు పైగా రైళ్లు రద్దయ్యాయని రైల్వేఅధికారులు తెలిపారు. ముంబయిలో బంద్‌ ప్రభావం కనిపించలేదు. దిల్లీ, పంజాబ్‌, హరియాణాల్లోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రైతులకు సంఘీభావంగా కార్మిక, ప్రజా సంఘాల కార్యకర్తలు, నేతలు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలు నిర్వహించారు. బంద్‌ పిలుపునకు దేశప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని సంయుక్త కిసాన్‌మోర్చా నేతలు తెలిపారు. 

స్పందన లేకపోవడంతోనే: రాహుల్‌  
సాగు చట్టాలకు నిరసనగా రైతు నేతలు చేపట్టిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతు తెలిపారు. నిరసనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రైతులు దేశవ్యాప్త బంద్‌ చేపట్టారని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

చర్చకు రండి: కేంద్ర మంత్రి తోమర్‌
దేశవ్యాప్త బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర వ్యవసాయమంత్రి తోమర్‌.. రైతులు ఆందోళనను వీడి.. చర్చలకు రావాలన్నారు. అన్నదాతలు లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పందిస్తూ...‘చర్చలకు మమ్మల్ని నేరుగాఎవరూ సంప్రదించలేదు’ అని చెప్పారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని