AP Bandh: ఏపీలో నిర్బంధాల నడుమతీవ్ర నిరసన

ప్రధానాంశాలు

AP Bandh: ఏపీలో నిర్బంధాల నడుమతీవ్ర నిరసన

ఆంక్షల మధ్యే కొనసాగిన తెదేపా బంద్‌
అర్ధరాత్రి నుంచే పోలీసుల మోహరింపు
ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల గృహ నిర్బంధం
పోటాపోటీ నిరసనలు.. మాటల యుద్ధాలు

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో రాజుకున్న రాజకీయ వాతావరణం బుధవారం మరింత వేడెక్కింది. కేంద్ర కార్యాలయంలో బీభత్సం సృష్టించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెదేపా బుధవారం బంద్‌ నిర్వహించింది. దీనికి పోటీగా అధికార పక్షమూ నిరసనలు చేపట్టింది. బంద్‌ను అడ్డుకునేందుకు వివిధ జిల్లాల్లో తెదేపా ముఖ్య నేతలందర్నీ మంగళవారం రాత్రి నుంచే పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని, దానికి నిరసనగా గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 వరకు... 36 గంటల పాటు నిరసన దీక్ష చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎం జగన్‌ను అనుచిత పదజాలంతో దూషించారంటూ పోలీసులు కేసు నమోదుచేసి పట్టాభిరామ్‌ని బుధవారం రాత్రి హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను తీసుకెళ్లారు. తెదేపా కార్యాలయంలో ఒక పోలీసు రిజర్వు ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా పలువురు పార్టీ నాయకులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తెదేపా, వైకాపా నాయకుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. పిరికిపందల్లా దాడి చేసి పారిపోవడం కాదని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని లోకేశ్‌ సవాలు చేశారు. పరుషంగా మాట్లాడితే ఇకపైనా ఇలాంటి పరిణామాలు తప్పవని సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులు హెచ్చరించారు.

నిర్బంధాల్ని దాటి ఎగసిన నిరసన
ఏపీలో తెదేపా కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ నేతల నివాసాలపై దాడులకు నిరసనగా ఆ పార్టీ బుధవారం చేపట్టిన బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ముఖ్య నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా ఉంచి గృహ నిర్బంధాలు చేశారు. అయినా తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.  
*తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని విశాఖపట్నం చినవాల్తేరులోని ఆయన నివాసంలో నిర్బంధించారు. విజయనగరంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి బంగ్లా గేటుకు తాళాలు వేసేశారు. మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, కళావెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తిలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులను గృహ నిర్బంధం చేశారు.  
* గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును ఇంటి నుంచి బయటకు రానీయకుండా అడ్డుకోవటంతో తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

తెదేపా కార్యాలయానికి పోలీసుల తాళం
తెదేపా నాయకులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు గుంటూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయానికి తాళాలు వేయించారు.  
*అనంతపురంలో జాతీయ రహదారిపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు బైఠాయించగా పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీగా బయల్దేరిన మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకోవటంతో వారు రోడ్డుపై బైఠాయించారు.
* విజయవాడలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వైకాపా నాయకుడు పైలా సోమినాయుడు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. మచిలీపట్నంలో మాజీ మంతి కొల్లు రవీంద్ర అరెస్టు సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది.

ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళన
ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నేతృత్వంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు అరెస్టు చేయడంతో ఎంపీకి, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని