భూ కబ్జాదారులకు క్రమబద్ధీకరణ హక్కు కాదు

ప్రధానాంశాలు

భూ కబ్జాదారులకు క్రమబద్ధీకరణ హక్కు కాదు

సర్కారు విధాన నిర్ణయ నిబంధనలు వర్తిస్తాయి
  ప్రభుత్వ భూమిపై సుప్రీం వ్యాఖ్య

దిల్లీ: ప్రభుత్వ/పంచాయతీ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులు ఆయా స్థలాలను తమ పేరుతో క్రమబద్ధీకరణ చేయించుకోవడాన్ని ఓ హక్కుగా పొందలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయం, అందులో నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే క్రమబద్ధీకరణ ఉంటుందని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. హరియాణాలోని సోనెపత్‌ జిల్లా సర్సద్‌ గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న నివాసితులు దాఖలు చేసుకున్న రిట్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పంచాయతీల పరిధిలోని వ్యవసాయేతర ఖాళీ స్థలాలను వాటిలో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి విక్రయించేందుకు 2008లో హరియాణా ప్రభుత్వం అనుమతించింది. అయితే, 2000 సంవత్సరం మార్చి 31కి ముందు అక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారినే కొన్ని పరిమితులతో అర్హులుగా పేర్కొంది. పిటిషనర్లు... ప్రభుత్వం అనుమతించిన స్థల విస్తీర్ణం కన్నా 200 చదరపు గజాలు అదనంగా ఆక్రమించి ఉన్నారని పేర్కొంటూ.. క్రమబద్ధీకరణ దరఖాస్తులను సోనెపత్‌ డిప్యూటీ కమిషనర్‌ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌, హరియాణా హైకోర్టులో సవాల్‌ చేసినా పిటిషనర్లకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా డిప్యూటీ కమిషనర్‌ వాదనను, హైకోర్టు తీర్పును సమర్థించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని