Demat Accounts: స్తబ్దుగా ఉన్న డీమాట్‌ ఖాతాలే లక్ష్యం

ప్రధానాంశాలు

Demat Accounts: స్తబ్దుగా ఉన్న డీమాట్‌ ఖాతాలే లక్ష్యం

‘కార్వీ’ కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యకలాపాల పేరిట ఖాతాదారుల షేర్లను మళ్లించిన కార్వీ కుంభకోణం దర్యాప్తు లోతుల్లోకి వెళ్లేకొద్దీ విస్మయకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. డీమాట్‌ ఖాతాలు కలిగిన ఖాతాదారుల షేర్లను ప్రముఖ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టి లాభాలు దక్కేలా చేస్తామంటూ కార్వీ నిర్వాహకులు కుంభకోణానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఖాతాదారులకు తెలియకుండానే షేర్లను డీమాట్‌ ఖాతాల్లోంచి తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. షేర్లు కొని ఎక్కువ కాలంపాటు అలాగే వదిలేసిన దాదాపు 95 వేలకు పైగా ఖాతాల్లోని షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారు. వాటిని తమ సొంత షేర్లుగా బ్యాంకులను నమ్మించి తనఖా పెట్టడం ద్వారా ఏకంగా రూ. 2,873 కోట్ల రుణాలు పొందారు. 2019లో ఈ కుంభకోణం సెబీ దృష్టికి రావడంతో కార్వీ నిర్వాహకుల కథ అడ్డం తిరిగింది. ఈ క్రమంలో అసలైన ఖాతాదారులకు షేర్లను సెబీ తిరిగి ఇప్పించడంతో కార్వీ సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులకు నష్టం వాటిల్లినట్లయింది. అక్రమంగా మళ్లించిన షేర్లను తనఖా పెట్టి తమను మోసగించారంటూ బ్యాంకులు తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించడంతో కార్వీ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుండటంతో కుంభకోణం మూలాలు బహిర్గతమవుతున్నాయి. బ్యాంకుల నుంచి పొందిన రుణాలతో కార్వీ నిర్వాహకులు బీమా, స్థిరాస్తి వ్యాపారాలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. రుణాల మళ్లింపు కోసం ఏకంగా 40 వరకు డొల్ల కంపెనీలను స్థాపించినట్లు సమాచారం సేకరించింది. ఇప్పటికే కార్వీ సీఎండీ పార్థసారథితోపాటు ఆయన కుటుంబసభ్యుల అధీనంలో ఉన్న సుమారు రూ. 700 కోట్ల విలువైన షేర్లను జప్తు చేసిన ఈడీ.. అక్రమ లావాదేవీల ద్వారా మళ్లించిన నిధుల జాడ తెలుసుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని