Covaxin: విదేశాల్లో కొవాగ్జిన్‌ ఉత్పత్తి!

ప్రధానాంశాలు

Covaxin: విదేశాల్లో కొవాగ్జిన్‌ ఉత్పత్తి!

ఇందుకు ఉన్న మార్గాలపై కేంద్రం అన్వేషణ
మంత్రిత్వశాఖల సమావేశంలో చర్చ

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్ల కొరతను అధిగమించే ఉద్దేశంతో వీటి ఉత్పత్తిని పెంచే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కొవాగ్జిన్‌ టీకాను విదేశాల్లో ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది. ఈ దిశగా.. అవసరమైన సౌకర్యాలున్న తయారీ యూనిట్లను  గుర్తిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచే అంశాన్ని ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దృష్టికి కూడా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఇతర కంపెనీల టీకాలను భారత్‌లో ఉత్పత్తి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రాతిపదికన భారత్‌లోని  థర్డ్‌ పార్టీ తయారీదారులకు స్వచ్ఛందంగా లైసెన్సు జారీ చేసే అంశాన్ని  ఆయా  కంపెనీల  దృష్టికి తీసుకెళ్లనుంది.

ఈ నెల 18న జరిగిన అంతర్‌ మంత్రిత్వశాఖల సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. అందులో స్వచ్ఛంద లైసెన్సు, తప్పనిసరి లైసెన్సు, పేటెంట్ల చట్టం-1970 కింద ‘ప్రభుత్వ వినియోగ అనుమతి’ సహా కొవిడ్‌ చికిత్స కోసం ఔషధాలు, టీకాల లభ్యతను పెంచడానికి ఉన్న మార్గాలను పరిశీలించారు. భారత్‌లో స్వచ్ఛందంగా మరిన్ని లైసెన్సులు ఇచ్చేలా కొవిషీల్డ్‌ తయారీదారైన ఆస్ట్రాజెనెకాతో చర్చలు జరపాలని విదేశీ వ్యవహారాల శాఖకు ఈ సమావేశం సూచించింది. కొవిషీల్డ్‌కు ముడిపదార్థాల సరఫరాలో ఇబ్బందులను అధిగమించడానికి మార్గసూచీని తయారుచేయాలని విదేశీ వ్యవహారాల శాఖ, బయోటెక్నాలజీ శాఖలకు నిర్దేశించింది. ఫైజర్‌ టీకా విషయంలో తయారీదారు ప్రతిపాదించిన నష్టపరిహార, జవాబుదారీ ఒప్పందంపై స్థాయీ నివేదికను తయారుచేసే అంశాన్ని విదేశాంగ శాఖ, నీతి ఆయోగ్‌, న్యాయశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగానికి సూచించింది. కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచడానికి బయోసేఫ్టీ లెవల్‌-3 స్థాయి ల్యాబొరేటరీ అవసరమని, అది అందరి వద్ద అందుబాటులో లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ ఇటీవల తెలిపారు. దేశంలో ఉత్పత్తి ప్రదేశాలను పెంచడానికి.. ఇలాంటి ల్యాబ్‌ను ఏర్పాటు చేయగల తయారీదారులను గుర్తించాలని బయోటెక్నాలజీ శాఖ, ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)లకు అంతర్‌ మంత్రిత్వశాఖల సమావేశం సూచించింది. బయోటెక్నాలజీ శాఖ, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ విదేశాల్లో కొవాగ్జిన్‌ ఉత్పత్తికి అనువైన కర్మాగారాలను గుర్తించాలని విదేశాంగ శాఖను కోరింది. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రాతిపదికన కొవాగ్జిన్‌ ఉత్పత్తి కోసం లైసెన్సు మంజూరు చేసినందుకు భారత్‌ బయోటెక్‌కు ఇవ్వాల్సిన రాయల్టీ సహా రాయతీలన్నింటి గురించి తెలియజేయాలని సూచించింది. కొవాగ్జిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి గత నెలలో బయోటెక్నాలజీ శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా మూడు ప్రభుత్వ రంగ కంపెనీలను రంగంలోకి దించింది. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందాలూ ఖరారయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఈ టీకా ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందుతున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని