Huzurabad By Election: హోరు ముగిసింది... పోరు మిగిలింది

ప్రధానాంశాలు

Huzurabad By Election: హోరు ముగిసింది... పోరు మిగిలింది

 హుజూరాబాద్‌లో ప్రచారం పరిసమాప్తం

ఓటర్ల ప్రసన్నానికి ప్రారంభమైన ప్రలోభ పర్వం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హోరాహోరీ సమరంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచార ఘట్టానికి తెరపడింది. నియోజకవర్గంలో ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచార పర్వం బుధవారం రాత్రి 7 గంటలతో ముగిసింది. ఇన్నాళ్లుగా ఇక్కడికి ఆయా పార్టీల నుంచి ప్రచారానికి వచ్చిన నేతలంతా వారి జిల్లాలకు వెళ్లిపోయారు. చివరి రోజున తెరాస, భాజపా, కాంగ్రెస్‌- మూడు పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు ప్రచారాల్లో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరఫున రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌లు హుజూరాబాద్‌, జమ్మికుంట, కమలాపూర్‌లలో ప్రచార సభలో పాల్గొని అభివృద్ధికి పట్టంగట్టాలని కోరారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సినీనటి విజయశాంతి, ఎంపీ అర్వింద్‌లు పలుచోట్ల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాలు పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ నెల 1వ తేదీన ఇక్కడి ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది మొదలు దాదాపుగా 27 రోజులపాటు రాజకీయ సందడి తార స్థాయికి చేరింది. పల్లెలు, పట్టణాలల్లో ప్రచారం హోరెత్తింది. నాయకులు, అభ్యర్థులు పోటాపోటీగా హామీల వర్షాన్ని కురిపించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. 

పలు పార్టీలు ప్రచారం ముగిసిన చివరి రోజు నుంచే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్లకు నగదును పంపిణీ చేసే పర్వానికి తెరదీసినట్లు తెలుస్తోంది. ఓటుకింత రేటు అనేలా పంపిణీ చేపట్టినట్లు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం సాగుతోంది. పలు వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను కవర్‌పైన రాసి.. లోపల నగదు ఉంచి అందించారనే ఆరోపణలు వినిపించాయి. మున్ముందు మద్యం, నగదు పంపిణీ మరింతగా కొనసాగే అవకాశముంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ఎత్తుగడలను అమలు చేసేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచనల్లో మునిగి తేలాయి.

డబ్బు, మద్యం పంపిణీపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని హైకోర్టు న్యాయవాది సయ్యద్‌ సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు. ఓటుకు రూ.6 వేలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. ఎన్నిక పూర్తయ్యేవరకు పోలీసులు, ఎన్నికల కమిషన్‌ సమర్థంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని