Huzurabad By Election: జీ ‘హుజూర్‌’ ఎవరికో!

ప్రధానాంశాలు

Huzurabad By Election: జీ ‘హుజూర్‌’ ఎవరికో!

ఉప ఎన్నికలో నువ్వా నేనా?
చెమటోడుస్తున్న అభ్యర్థులు
భారీగా ఖర్చుపెడుతున్న పార్టీలు
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న బరి
హుజూరాబాద్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో తెరాస, భాజపా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అభ్యర్థులు, పార్టీల్లోనే కాదు, ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఉన్నంత ఉత్కంఠ ఇప్పుడున్నదని కొందరు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీలు అత్యధిక మొత్తం ఖర్చు చేస్తున్న నియోజకవర్గంగా హుజూరాబాద్‌ నిలిచిపోయే అవకాశం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్‌ పోటీలో ఉన్నా తెరాస, భాజపాల మధ్యనే ముమ్మర పోరు నెలకొంది. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రానున్న వారం రోజులు పార్టీలకు కీలకం కానున్నాయి. ఈటల రాజేందర్‌ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నిక అధికార తెరాసకు, ఈటలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈటల భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, తెరాస తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు.. కాంగ్రెస్‌ నుంచి విద్యార్థి నాయకుడు వెంకట్‌ పోటీలో ఉన్నారు. 2.36 లక్షల మంది ఓటర్లు ఈ నెల 30న అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. కులాల వారీగా సంఘాలతో సమావేశాలు,  విందులు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పలుకుబడి కలిగిన నాయకులను తమవైపు తిప్పుకోవడంలో పార్టీలు పూర్తిగా తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఒకవైపు నుంచి ఇంకోవైపునకు మారారు. వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు.. ఇలా అందరికీ  స్థాయిని బట్టి పార్టీలు భారీగా ముట్టజెప్తున్నట్లు ప్రచారంలో ఉంది. గెలవడానికి తాను పెట్టిన ఖర్చు ఇప్పుడు ఒకేసారి వచ్చిందని ఓ ఎంపీటీసీ సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీల్లో కూడా ప్రధాన చర్చ ఎన్నికల గురించే. తమ సమస్యల గురించి, పార్టీల గురించి మాట్లాడుతూనే ఎన్నికల్లో డబ్బు గురించి కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు.  ‘మా ఊర్లో ఫలానా నాయకుడికి అందిందంట, మావరకు ఇంకా రాలేదు, పోలింగ్‌కు ముందు ఇస్తారేమో’ అని పలువురు పేర్కొనడం గమనార్హం. మా మండలంలో సర్పంచి పదవికి పోటీ చేసిన ఓ అభ్యర్థి రాత్రికి రాత్రే రూ.రెండువేల నోట్లు పంచి గెలిచారు, ఈ ఎన్నికలోనూ డబ్బు ప్రధాన పాత్ర పోషించవచ్చని కమలాపూర్‌లోని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు.

పట్టు నిలబెట్టుకునేందుకు తెరాస..
సుదీర్ఘకాలం గెలిచిన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. వరుసగా ఆ పార్టీ తరఫున గెలిచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఈటల ప్రత్యర్థిగా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంలోనే  మకాం వేసి అన్నీ తానై వ్యవహరిస్తోన్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్‌ మార్గనిర్దేశం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కో మండలానికి ఇద్దరేసి ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జిలుగా పెట్టి గ్రామాలవారీగా వ్యూహరచన చేస్తున్నారు. పథకాల లబ్ధిదారులతో మాట్లాడడంతో పాటు గ్రామంలో  సమస్యలుంటే పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అనేకచోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీల లాంటి పనులు చేశారు. తెరాస తరఫున గెలిచి ఈటల వైపు వెళ్లిన పలువురిని వెనక్కు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నం చేసి చాలా వరకు సఫలీకృతమైనట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామాల్లో ఓ మేరకు పట్టున్న నాయకులను కూడా తిప్పుకోవడానికి గట్టి ప్రయత్నం జరిగింది. ఆయా కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను లేదా నాయకులను పిలిపించి వారితో మాట్లాడించడం.. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంపై తెరాస పట్టు బిగిస్తోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రెండేళ్లు ఏ పనులైనా తామే చేయగలమన్న అభిప్రాయాన్నీ ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

పనులు.. పరిచయాలే ఊతంగా ఈటల
తన రాజకీయ భవిష్యత్తుకు సవాలుగా మారిన ఉపఎన్నికలో గెలవడానికి ఈటల ఆత్మాభిమానాన్ని అస్త్రంగా ఎంచుకున్నారు.  భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచి పోరాడుతున్నారు. రాజీనామా చేయకముందు నియోజకవర్గంలో తనతో ఉన్న నాయకులు ఇప్పటికీ వెంటనడిచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందే గ్రామాల వారీగా పర్యటనలు చేసిన ఆయన ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్నారు. అధికార పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉండటం, 2014 నుంచి ఇటీవలి కాలం వరకు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం కూడా దీని పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గాన్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోరాడుతోంది.  భాజపా కూడా కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.  గ్రామాల వారీగా ఉన్న పరిచయాలు, వివిధ వర్గాలతో ఉన్న సత్సంబంధాలు, గ్రామాల్లో ఏదో ఒకపని చేసి ఉండటం, ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం ఈటలకు ఉపయోగపడతాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈటల వ్యక్తిగత పలుకుబడిపైనే  భాజపా ఎక్కువగా ఆధారపడింది.

ఆలస్యంగా కాంగ్రెస్‌..
ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ ఆలస్యంగా రంగ ప్రవేశం చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన కౌశిక్‌రెడ్డి  తెరాస తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ పార్టీ బలహీనపడింది. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్‌ను బరిలోకి దింపింది.  ప్రచారం జోరు పెంచుతున్నా, హోరాహోరీ పోరాడుతున్న రెండు పార్టీల మధ్య ఏ మేరకు ప్రభావం చూపగలరన్న చర్చ సాగుతోంది. ఈ పార్టీకి ఓట్లు పెరిగితే అది ప్రధాన పోటీదారుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ నామమాత్రంగానే ఉంది.


దళిత బంధు ప్రభావమెంత?

క్కో దళిత కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారికి నచ్చిన ఉపాధి పనిని ఎంచుకోవడానికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ఇది హుజూరాబాద్‌ నియోజకవర్గానికే పరిమితం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని  ప్రకటించింది. అయితే ఉపఎన్నికలో ఈ పథకం ప్రభావం ఎంత ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి సర్వే తర్వాత ఇక్కడ 24,267 దళిత కుటుంబాలున్నట్లు తేల్చారు. ఇందులో 16 వేలకు పైగా కుటుంబాలకు రూ.పదిలక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశంతో తాత్కాలికంగా ఆగిపోయిన ఈ పథకాన్ని నవంబరు రెండో తేదీన ఫలితాల తర్వాత ప్రారంభించవచ్చు. భాజపా ఫిర్యాదువల్లే ఎన్నికల కమిషన్‌ పథకాన్ని నిలిపివేసిందని తెరాస ప్రచారం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేదని భాజపా పేర్కొంటోంది. పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా ఈ పథకంపై అధికార పార్టీ ఆశలు పెట్టుకొంది. దీని ద్వారా వచ్చే మొత్తంతో ఇల్లు కట్టుకోవడంతోపాటు భూమి కొనుక్కుంటానని వంగపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పేర్కొన్నారు. అయితే దళితేతరుల్లోని కొందరు ఈ పథకంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వాళ్లకు ఇవ్వడం మంచిదే , కానీ మేం కూడా పేదోళ్లమే, మాకు కూడా ఇలాంటి సాయం చేయాలి కదా?’ అని ఒక మహిళ అభిప్రాయపడ్డారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని