close

ప్రధానాంశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?

పత్రికల్లో కథనాలు చూసి విస్మయానికి గురయ్యాం
144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చింది?
పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశం
‘ఈనాడు’ కథనాలు, ఫొటోలు సుమోటో పిల్‌గా పరిగణనలోకి 


శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై లాఠీఛార్జి ఎలా చేస్తారు? పిల్లలు, మహిళల పట్ల అమానవీయంగా ఎలా వ్యవహరిస్తారు? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని గుర్తుందా?
ఇళ్లలోకి చొరబడి మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తారా?
200 మందికిపైగా పోలీసులతో కవాతు చేయిస్తారా? కర్ఫ్యూ ఏమైనా విధించారా?
శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?

- రాష్ట్రప్రభుత్వ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు



ఈనాడు, అమరావతి: రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. 144 సెక్షన్‌ విధింపుపై ఆక్షేపించింది. పత్రికల్లో కథనాలు, ఫొటోలు చూసి విస్మయానికి గురయ్యామని వ్యాఖ్యానించింది. ఈనెల 12, 13 తేదీల్లో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాల్ని, ఫొటోలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తనకు తానుగా (సుమోటో) విచారణకు స్వీకరించింది. ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)గా మలిచి, పలు వ్యాజ్యాలతో కలిపి సోమవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ప్రజల ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల్ని పరిరక్షించే దిశగా కీలక ఉత్తర్వులు జారీచేసింది.

నిబంధనల అమలు ఎలాగో తెలీదా?
మొదట ‘సుమోటో పిల్‌’పై విచారణ జరిపిన ధర్మాసనం.. ‘న్యాయ/చట్ట నిబంధనలను (రూల్‌ ఆఫ్‌ లా) ఎలా అమలు చేయాలో తెలీదా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘144 సెక్షన్‌ ఎలా అమలు చేయాలో తెలీదా? మీరైనా వారికి సలహా ఇవ్వాలి కదా?’ అని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఏం తీర్పు ఇచ్చిందో చూశారు కదా? అని వ్యాఖ్యానించింది. వివరాలు సమర్పించడానికి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఏజీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీసింది. పత్రికల్లో కథనాలు చూసి ఆశ్చర్యపోయామంది. ఏజీ బదులిస్తూ.. పదే పదే 144 సెక్షన్‌ విధిస్తే అధికార దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మేము తీర్పును చదివాం. 144 సెక్షన్‌ను అమలు చేసే తీరు ఇలాగేనా? ఫొటోలను చూడండి. పోలీసుల చర్యలు ఎలా ఉన్నాయో..’ అని ఏజీకి స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకున్నామని, ఆ వివరాలను కోర్టుకు సమర్పించేందుకు గడువివ్వాలని ఏజీ కోరారు. ‘పెన్‌డ్రైవ్‌లోని వీడియోను చూడండి.. 200 మందికి పైగా పోలీసులు గ్రామంలో ఎలా కవాతు చేస్తున్నారో.. కర్ఫ్యూ ఏమైనా విధించారా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ఫొటోలు చూడండి.. మహిళల పట్ల మగ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో.. ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందా? మనం ప్రజాస్వామ్య దేశంలో నివశిస్తున్నాం.. ఆ సంగతి మీకు గుర్తుందా? పౌరులకు నిరసన తెలియజేసే హక్కు ఉంది. నిరసన తెలియజేయనివ్వండి’ అని తేల్చి చెప్పింది. శుక్రవారం నాటికి పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది. 


ఇంటికెళ్లి ఇలాగేనా వ్యవహరించేది?

మరో పిటిషన్‌లో న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలపట్ల పోలీసుల తీరును ఫొటోల్లో చూడాలని ధర్మాసనాన్ని కోరారు. ఫొటోలను పరిశీలించిన కోర్టు.. ‘ఇంటికెళ్లి ఇలాగేనా వ్యవహరించేది? ఆ ఒక్క సాక్ష్యం చాలు.. వారిపై ఐపీసీ సెక్షన్‌ 345 కింద (మహిళల ఆత్మగౌరవానికి భంగం) కేసు నమోదు చేయడానికి’ అని పేర్కొంది.


ఉత్తర్వులివీ..

* జీవనోపాధి నిమిత్తం పనులకు వెళ్లే ప్రజల్ని ఇళ్ల నుంచి స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.
* శాంతియుత నిరసన ప్రదర్శనలకు అనుమతించాలి.
* దేవుళ్లు/దేవతలకు పూజలు చేసుకోడానికి అనుమతించాలి.
* సీఆర్‌పీసీ నిబంధనలను అనుసరించి తప్పితే.. ఇతర సందర్భాల్లో తనిఖీల నిమిత్తం గ్రామస్థుల ఇళ్లలోకి ప్రవేశించొద్దు.
* విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి.
* సూర్యాస్తమయం అయ్యాక ఠాణాల్లో గ్రామస్థులను అక్రమ నిర్బంధంలో ఉంచడానికి కారణమైన పోలీసులపై.. విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి.
* పత్రికల్లో, వీడియోల్లోని అంశాల్ని పరిశీలించి గాయపడిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలను కల్పించాలి.
* అరెస్టయిన వ్యక్తుల జాబితాను తక్షణమే సంబంధిత జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి.
* సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన పోలీసు అధికారులపై విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి.
* చట్ట నిబంధనలను అమలు చేయని కిందిస్థాయి / సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, డీజీపీ వివరణ ఇవ్వాలి. గ్రామస్థులు రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. 144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చిందో విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు వివరణ ఇవ్వండి. రాష్ట్రంలోని కార్యనిర్వాహక యంత్రాంగం చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.