close

ప్రధానాంశాలు

ఒకే బాటలో జనసేన-భాజపా కలిసి పనిచేయాలని నిర్ణయం

జేపీ నడ్డా, పవన్‌ కల్యాణ్‌ మధ్య సమావేశంలో ఒప్పందం
జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో ముందుకెళ్లాలని సంకల్పం
ఇక అన్ని ఎన్నికల్లో కలిసే పోటీ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ఉద్యమం జరుగుతున్న తరుణంలో దిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కలిసి పని చేయాలని భాజపా- జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఇకపై రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానించాయి. దిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు జనసేన వర్గాలు ధ్రువీకరించాయి. ఇదే అంశంపై నెల రోజులుగా అనధికారికంగా చర్చలు జరిగినప్పటికీ సోమవారం జరిగిన సమావేశంలో ఇరువర్గాలూ తుది నిర్ణయానికి వచ్చాయి. పార్టీల పరస్పర ప్రయోజనాలతోపాటు, రాష్ట్ర ప్రయోజనాలనూ  దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఇరు పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. రెండు పార్టీల జెండాలు వేరైనా ఇక మీదట అన్ని ఎజెండాలపై ఒకే వేదికగా కలిసి పని చేయాలని అవగాహనకు వచ్చినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

3 రోజులుగా సమాలోచనలు
అమరావతి అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన పవన్‌ కల్యాణ్‌.. ఆ మర్నాడే దిల్లీ బయలుదేరి వచ్చారు. శనివారం రాత్రి దేశ రాజధాని చేరుకున్న పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ మూడురోజులుగా భాజపాకు చెందిన పలువురు నాయకులతో సమాలోచనలు జరిపారు. గత నెలలో పవన్‌ కల్యాణ్‌ దిల్లీకి వచ్చినప్పుడే దీనికి బీజం పడిందని, అనంతరం ఇరువర్గాల మధ్య పలు దఫాలు చర్చలు సాగాయని తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, రాజధాని తరలింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. ఇలా అన్ని అంశాలపై జేపీ నడ్డాతో పవన్‌ చర్చించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ తన దృష్టికి వచ్చాయని నడ్డా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇరు పార్టీలు కలిసి పనిచేసే అంశంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌లు జేపీ నడ్డాతో జరిపిన సమావేశంలో భాజపాలో కీలక వ్యక్తి, పార్టీ వ్యవస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పాల్గొన్నారు. అనంతరం వారు రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌లతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలన్నింటిలోనూ బెంగుళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య పాలుపంచుకున్నారు. పవన్‌ కల్యాణ్‌తో సాన్నిహిత్యమున్న ఆయన గత కొన్ని రోజులుగా భాజపా, జనసేన చర్చల్లో కీలకపాత్ర పోషించినట్లు జనసేన వర్గాలు చెప్పాయి. నడ్డా, పవన్‌ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తేజస్వీ సూర్య ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.