Chadrababu: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: చంద్రబాబు

ప్రధానాంశాలు

Chadrababu: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: చంద్రబాబు

 రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెదేపా అధినేత చంద్రబాబు వినతి
రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేలుతున్నాయి
ప్రభుత్వమే ఉగ్రవాద తరహా కార్యకలాపాలకు పాల్పడుతోందని ఫిర్యాదు
అంశాలన్నీ తీవ్రమైనవేనని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు
అమరావతిపైనా ఆరా తీశారు
మీడియాకు వెల్లడించిన తెదేపా ప్రతినిధి బృందం

దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు. చిత్రంలో పార్టీ నేతలు కాలవ శ్రీనివాసులు, కనకమేడల రవీంద్రకుమార్‌, కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేశినేని నాని

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ఉగ్రవాద తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న రాష్ట్రంలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేయడం, పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి హింసించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాష్ట్రపతిని సోమవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు చంద్రబాబు వెంట ఉన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ‘స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రర్‌ ఇన్‌ ఏపీ జూన్‌ 2019 టు అక్టోబర్‌ 2021’’ పేరుతో ముద్రించిన 323 పేజీల పుస్తకంతోపాటు, తాజా పరిణామాలను వివరిస్తూ రూపొందించిన 8 పేజీల వినతిపత్రాన్ని ప్రతినిధి బృందం రాష్ట్రపతికి అందజేసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సుమారు అరగంటసేపు చంద్రబాబు ఆయనకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న రాష్ట్రపతి మీరు చెప్పిన అంశాలన్నీ చాలా తీవ్రమైనవే (సీరియస్‌), పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ప్రతినిధి బృందం వెల్లడించింది. రాజధాని అమరావతి ఏమైంది, ఎంతవరకు వచ్చిందని రాష్ట్రపతి ఆరా తీశారు. మంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క ఇటుకా పేర్చిన పాపాన పోలేదని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడిందని.. మద్యం, డ్రగ్స్‌, ఇసుక, భూములు, గనులను దోచుకుంటూ నేరసామ్రాజ్యం విస్తరిస్తోందని వివరించారు. రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, 2019 నుంచి వ్యవస్థలన్నింటిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ తప్పులను వేలెత్తిచూపే ప్రతిపక్షాలు, ప్రజలపై ప్రభుత్వం కక్ష కడుతోందన్నారు. ప్రార్థనా స్థలాల విధ్వంసం, ప్రత్యర్థి పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై దాడులు తీవ్రమైనట్లు తెలిపారు. డీజీపీతోపాటు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై పోలీసింగ్‌ను నవ్వులపాలు చేస్తున్నారన్నారు. భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. అందువల్ల అత్యవసరంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి పరిస్థితులను చక్కదిద్దాలని కోరారు.

గంజాయి సాగు వెనుక వైకాపా హస్తం
వైకాపా నేతలతో కూడిన మాఫియా సుమారు 25 వేల ఎకరాల్లో రూ.8వేల కోట్ల విలువైన గంజాయిని పండిస్తూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశం మొత్తానికి డ్రగ్స్‌ సరఫరా చేస్తోందని చంద్రబాబు వివరించారు. ‘రాష్ట్రంలో చట్టం చట్టుబండలైందని సుప్రీంకోర్టు, హైకోర్టులు లెక్కలేనన్నిసార్లు ప్రస్తావించాయి. 2020 జులై 21న తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నేతల చేతుల్లో శిరోముండనానికి గురైన దళిత యువకుడు ఇండుగుమల్లి వరప్రసాద్‌ మీకు (రాష్ట్రపతికి) మొరపెట్టుకున్నారు. దానిపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించి ఏడాదైనా అతీగతీ లేదు.

*  రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నడుస్తున్న మాఫియాకు మద్యం వ్యాపారమే ఉదాహరణ. గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్లను ఆపేసి తమకు నచ్చిన మద్యం తీసుకొచ్చి ప్రతి సీసాపై జే-ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న క్రైమ్‌ సిండికేట్‌ మద్యం వ్యాపారంలో అడుగుపెట్టి నాసిరకమైన సొంత బ్రాండ్లను అత్యధిక ధరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
*   2019-20, 2020-21 బడ్జెట్‌లో రూ.41,043 కోట్ల ప్రజాధనానికి లెక్కలు చూపలేని స్థితికి రాష్ట్రంలో మాఫియా చేరింది. ఈ భారీఆర్థిక అక్రమాన్ని ప్రజాపద్దుల సంఘం వెలికితీసింది. దీనిపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. దీనిపై దర్యాప్తు జరపకపోతే మున్ముందు భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ జరిగే ప్రమాదం ఉంది’ అని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

తెదేపా ప్రధాన డిమాండ్లు ఇవీ..
*   ఏపీలో మద్యం, డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేలడం, ప్రభుత్వమే పోలీసులతో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నందున ఆర్టికల్‌ 356 ప్రయోగించాలి.
*  తెదేపా ప్రధాన కార్యాలయం, రాష్ట్రవ్యాప్తంగా  నాయకుల ఇళ్లపై చేసిన దాడులపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలి.
*  ఆంధ్రప్రదేశ్‌ మాదకద్రవ్యాలకు అడ్డాగా మారడంలో ప్రమేయమున్న వ్యక్తులను కనిపెట్టి శిక్షించేందుకు లోతైన దర్యాప్తు జరిపించాలి.
*  అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న డీజీపీని రీకాల్‌ చేయాలి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని